అర్జీలు ఫుల్‌.. స్పందన నిల్‌

ABN , First Publish Date - 2022-08-09T06:40:22+05:30 IST

గ్రామ, మండల స్థాయిలో కాళ్లరిగేలా తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు.. ఆదుకోండి మహాప్రభో అంటూ జనం జిల్లాకేంద్రానికి పరుగులు పెట్టడం ఎక్కువైంది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వస్తున్న వారికి ఇక్కడ కూడా సరైన స్పందన ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అర్జీలు ఫుల్‌.. స్పందన నిల్‌
స్సందనలో ప్రజల సమస్యలను వింటున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

అవే సమస్యలు.. పదేపదే ప్రదక్షిణలు

ఏళ్ల తరబడి అధికారుల  చుట్టూ తిరుగుతున్న ప్రజానీకం

భూసమస్యలు, పింఛన్లు, ఇతరత్రా ఏకరువు

నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్స్‌ నిర్వహించినా నిరుపయోగం

220కిపైగా అర్జీలు రాక.. అంతా షరామామూలే


ఒకసారి కాదు... రెండు సార్లు కాదు... నెలలు, సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మండల స్థాయిలో అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగం లేకపోవడంతో ప్రజలు జిల్లాకేంద్రానికి పరుగులు పెడుతున్నారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు చెప్పుకుంటే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని దూరప్రాంతాల నుంచి అర్జీదారులు వందలాది మంది తరలివస్తున్నారు. ఇక్కడకు వచ్చి అర్జీలు ఇచ్చినా అవి మరలా మండలస్థాయిలోకి పోతున్నాయి. అక్కడ షరామామూలే. దీంతో చేసేదేమీ లేక పలువురు మరో అర్జీ తయారుచేయించుకుని మళ్లీ జిల్లాకేంద్రానికి వచ్చి క్యూలో పడిగాపులు కాసి సమస్య విన్నవించుకోవడం కనిపించింది.

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 8: గ్రామ, మండల స్థాయిలో కాళ్లరిగేలా తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు.. ఆదుకోండి మహాప్రభో అంటూ జనం జిల్లాకేంద్రానికి పరుగులు పెట్టడం ఎక్కువైంది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వస్తున్న వారికి ఇక్కడ కూడా సరైన స్పందన ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదేపదే తిరగాల్సి రావడంతో అర్జీదారుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమాలు పెడుతున్నా మళ్లీ జిల్లా కేంద్రానికి బాధితులు భారీగా వస్తుండటం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన (గ్రీవెన్స్‌) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వాటి పరిష్కారం కోసం స్థానికంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో సుదూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ సోమవారం జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో వచ్చిన అర్జీలను పరిశీలిస్తే నెలలు, సంవత్సరాల తరబడి తిరుగుతున్నా వారే అధికంగా కనిపించారు. సుమారు 220కిపైగా అర్జీలు వస్తే వాటిలో 70శాతం భూసమస్యలు, పింఛన్లు, ఇంటిస్థలాల మంజూరు, భూ సర్వేలపైనే ఉన్నాయి.  


మా భూమిని ఇతరులకు  ఆన్‌లైన్‌ చేశారు

బొడ్డు బాలకృష్ణ, మూగచింతల, కొండపి మండలం 

మా భూమిని ఇతరుల పేరుతో ఆన్‌లైన్‌ చేశారు. పూర్వీకుల నుంచి వస్తున్న భూమి కోసం హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేసుకునే నేను ఇక్కడికి వచ్చి కొండపి, ఒంగోలులో అధికారులను కలిసి అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇటీవల ఆ భూమిని కొలతలు వేసేందుకు చలానా కట్టాలని చెప్పారు. కట్టిన తర్వాత సర్వేయర్‌ కొలతలు వేసేందుకు కూడా రావడం లేదు. చివరకు కోర్టుకు వెళ్లి స్టేఆర్డర్‌ తెచ్చుకున్నా. అయినా రాజకీయ పలుకుబడితో 50సెంట్లు ఇస్తాం... ఇక్కడి నుంచి వెళ్లిపో అని దౌర్జన్యం చేస్తున్నారు. అధికారపార్టీ ఒత్తిడితో అన్యాయం చేస్తున్నారు. మరోసారి కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించుకునేందుకు వచ్చా. 


వచ్చే పింఛన్‌ను  తొలగించారు

రామలింగం, తూర్పునాయుడుపాలెం, టంగుటూరు మండలం

వృద్ధాప్యంతో ఇబ్బందిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో పింఛన్‌ తీసుకునేవాడిని. నాలుగేళ్ల క్రితం తొలగించారు. మూడేళ్ల నుంచి టంగుటూరు, ఒంగోలు తిరుగుతూనే ఉన్నాను. అర్జీలు తీసుకుంటున్నారే తప్ప పింఛన్‌ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మీ కుమారుడికి కారు ఉంది, ట్యాక్స్‌ కడుతున్నాడని చెప్తున్నారు.. అయినా నా కుమారుడికి ఒక రేషన్‌కార్డు ఉండగా, మాకు వేరే కార్డు ఉంది. ఇవన్నీ చెప్పినా పట్టించుకోవడం లేదు. విధిలేని పరిస్థితుల్లో పెద్దసారైనా కనికరిస్తారన్న ఆశతో వచ్చా.






ఆస్తిలో భాగం ఇవ్వకుండా అన్యాయం

మాలెంపాటి సింగయ్య, కొండపి

పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిలో నాకు వాటా ఇవ్వకుండా ఇతర కుటుంబ సభ్యులు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా. కొండపి నుంచి బతుకుదెరువు కోసం వెళ్లి బాపట్ల జిల్లా నర్సాయపాలెంలో ఉంటున్నా. గతంలో అందరం కలిసి కొంతభూమిని అమ్ముకున్నాం.మిగతా భూమిని నాకు తెలియకుండా ఆన్‌లైన్‌ చేయించుకుని అమ్ముకునేందుకు చూస్తున్నారు. విషయం తెలిసి ఐదారు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.




స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యంగా ప్రహరీ కట్టారు

మద్దినేని సురేష్‌బాబు, ఎన్‌ఆర్‌ఐ

ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని యాక్సిస్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న మా స్థలాన్ని వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి సహకారంతో ఓ బిల్డర్‌ ఆక్రమించి ప్రహరీ నిర్మించాడు. నేను అమెరికాలో ఉంటుండగా, మా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. స్థలాన్ని ఆక్రమించడంతో ఇదేమిటని మా తల్లిదండ్రులు బిల్డర్‌ను ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకుండా బెదిరించారు. 2018లో మున్సిపాలిటీ వారు కొలతలు వేసి నోటీసులు కూడా ఇచ్చారు. కోర్టు స్టే కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి చెందిన సూర్యప్రకాష్‌రెడ్డిని అండగా పెట్టుకొని బిల్డర్‌ మా స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ కట్టారు. ఈ విషయంపై ఇప్పటికే ఎస్పీ మలికగర్గ్‌ను కూడా కలిసి ఫిర్యాదుచేశా. మరలా ఇప్పుడు కలెక్టర్‌ను కలిశాను. మాకు న్యాయం చేయడంతో పాటు, మా కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలి.


Updated Date - 2022-08-09T06:40:22+05:30 IST