అప్పు చెల్లించాల్సిందే

ABN , First Publish Date - 2020-11-30T06:12:25+05:30 IST

మహిళల ఆర్థిక పరిపుష్ఠి కోసం 2002లో అప్పటి ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుచేసింది. తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకునేందుకు స్వయం ఉపాధి మార్గాల వైపు మళ్లించింది.

అప్పు చెల్లించాల్సిందే
నడిగూడెం మండల కేంద్రంలోని స్ర్తీ శక్తి కార్యాలయం

సీఐఎఫ్‌ రుణాల రికవరీకి స్పెషల్‌ డ్రైవ్‌ 

మహిళా సంఘాలపై అధికారుల ఒత్తిడి

నడిగూడెం, నవంబరు 39:  మహిళల ఆర్థిక పరిపుష్ఠి కోసం 2002లో అప్పటి ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుచేసింది. తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకునేందుకు స్వయం ఉపాధి మార్గాల వైపు మళ్లించింది. ఇందుకు కొంతమంది మహిళలను సంఘాలుగా ఏర్పాటుచేసి వ్యక్తిగత, సాముహిక రుణాలు ఇస్తూ తిరిగి వాటిని వసులు చేసింది. నాటినుంచి పథకం అనేక మార్పులు చెంది సమభావన, వెలుగు, తాజాగా ఇందిరా క్రాంతి పథం, స్ర్తీ నిధి, స్ర్తీ శక్తి, మండల సమాఖ్యలుగా రూపాంతరం చెందింది. ఇంతవరకు సవ్యంగా ఉండగా, 2004లో సామాజిక పెట్టుబడి నిధి(సీఐఎఫ్‌) ద్వారా రూపాయి వడ్డీకే రుణాలు అందిం చింది. 100 వాయిదాల్లో చెల్లించేలా రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు ఒక్కో సంఘానికి నిధులు అందించింది. ఈమేరకు 2004లో సూర్యాపేట జిల్లాలో 576 గ్రామ సంఘాల్లోని 16,979 మంది సభ్యులకు రూ.14కోట్ల 75లక్షల 99వేలు, 2015లో రూ.2కోట్ల 15లక్షల నిధులను సంఘబంధాలకు ప్రభుత్వం మంజూరీ చేసింది. ఇందులో 359 గ్రామసంఘాలు తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో దాదాపు 3,560 మంది సభ్యులు రూ.8కోట్ల 15 లక్షలు బకాయి పడ్డారు. సుమారు 16ఏళ్ల తర్వాత బకాయిల వసూళ్లకోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) రాష్ట్రస్థాయిలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. అక్టోబరు నెలనుంచి బకాయిలు ఉన్న మహిళల ద్వారా అప్పులు రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించింది. మండల ఏపీఎం, సీసీలు, సిబ్బంది ద్వారా బలవంతపు వసూలు చేస్తుండటంతో అప్పులు తీసుకున్న సంగతే మరిచిన మహిళలు ఇందిరా క్రాంతిపథం ఉద్యోగుల తీరుతో బెంబేలెత్తిపోతున్నారు. అత్యధికంగా నడిగూడెం మండలంలోనే రూ.79లక్షల బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ ఇంటి చుట్టూ తిరుగుతున్న అధికారులతో మహిళలు గొడవపడుతున్నారు. కొన్ని మండలాల్లో ఏపీఎంలను నిలదీసి అప్పులే లేవని, ఉన్నా కట్టమని తెగేసి చెప్తుండడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. 


ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ.26 కోట్ల బకాయిలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఐఎఫ్‌ బకాయిలను వసూలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో రూ.8కోట్లు ఉండగా, నల్లగొండలో రూ.12కోట్ల వరకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.6కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రుణాల రికవరీలో యాదాద్రి జిల్లా 78శాతం, నల్లగొండలో 26.6శాతం, సూర్యాపేట జిల్లాలో తక్కువగా 19శాతం మాత్రమే రికవరీ కావడంతో బకాయిల వసూళ్లకు అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తున్నారు. డిసెంబరు నాటికి వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉం టే కొన్నేళ్ల క్రితం తీసుకున్న రుణాలను అధిక శాతం మహిళలు గ్రూపు లీడర్లకు, మండల సమాఖ్యలకు చెల్లించినట్లు తెలుస్తోంది. అప్పుడు పనిచేసిన ఉద్యోగులు కొందరు సొంతానికి వాడుకోగా ప్రభుత్వానికి లెక్క చూపకపోవడంతో బకాయిలు అలాగే ఉన్నాయి. 

Updated Date - 2020-11-30T06:12:25+05:30 IST