ltrScrptTheme3

నిఖిల్, సొహెల్‌ సపోర్ట్‌కి సంతోషంగా ఉంది: హీరో రంజిత్‌

Feb 24 2021 @ 19:01PM

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు అని సాధారణంగా సెలబ్రిటీల విషయంలో తరుచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే డా.రంజిత్ మాత్రం ముందుగా ఆయుర్వేద డాక్టర్‌గా పేరు సంపాదించి.. తనలోని నటుడిని సంతృప్తి పరచుకోవడానికి ఇప్పుడు యాక్టర్ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'ఏప్రిల్ 28 ఏం జరిగింది'. వీరాస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  సందర్భంగా డా.రంజిత్‌ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.


ముందుగా మీకు స్పూర్తి ఎవరు?

మా నాన్న ఏల్చూరి వెంకట్రావు ఆయుర్వేద డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలపై ఆయనకు అమితమైన ఆసక్తి ఉంది. సినీ రైటర్స్ అసోషియేషన్‌ను నాన్న ప్రారంభించారు. గాడ్‌ఫాదర్, మావూరి మారాజు, ఇంటింటి దీపావళి, ప్రజల మనిషితో పాటు చాలా సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. ఆయన బాటలోనే అడుగులు వేస్తూ నేను వైద్యవృత్తిని ఎంచుకున్నా. పన్నెండేళ్లుగా డాక్టర్‌గా పనిచేస్తున్నా. నాన్నగారి ద్వారా నాకు సినిమాల పట్ల ఇష్టం మొదలైంది. ఆ ఆసక్తితోనే ఈ చిత్రంలో నటించా.


ఈ సినిమాలో మీ పాత్ర గురించి..?

ఇందులో సినీ రచయితగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. నిర్మాతల్ని మెప్పించే మంచి కథ రాయడం కోసం రచయిత తన కుటుంబంతో కలిసి ఓ ఇంటికి వెళతాడు. అక్కడ అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా  నవ్యమైన పాయింట్‌తో వీరాస్వామి సినిమాను తెరకెక్కించారు. గతంలో కన్నడంలో హీరోగా అవధి అనే సినిమా చేశా. ఆ సినిమాకు వీరాస్వామి కో డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది. ఆయన చెప్పిన కథలో విరామ సన్నివేశాల ముందే వచ్చే మలుపు ఆకట్టుకోవడం సినిమాను అంగీకరించా. పతాక ఘట్టాలు నవ్యానుభూతిని పంచుతాయి. వీరాస్వామి, హరిప్రసాద్ జక్కా  ఊహకందని మలుపులతో స్క్రీన్‌ప్లే తీర్చిదిద్దారు.  గంట యాభై నిమిషాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.

ఏప్రిల్ 28 అని టైటిల్‌ పెట్టడానికి కారణం..?

టైటిల్‌తో పాటు ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోంది.  ఓ సందర్భంలో హాస్యనటుడు అలీకి ఈ సినిమా గురించి చెప్పాను. టైటిల్ విని ఆయన ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యాయని అన్నారు. అలాంటి మంచి రోజు టైటిల్‌గా కుదరడం ఆనందంగా ఉంది. ఆ కథానుగుణంగా ఈ సినిమాలో ఏప్రిల్ 28కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదేమిటన్నది తెరపై ఆసక్తిని పెంచుతుంది.


నిఖిల్‌, సొహెల్‌ మీ సినిమాని ప్రమోట్‌ చేయడం గురించి..?

నిఖిల్, సొహెల్‌తో చాలా కాలంగా పరిచయముంది. ఇప్పటివరకు నేను చూసిన గొప్ప ఇంట్రవెల్ బ్యాంగ్ ఇదేనని నిఖిల్ సినిమా చూసి ప్రశంసించారు. సొహెల్‌కు ఈ సినిమా చాలా నచ్చింది. మంచి సినిమాను ప్రోత్సహించేందుకు వారిద్దరూ ముందుకు రావడం ఆనందంగా ఉంది.


ఇక సినిమాలకే పరిమితమా..?

లేదు.. వైద్యవృత్తికే నా తొలి ప్రాధాన్యత. జనాలకు సేవ చేస్తూనే సినిమాల్లో నటిస్తా. హీరోగా మాత్రమే నటించాలనే పరిమితులు పెట్టుకోలేదు. పాత్రకు ప్రాముఖ్యత ఉందనిపిస్తే విలన్‌గా నటించడానికి సిద్ధమే. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగించాలనుంది. సినిమాల పట్ల నాలో ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అమ్మనాన్నలు నన్ను ప్రోత్సహించారు. వైద్యవృత్తిని వదులుకోకుండా సినిమాలు చేయమని సలహాఇచ్చారు.


సీనియర్ల నుంచి ఎటువంటి సహకారం అందింది?

తనికెళ్లభరణి, అజయ్, రాజీవ్‌కనకాల వంటి అనుభవజ్ఞులతో ఈ సినిమాలో కలిసి పనిచేశా. వారి సహకారం వల్లే నా పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయగలిగా. తనికెళ్లభరణిగారితో కలిసి నటించిన సన్నివేశాలన్నీ సింగిల్ టేక్‌లోనే పూర్తిచేశా. హావభావల విషయంలో అజయ్ చక్కటి సలహాలిచ్చారు. 


కొత్తగా ప్రాజెక్ట్స్‌ ఏమైనా ఓకే చేశారా?

ఈ సినిమా విడుదల తర్వాతే కొత్త చిత్రాలను అంగీకరించాలనే ఆలోచనలో ఉన్నా. సొంతంగా కొన్ని కథలు రాశాను.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.