యాప్‌లతో కుస్తీ.. బోధన నాస్తి!

Nov 15 2021 @ 22:14PM

పక్కదారి పడుతున్న గురువుల బాధ్యతలు

పనిభారంతో ఉపాధ్యాయుల ఆందోళన

అటకెక్కుతున్న పిల్లల చదువులు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం 


నేటిబాలలే రేపటి పౌరులు. వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. అలాంటి గురువులు అదనపు బాధ్యతలతో నలిగిపోతున్నారు. బోధన మాట ఏమోగాని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లతో కుస్తీ పడుతున్నారు. బయోమెట్రిక్‌ హాజరు, నాడు-నేడు ప్రోగ్రస్‌, మధ్నాహ్న భోజన పథకం, పారిశుధ్యం నిర్వహణపై ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్‌ చేయడం తలకు మించిన భారంగా మారింది. అదే సమయంలో సర్వర్‌ సమస్యలు, సిగ్నల్స్‌ ఇబ్బందులు వెరసి బోధనపై దృష్టి పెట్టలేని పరిస్థితులు బడుల్లో నెలకొన్నాయి. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు పాఠశాలలను సందర్శించినపుడు యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్‌ చేశారా!? లేదా!? అని మాత్రమే అడుగుతున్నారు తప్ప పిల్లల చదువుల గురించి పట్టించుకోవడం లేదు. 


నెల్లూరు (విద్య) నవంబరు 15 : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు యాప్‌ల నమోదుతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం యాప్‌లతో కుస్తీ పడుతూ మగ్గిపోతున్నారు. పాఠశాల నిర్వహణలో వీటి ప్రవేశంపై వారంతా భగ్గుమంటున్నారు.  జిల్లాలో 2,688 పాథమిక, 361 ప్రాథమికోన్నత, 418 ఉన్నత పాఠశాలలు కలిపి 3,467 సర్కారు బడులు ఉన్నాయి. ప్రాఽథమిక పాఠశాలలైతే ఒకరు, ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు లేదా ముగ్గురు టీచర్లకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడంతోనే సమయం సరిపోతోంది. బోధనకు సమయం దొరక్క విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. విద్యాశాఖలో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు పాఠశాలలను సందర్శించినపుడు యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్‌ చేశారా లేదా...అని మాత్రమే అడుగుతున్నారు తప్ప పిల్లల చదువుల గురించి పట్టించుకోవడం లేదు. 


సమయమంతా యాప్‌లకే....

విద్యార్థుల హాజరు పేరుతో ఒక యాప్‌ నడుస్తోంది. అలాగే జగనన్న విద్యాకానుక, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, యూనిఫాం, నోటు పుస్తకాల పంపిణీకి ఒకటి, అమ్మఒడి పథకానికి అర్హులను గుర్తించేందుకు, డ్రైరేషన్‌ పేరుతో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, చిక్కీల పంపిణీ వివరాలు నమోదుకు, విద్యార్థులకు బూట్లు సరఫరా చేసేందుకు వారి పాదాలు కొలతలు తీసేందుకు మరొకటి ఇలా అనేక రకాల యాప్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మధ్యాహ్న భోజనంలో అమలవుతున్న జగనన్న గోరుముద్ద పథకం తనిఖీ బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. ఐఎంఎంఎస్‌ యాప్‌లో సమాచారం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి అరగంట సమయం పడుతోంది. అదే సమయంలో హాజరు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటోంది. దీనికి మరో 30 నిమిషాలు తీసుకుంటోంది. మరుగుదొడ్లు శుభ్రం చేయించిన చిత్రాలు తీసి టాయిలెట్‌ మానటరింగ్‌ (టీఎంఎఫ్‌) యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దీనికి 45 నిమిషాలు సమయం తీసుకుంటుంది. మనబడి, నాడు-నేడు (ఎంబీఎన్‌ఎన్‌) ప్రోగ్రెస్‌, బిల్లులు అప్‌లోడ్‌ చేయడానికి 40 నిమిషాలు పడుతోంది. జగనన్న విద్యాకానుక కింద అందచేసే బూట్లు, బడిసంచి, పుస్తకాలు, బెల్టు తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు తల్లిదండ్రుల బయోమెట్రిక్‌ వేయించాల్సి ఉంటుంది. విద్యార్థుల మార్కుల ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు షూ సైజులు కూడా పొందుపరచాలి. ఉపాధ్యాయుల సెలవులు ఏపీటీఈఎల్‌ఎస్‌ యాప్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణలు, వివిధ కోర్సుల వివరాలు దీక్ష యాప్‌లో అందుబాటులో ఉంచాలి. ఇలా వీటన్నింటినీ  రోజూ నమోదు చేయాల్సిందే.


