యాపిల్‌కు రూ. 90 కోట్ల జరిమానా!

ABN , First Publish Date - 2020-12-01T02:51:28+05:30 IST

యాపిల్ ఐఫోన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు. ఐఫోన్ విడుదలవుతుందంటే చాలు నిద్రాహారాలు మాని మరీ దాని కోసం

యాపిల్‌కు రూ. 90 కోట్ల జరిమానా!

న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు. ఐఫోన్ విడుదలవుతుందంటే చాలు నిద్రాహారాలు మాని మరీ దాని కోసం ఎదురుచూసే వారు కోకొల్లలు. నాణ్యతలోను, భద్రతాపరమైన అంశాల్లోనూ మిగతా ఫోన్ల కంటే ఎంతో ఎత్తున ఉంటుంది. అంతేకాదు, వీటి ధర కూడా ఆకాశంలో ఉంటుంది. అయినప్పటికీ దాని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే, తాజాగా యాపిల్ కంపెనీకి ఇటలీ కాంపిటిషన్ అథారిటీ భారీ జరిమానా విధించింది. లేని ఫీచర్లు ఉన్నట్టు చెబుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టించిందంటూ ఏకంగా 10 మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు 90 కోట్ల రూపాయల జరిమానా విధించింది.


యాపిల్ చెబుతున్న వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కొన్ని మోడళ్లలో లేదని, స్థిర, స్వచ్ఛమైన నీటితో ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఇవి నిలబడలేకపోయాయని నిరూపితమైందని అథారిటీ పేర్కొంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ మోడళ్లు ఏవీ పరీక్షను తట్టుకోలేకపోయాయని వివరించింది. అంతేకాక, ద్రవ పదార్థాల కారణంగా పాడైన స్మార్ట్‌ఫోన్లకు వారెంటీని కవర్ చేయలేదని, ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే యాపిల్‌పై 10 మిలియన్ యూరోల జరిమానా విధించినట్టు ఇటలీ కాంపిటిషన్ అథారిటీ పేర్కొంది. 

Updated Date - 2020-12-01T02:51:28+05:30 IST