పదవీ పంచాయితీ!

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

పదవీ పంచాయితీ!

పదవీ పంచాయితీ!
నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్న కౌన్సిలర్లు

  • స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై మున్సిపల్‌ కార్యవర్గం అత్యవసర సమావేశం
  • చైర్‌పర్సన్‌ పదవి నుంచి దిగిపోవాలని కౌన్సిలర్ల డిమాండ్‌
  • ఒప్పందం ప్రకారం జూలై 27కే పదవీ కాలం ముగిసిందని ఆందోళన
  • ఇది సమయం కాదని వారించిన చైర్‌పర్సన్‌ మంజులా రమేశ్‌
  • సమావేశం నుంచి బయటకు వెళ్లిన సొంత పార్టీ కౌన్సిలర్లు
  • సమావేశానికి దూరంగా కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు
  • మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరణ
  • పోలీసులు, ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ మధ్యనే సమావేశం
  • రసాభాసగా వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యవర్గ అత్యవసర సమావేశం

వికారాబాద్‌, ఆగస్టు 7 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన అత్యవసర సమావేశంలో అగ్గి రాజుకుంది. చైర్‌పర్సన్‌ పదవీ కాలం ముగిసిందని,  అనుకున్న ఒప్పందం ప్రకారం పదవి నుంచి వెంటనే దిగిపోవాలని సొంత పార్టీ(టీఆర్‌ఎస్‌) కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌ మంజులా రమే్‌షను డిమాండ్‌ చేయడంతో మునిసిపల్‌ కౌన్సిల్‌హాల్‌లో వేడి పుట్టించింది. కాగా, స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇక్కడ పదవికి సంబంధించిన విషయాలు మాట్లాడొద్దని చైర్‌పర్సన్‌ మంజుల కౌన్సిలర్లను వారించింది. దీంతో కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మీరు జూలై 27 వరకు మాత్రమే మాకు చైర్‌పర్సన్‌.. ఆ తర్వాత మీరు కూడా మాతో పాటు ఒక సాధారణ కౌన్సిలర్‌ అని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ముందుగానే ఓ ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను చైర్‌పర్సన్‌ ఏర్పాటు చేయడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనివిధంగా ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారని కౌన్సిలర్లు నిలదీసి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. బయట పోలీసులు, లోపల వీడియోగ్రాఫర్‌ను పెట్టి సభ్యులను చైర్‌పర్సన్‌ అవమాన పరుస్తున్నారని వారు పేర్కొన్నారు. దాదాదపు గంటసేపు జరిగిన సమావేశంలో సభ్యులు చైర్‌పర్సన్‌ పదవీకాలం ముగిసినా ఎందుకు కొనసాగుతున్నారనే అంశం మీదనే గొడవపడ్డారు. చైర్‌పర్సన్‌ తీరును నిరసిస్తూ సొంత పార్టీ కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. సమావేశానికి కాంగ్రెస్‌ కౌన్సిలర్లతో పాటు ఉన్న ఒక్క బీజేపీ కౌన్సిలర్‌ కూడా హాజరు కాకపోవడం విశేషం. ఈ తతంగం చేస్తుంటే ముందుగానే సమావేశంలో గొడవ జరుగుతుందనే ఉద్దేశంతోనే పక్క పార్టీ నాయకులు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఎప్పుడూ లేనివిధంగా పోలీస్‌ బందోబస్తు, వీడియోగ్రాఫర్‌ ఏర్పాట్లు చేయడంతో.. రగడ జరుగుతుందని కౌన్సిల్‌లోని ఇరువర్గాల సభ్యులకు ముందస్తు సమాచారం ఉన్నట్లు స్పష్టమైంది. ఇదిలావుంటే సాధారణ సమావేశాలకు రిపోర్టర్లకు అనుమతివ్వని అధికారులు, ఇలాంటి సమావేశాలకు కూడా రిపోర్టర్లను రానివ్వక పోవడం పట్ల కమిషనర్‌ తీరుపై రిపోర్టర్లు మండిపడ్డారు. దీంతో ఈ విషయమై చైర్‌పర్సన్‌ను వివరణ కోరగా.. పదవికి సంబంధించి ఏమైనా మాట్లాడేందుకు ఇది పార్టీ కార్యాలయం కాదని, ఇది మునిసిపల్‌ కార్యాలయం అని ఆమె అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను గౌరవించాలని, వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో సమావేశమయ్యామని, పదవి కోసం మాట్లాడం సరికాదని, కౌన్సిలర్లు మన జాతీయ జెండాకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. కౌన్సిలర్లు సురేష్‌, అనంత్‌రెడ్డి, రామస్వామి, లంక పుష్పలతారెడ్డిలు మాట్లాడుతూ.. చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌ జూలై 27 వరకు మాత్రమేనని పదవీలో కొనసాగాలని, అనుకున్న ఒప్పందం ప్రకారం ఆమె దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. అనంతపద్మనాభ స్వామి సమక్షంలో పెద్దల మధ్య చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ పదవీకాలం రెండున్నర సంవత్సరాల అగ్రిమెంట్‌ రాసుకోవడం జరిగిందని, అది నిజం కాకపోతే అనంతపద్మనాభ స్వామిపై చైర్‌పర్సన్‌ను ఒట్టేసి చెప్పమనండి.. అంటూ వారు ప్రశ్నించారు. మూడు నెలలుగా ప్రజాసమస్యలపై ఒక్క సమావేశం నిర్వహించాలేదని,కావాలని మొండివైఖరి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తాము మొదటగా పాలనచేస్తే.. వారు ఇప్పుడు ఊరుకునేవారా? అని ప్రశ్నించారు. ఏదిఏమైనా చైర్‌పర్సన్‌ మంజుల ప్రస్తుతం మాతో పాటు ఒక కౌన్సిలర్‌ అనే విషయాన్ని గుర్తించుకోవాలని, ఈరోజు సమావేశంలో మమ్మల్ని దొంగల్లా చూసి అవమానించారని వాపోయారు. పోలీసులను పెట్టుకోవడం, వీడియో తీయడం తమను అవమానపర్చినట్లేనని అన్నారు.

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST