సదస్సులో మాట్లాడుతున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా
జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా
తెనాలిలో ఏపీటీఎఫ్ మహాసభలు ప్రారంభం
తెనాలిటౌన్, మార్చి27: విద్యారంగ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మార్పులే దీనికి నిదర్శనమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా అన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ గుంటూరు జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలను ఆదివారం ఉదయం వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియంలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో కలసి రఆమె పారంభించారు. క్రిస్టినా మాట్లాడుతూ సమాజానికి మంచి పౌరులను అందించగలిగే సత్తా టీచర్లకే ఉందన్నారు. త్వరలో అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు నైట్ వాచ్మెన్, అటెండర్ పోస్టులను మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి, వారి ఉన్నతికి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ ప్రభుత్వం సీపీఎస్ రద్దు హామీని వెంటనే అమలు చేయాలని శాసనమండలి వేదికగా నిలదీశామన్నారు. ఒక ప్రక్క మేలు చేస్తామంటూనే పాఠశాలల మూసివేత ద్వారా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం, వైస్‌చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు, ఆర్జేడీ వి.ఎస్.సుబ్బారావు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు, ఎంవీ కృష్ణయ్య, షేక్.జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. తెనాలి జోన్ కన్వీనర్ పుట్టా జనార్ధనరావు, యోహాన్, డి.శివశంకరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వై.నేతాంజనేయ ప్రసాద్, చాంద్‌బాషా, నాగ శివన్నారాయణ, రామలీల తదితరులు పర్యవేక్షించారు.