యాప్‌లతో కుస్తీ బోధన నాస్తి!!

ABN , First Publish Date - 2021-03-07T04:35:17+05:30 IST

పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు కెప్టెన్‌లాంటి వాడు. పాఠాలు చెప్పడంతోపాటు బడిలోని ఉపాధ్యాయులందరినీ ముందుండి నడిపిస్తూ విద్యార్థులకు ఉత్తమ బోధన అందేలా మార్గనిర్దేశనం చేయవలసిన బాధ్యత హెచ్‌ఎంలది.

యాప్‌లతో కుస్తీ  బోధన నాస్తి!!

ఒత్తిడిలో ప్రధానోపాధ్యాయులు

ఒక్కో యాప్‌కు ఇన్‌చార్జులుగా ఉపాధ్యాయులు

రోజూ ఆన్‌లైన్‌తో యుద్ధమే!

గంటగంటకు వివరాల నమోదు

పాఠాలపై దృష్టి సారించని ఉపాధ్యాయులు

విద్యార్థుల్లో తగ్గుతున్న ప్రమాణాలు


నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), మార్చి 6 : పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు కెప్టెన్‌లాంటి వాడు. పాఠాలు చెప్పడంతోపాటు బడిలోని ఉపాధ్యాయులందరినీ ముందుండి నడిపిస్తూ విద్యార్థులకు ఉత్తమ బోధన అందేలా మార్గనిర్దేశనం చేయవలసిన బాధ్యత హెచ్‌ఎంలది. అయితే ప్రభుత్వ విద్యాలయాల్లోని ప్రధానోపాధ్యాయులు కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.  ప్రభుత్వ నిర్దేశిత పనుల ఆన్‌లైన్‌ నమోదు వారికి పెద్ద తలనొప్పిగా మారింది. గంటగంటకు ఆన్‌లైన్‌లో సమాచారం పొందుపరచాల్సి ఉండటంతో ఆ పనిని చేయలేని ప్రధానోపాధ్యాయులు ఒక్కో యాప్‌నకు ఒక్కో ఉపాధ్యాయుడిని  ఇన్‌చార్జిగా నియమించి విద్యార్థులకు చదువు చెప్పే సమయం కంటే యాప్‌లతో కుస్తీ పట్టేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు గంటల సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా మారిపోయారు.


గంటగంటకు నమోదు...

విద్యార్థులకు పరీక్షలు, ఆటల పోటీలు నిర్వహించేలా ఉపాధ్యాయులకు ప్రతి రోజూ ఓ టాస్క్‌ ఇచ్చి వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటి వివరాలను గంట గంటకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్దేశించింది. కాగా, రోజూ పాఠశాలల్లో జరిగే ఆన్‌లైన్‌ నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయం పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు వచ్చిన తర్వాత ముందుగా ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని ఆన్‌లైన్‌లో వేయించాలి. సర్వర్‌ బిజీ, నెట్‌వర్క్‌ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రక్రియ గంటసేపు సాగుతోంది. 

ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఎంఈవో కార్యాలయం ఏర్పాటు చేసిన గ్రూప్‌ ద్వారా తెలియజేయాలి.

విద్యార్థుల హాజరును రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ఈ పక్రియకు కనీసం గంట సమయం పడుతోంది.

మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద పథకం వివరాలను ప్రతి రోజూ  ఐఎంఎంఎ్‌సఎఫ్‌ యాప్‌లోని కాలమ్స్‌ ప్రకారం నమోదు చేయాలి. భోజనం చేసే స్థలం బాగుందా? విద్యార్థులు ఎంత మంది హాజరయ్యారు?, ఎన్ని గుడ్లు ఇచ్చారు?... ఇలా పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరిచి ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. ఇందుకు కనీసం గంట సమయం పడుతుంది.

ఇక రోజూ శానిటైజేషన్‌ గురించి ఫొటోలతో సహా వివారాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ఇది పూర్తి చేయడానికి అరగంటకుపైగా పడుతోంది.

పాఠశాల ముగిసిన తర్వాత సాయంత్రం ఇన్‌, ఔట్‌ ఉపాధ్యాయుల ఈ - హాజరు వివరాలను పొందుపరచాలి. దీనికో అరగంట పడుతోంది.

ఇవికాక అమ్మబడి పథకం అందని విద్యార్థుల వివరాలు అప్‌డేట్‌ చేయడం, జగనన్న విద్యాకానుక అందని వారి వివరాలు పొందుపరచడం, ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పడం, ముందుగా ఇచ్చేసిన జగనన్న విద్యాదీవెన కిట్లకు తల్లి వేలి ముద్రలు వేయించుకోవడం, నాడు - నేడు పథకం పనుల పర్యవేక్షణ వంటివి నిత్యకృత్యం. 


ఉపాధ్యాయులు ఇన్‌చార్జులుగా...

ఇన్ని పనులను ప్రధానోపాధ్యాయులు ఒక్కరే చూసుకోలేక ఒక్కో పనిని ఒక్కో ఉపాఽధ్యాయుడికి అప్పగిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు గంటల సమయం ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరచడానికే సమయం కేటాయిస్తూ విద్యార్థుల బోధనపై దృష్టి సారించటంలేదు. కొందరు ఉపాధ్యాయులు పాఠాలు బోధించాల్సిన పనిలేదని, ప్రశాంతంగా ఆన్‌లైన్‌లో ఉండవచ్చని ఆనందిస్తుంటే, అధికులు మాత్రం విద్యాబోధన సక్రమంగా చేయలేక పోతున్నామని బాధపడుతున్నారు. ఒకరు, ఇద్దరు ఉపాధ్యాయు లు ఉన్న పాఠశాలల్లో పరిస్థితులైతే మరీ ఘోరంగా ఉంటున్నాయి. ఉదయం బడి తెరిచినప్పటి నుంచి సాయం మూసే వరకు రోజూ గంటల సమయం ఆన్‌లైన్‌ నమోదుతోనే అయ్యవార్లకు సరిపోతుంటే ఇక పాఠాలు ఎప్పుడు చెప్తారు పాపం.

Updated Date - 2021-03-07T04:35:17+05:30 IST