సముచిత నిర్ణయం

ABN , First Publish Date - 2022-04-21T06:18:12+05:30 IST

సర్వసాధారణంగా కిందికోర్టు తీసుకున్న నిర్ణయాన్ని దాని పైకోర్టు రద్దుచేయడమో, సమర్థించడమో జరిగినప్పుడు ప్రజలకు అంతగా పట్టదు. కానీ, దేశాన్ని కుదిపేసిన లఖింపూర్ ఖేరీ కేసులో సుప్రీంకోర్టు ప్రకటించిన నిర్ణయం...

సముచిత నిర్ణయం

సర్వసాధారణంగా కిందికోర్టు తీసుకున్న నిర్ణయాన్ని దాని పైకోర్టు రద్దుచేయడమో, సమర్థించడమో జరిగినప్పుడు ప్రజలకు అంతగా పట్టదు. కానీ, దేశాన్ని కుదిపేసిన లఖింపూర్ ఖేరీ కేసులో సుప్రీంకోర్టు ప్రకటించిన నిర్ణయం అత్యధికులకు సంతోషాన్ని కలిగించింది. ఈ దారుణఘటన ప్రజల మనస్సుల్లోనుంచి ఇంకా చెరిగిపోకపోవడం, నిందితుడి తండ్రి కేంద్రమంత్రి కావడం, సర్వోన్నత న్యాయస్థానం బాధితుల పక్షాన నిలవడం వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. వీటన్నింటినీ మించి, అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విధానాన్ని తప్పుబడుతూ, ఇటువంటి సందర్భాల్లో బాధితుల గోడు పట్టించుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన హితవు ఎంతో చక్కనిది. ఒక అత్యంత ప్రాధాన్యం కలిగిన క్రిమినల్ కేసులో హైకోర్టు సవ్యంగా, ప్రజాస్వామికంగా వ్యవహరించలేదని ఎత్తిచూపుతూ అది ఇచ్చిన బెయిల్ సుప్రీంకోర్టు రద్దుచేయడం అరుదైన విషయమే.


నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు సహా ఎనిమిదిమంది ప్రాణాలు తీసిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేసే విషయంలో హైకోర్టు మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే, హ్రస్వదృష్టి, తొందరపాటు వంటి మాటలు సర్వోన్నత న్యాయస్థానంతో అనిపించుకొని ఉండేది కాదు. సంఘటన జరిగిన తీరు, తీవ్రత, నిందితుడి పాత్ర, అతడి వ్యవహారం ఇత్యాది అంశాలను ఏ కేసులో అయినా సరే బెయిల్ మంజూరు చేస్తున్న సందర్భంలో న్యాయమూర్తులు గమనించే కీలకాంశాలు. బెయిల్ ఇచ్చిన పక్షంలో దాని ప్రభావం, సదరు వ్యక్తి కేసునూ సాక్ష్యాలనూ తారుమారుచేయగల, బాధితులను భయపెట్టగల అవకాశాలవంటివి కూడా సహజంగానే పరిగణనలోకి తీసుకుంటారు. నిందితుడు జైలు బయటకు పోవడమే కాక, దేశాన్నే వదిలిపోయే అవకాశాలున్నాయా? అన్నదీ పరిశీలించాల్సిన అంశమే. ఆయనో కేంద్రమంత్రి కుమారుడు కనుక దేశాన్ని విడిచి ఎక్కడకు పోతాడన్న వాదన వినడానికి బాగుంటుంది తప్ప, బెయిల్‌కు అదొక్కటే ప్రాతిపదిక కాలేదు. అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు ప్రక్రియలో నిరర్థకమైన, అసంగత అంశాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైన, విధానపరమైన అంశాలను విస్మరించిందని సుప్రీంకోర్టు తీర్మానించింది.


బాధితుల హక్కుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు  ఉత్తమమైనవి. కేసుకు సంబంధించిన ప్రతీదశలోనూ వారి స్థానాన్ని గుర్తించి గౌరవించడంలో హైకోర్టు సరిగా వ్యవహరించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయం. నిందితుడిని వదిలేసినప్పుడు అప్పీలు చేసుకొనే హక్కువంటివే కాక, బెయిల్ దశలోనూ బాధితుల వాదనలు వినాల్సిందేనంటూ సుప్రీంకోర్టు లోతుగా ఆ అంశాన్ని స్పృశించడం భావి న్యాయప్రక్రియలను ప్రభావితం చేసేదే.  నిందితులను శిక్షించే క్రమంలో బాధితుల పాత్ర కొన్ని దశలకే పరిమితం కాదని దాని అర్థం. వర్చువల్‌గా సాగిన ఈ బెయిల్ విచారణలో ఒక దశలో బాధితుల తరఫు న్యాయవాది ఇంటర్నెట్ కనెక్షన్ కోల్పోయినప్పటికీ అతని వాదన మళ్ళీ వినేందుకు హైకోర్టు ఒప్పుకోలేదట. హైకోర్టు ఈ విధంగా ఎందుకు వ్యవహరించిందో తెలియదుకానీ, సుప్రీంకోర్టు తన పాతికపేజీల తీర్పులో బాధితుల హక్కులను ఎత్తిపడుతూ, బెయిల్ మంజూరు విధానాలకు కొత్త భాష్యం చెప్పింది. 


గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపైకి అశిష్ మిశ్రా వాహనాన్ని పోనిచ్చి అమాయకులను పొట్టనబెట్టుకున్న తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు ఏ రీతిన వ్యవహరించారో తెలియనిదేమీ కాదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను పదవినుంచి తప్పించకపోగా, కొడుకును కాపాడటానికి చివరివరకూ ప్రయత్నాలు జరిగాయి. సుప్రీంకోర్టు జోక్యం తరువాత, పలుమార్లు నిలదీసిన అనంతరం, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడ్డాక కేసు కొంత ముందుకు నడిచింది. అశిష్‌కు బెయిల్ రాకుండా చూడమని యూపీ ప్రభుత్వానికి సిట్ చెప్పవలసి వచ్చింది. బాధితుల తరఫున నిలవాల్సిన మీరు ఈ బెయిల్ మంజూరును సవాలుచేస్తున్నారా లేదా అని సుప్రీంకోర్టు అడిగింది. కానీ, నిందితుడు అస్మదీయుడు అయినందున బెయిల్ పై అప్పీలు చేయకుండా మౌనం వహించాలని పాలకులు నిర్ణయించుకున్నారు.  తప్పుచేసినవారి పక్షాన ససేమిరా నిలవకూడని పాలకుల వైఖరికంటే, అలహాబాద్ న్యాయస్థానం ప్రక్రియ ఆశ్చర్యం కలిగిస్తుంది. దానిని సరిదిద్దుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది.

Updated Date - 2022-04-21T06:18:12+05:30 IST