
- ఆమోదం తెలిపిన బోర్డులు
- 3:10 నిష్పత్తిలో షేర్ల కేటాయింపు
న్యూఢిల్లీ: దేశ కార్పొరేట్ రంగంలో మరో విలీనం చోటు చేసుకుంది. ప్రముఖ మూవీ ఎగ్జిబిషన్ సంస్థ ఐనాక్స్ లీజర్.. మరో ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీ పీవీఆర్ లిమిటెడ్లో విలీనమవుతోంది. ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఇందుకు ఆమోదం తెలిపాయి. పూర్తిగా షేర్ల కేటాయింపు పద్దతిలో ఈ విలీనం జరగనుంది. ప్రతి 10 ఐనాక్స్ లీజర్ షేర్లకు.. 3 పీవీఆర్ లిమిటెడ్ షేర్లు కేటాయిస్తారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కానుంది. విలీనం తర్వాత కంపెనీ పేరు పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్గా మారుతుంది.కొత్త కంపెనీ ఈక్విటీలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం, ఐనాక్స్ లీజర్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని రెండు కంపెనీల ప్రమోటర్లు భావిస్తున్నారు. ఈ విలీనంతో 1,500కుపైగా స్ర్కీన్లతో పీవీఆర్ ఐనాక్స్ అతిపెద్ద మల్టీప్లెక్స్ కంపెనీగా అవతరించనుంది.