22,000 ఖాళీ పోస్టులు

ABN , First Publish Date - 2021-12-03T15:21:53+05:30 IST

పాఠశాల విద్యాశాఖలో సుమారు 22వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో ఎక్కువగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతోపాటు ఖాళీ పోస్టులపై పూర్తి సమాచారాన్ని అధికారులు..

22,000 ఖాళీ పోస్టులు

పాఠశాల విద్యాశాఖలో.. 

వీటిలో ఉపాధ్యాయ పోస్టులే ఎక్కువ

ఖాళీలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖలో సుమారు 22వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో ఎక్కువగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతోపాటు ఖాళీ పోస్టులపై పూర్తి సమాచారాన్ని అధికారులు సేకరించినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కొంతకాలంగా ఈ విషయంపై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. అధికారులు సేకరించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 1.31 లక్షల పోస్టులను మంజూరు చేశారు. ప్రస్తుతం 1.09 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే 22వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, కొత్త జిల్లాలు ఏర్పడినందున అదనపు పోస్టుల అవసరాన్ని కూడా అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో 12 డీఈవో పోస్టులు ఉండగా, ప్రస్తుతం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు.


అయితే కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా డీఈవో పోస్టులను 12 నుంచి 33కి పెంచాల్సి ఉంది. అలాగే డిప్యూటీ డీఈవో పోస్టులు 56 ఉండగా, నలుగురు పనిచేస్తున్నారు. మారిన పరిస్థితుల్లో 72 డిప్యూటీ డీఈవో పోస్టులు ఉండాలి. అంటే ఇంకా 16 పోస్టులను కొత్తగా మంజూరు చేయాల్సి ఉంది. అలాగే కొత్త మండలాలను ఏర్పాటు చేసినందున మొత్తం 578 ఎంఈవో పోస్టులు కావాలని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 443 ఉన్నాయి. అంటే ఇంకో 135 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మంది ఎంఈవోలు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే, కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా, టీచర్లు ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రేషనలైజేషన్‌ ద్వారా దీన్ని సరిచేయాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక అవరోధాలు ఎదురవడంతో ప్రస్తుతానికి దీన్ని పక్కనపెట్టారు. ఇది పూర్తయ్యాకే ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమవుతారనే విషయంపై స్పష్టత రానుంది. ఆ తర్వాతే పోస్టుల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2021-12-03T15:21:53+05:30 IST