పనిచేయని సర్వర్లతో...

ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌తోపాటు సర్వర్‌లు సరిగా పనిచేయకపోవడంతో ఉపాధ్యాయుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఐఎంఎంఎస్‌ యాప్‌లో బాల, బాలికల మరుగుదొడ్లు యాప్‌లతో వేర్వేరుగా కమోడ్స్‌, యూరినల్స్‌కి, వాష్‌బేసిన్‌, ఫ్లోర్‌ మొత్తం 24 ఫోటోలు అప్‌లోడ్‌ చేయాలి. అదేవిధంగా మధ్నాహ్నం భోజనానికి సంబంధించి వండిన ఆహార పదార్థాలు వేర్వేరుగా వరుస క్రమంలో మొత్తం 20 ఫొటోలను ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేయాలి. ఉపాధ్యాయుల సొంతఫోన్లలో వేయించుకున్న డేటాతోనే ఇవ్వన్నీ పూర్తి చేయాలి. రోజుకు ఒక అప్‌డేట్‌, అన్‌ ఇన్‌స్టాల్‌, డౌన్‌లోడ్‌, ఇదేపని రిపీటెడ్‌గా చేయాలి. అలాగే పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు ఆన్‌లైన్‌ నమోదు పెద్ద ప్రహసనంగా మారింది. విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, బ్లడ్‌ గ్రూప్‌లు, పుట్టుమచ్చలు, మెయిల్‌ ఐడీలు, ఇలా చాంతాడంత సమాచారం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సాఫీగా త్వరగా అవుతాయనుకుంటే పొరపాటే..గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్‌ ఉండవు. దీంతో టీచర్లు పడే బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. 


వేధిస్తున్న యాప్‌ల భారం

పాఠశాలల్లో ఉపాధ్యాయులను యాప్‌లు వేధిస్తున్నాయి. సమయమంతా వీటికే కేటాయిస్తూ బోధనపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఇంటర్నెట్‌, సర్వర్‌ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇవేమి పట్టించుకోకుండా మెమోలు, వాట్స్‌పలో జాబితాలు, ఫోన్లలో వేధింపులకు గురిచేస్తున్నారు. పరిశీలనకు వచ్చే అధికారులు సైతం పిల్లల గురించి కాకుండా యాప్‌ల గురించే వివరాలడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే వీటిని తొలగించాలి. విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలి. దీనిపై యుటీఎఫ్‌ మాత్రం పోరాటం కొనసాగిస్తుంది.

- పి.బాబురెడ్డి, యుటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు


బోధనకు అడ్డంకే!

విద్యాశాఖలోని యాప్‌లు బోధనకు తీవ్ర ఆటంకంగా మారాయి. ఉపాధ్యాయులు బోధన కంటే యాప్‌లు అప్‌లోడ్‌ చేసే పనికే పరిమితం అవుతున్నారు. ఏరోజుకారోజు యాప్‌లు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గించకపోవడం విచారకరం...విద్యాహక్కు చట్టం బోధనేతర పనులు చెయ్యకూడదని చెపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీచర్లపై అదనపు భారం మోపుతూ వారిని మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వీటిని తొలగించి విద్యార్థుల బోధనపై దృష్టి సారించాలి. 

- వివి.శేషులు, యుటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి


రోజంతా యాప్‌లతోనే కుస్తీ

పాఠశాలలకు వెళ్లిన రోజంతా కూడా యాప్‌లతోనే కుస్తీ పడాల్సి వస్తోంది. సామర్ధ్యంలేని యాప్‌లతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సరిగా ఉండకపోవడంతో టీచర్లు పడే వేధన అంతా ఇంతా కాదు. దీంతో విలువైన బోధనా సమయంతా వృధా అవుతోంది. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసే యాప్‌లను తొలగించి ఒత్తిడి నుంచి దూరం చేయాలి. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం.

- అల్లంపాటి సురేంద్రరెడ్డి, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు


యాప్‌లను వెంటనే రద్దు చేయాలి

విద్యాబోధన అంతా నిర్వీర్యం చేస్తున్న యాప్‌లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. అనవసరమైన యాప్‌లతో సమయంతా వీటికే కేటాయిస్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. సమయానికి అప్‌లోడ్‌ కాకపోవడంతో ఉపాధ్యాయులు మానసికంగా, శారీరకంగా కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. సింగిల్‌ టీచర్ల పరిస్థితి వర్ణణాతీతం. ప్రభుత్వం దీనిపై పునరాలోచించి వెంటనే ఈ యాప్‌ల నుంచి విముక్తి కలిగించాలి. 

- ఎం.పిచ్చిబాబు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.