సమస్యల పరిష్కారంపై పోరుబాట

ABN , First Publish Date - 2022-08-17T06:54:23+05:30 IST

ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ 100 రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిరసన దీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

సమస్యల పరిష్కారంపై పోరుబాట

- సెల్ఫీ అటెండెన్స్‌ను అంగీకరించం : ఏపీటీఎఫ్‌

- ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయుల నిరసన దీక్ష

ధర్నాచౌక్‌, ఆగస్టు 16 : ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ 100 రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిరసన దీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక ధర్నాచౌక్‌లో జరిగిన నిరసన దీక్షలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు చెన్నుపాటి మంజేల, కె.భానుమూర్తి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తానని చెప్పిన సీఎం జగన్‌ మూడున్నరేళ్లు దాటినా చేయకుండా మాట తప్పారని విమర్శించారు. సీపీఎస్‌ రద్దు చేసేంతవరకు పోరాడతామన్నారు. సెల్ఫీయాప్‌ ద్వారా ఉపాధ్యాయుల అటెండెన్స్‌ అప్‌లోడ్‌ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను అంగీకరించబోమన్నారు. ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేదంటే అన్ని సంఘాలతో కలిసి మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఉన్నత పాఠశాలలో వీలినంతో 7 లక్షల మేరకు విద్యార్ధులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరారన్నారు. వాస్తవ పరిస్ధితులను ప్రభుత్వం ప్రకటించాలని, విలీన పక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. జీవో 117ను రద్దు చేయాలని మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సెప్టెంబరు నుంచి  సీపీఎస్‌ ఉద్యమం

- జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

మచిలీపట్నం టౌన్‌ : సీపీఎస్‌ రద్దు కోరుతూ సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఉద్యమం చేపట్టనున్నట్టు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాము పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీనగరంలోని ఉదయపు నడక మిత్ర మండలి హాలులో జరిగిన జిల్లాస్థాయి సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, వార్డు, విలేజ్‌ సెక్రటరీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా కార్యదర్శి తోట వరప్రసాద్‌ మాట్లాడుతూ, వీఆర్‌ఏ, వీఆర్వోల పదోన్నతులపై ఉద్యమిస్తామన్నారు. సచివాలయ ఉద్యోగుల భర్తీ, 010 పద్దుకు జీతాల బదలాయింపులో సంఘం ప్రముఖపాత్ర వహించిందన్నారు. శ్యామ్‌నాథ్‌, సురేశ్‌నాయక్‌, శ్రీనివాసరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత సెల్‌ఫోన్లలో యాప్‌ల డౌన్‌లోడ్‌ దుర్మార్గం

- ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామారావు

సెల్‌ఫోన్ల యాప్‌ల్లో ముఖాలు చూపి హాజరు నమోదు చేయడంపై ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యాప్‌లకు సంబంధించిన చర్చల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, జేడీ సర్వీసులతో మాట్లాడుతున్నామన్నారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత సెల్‌ఫోన్లలో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. యాప్‌ల కోసం ప్రత్యేక డివైజ్‌ ఇవ్వాలన్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారని, అప్పటి వరకు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని ఫ్యాప్టో పిలుపునిచ్చిందన్నారు. ఎవరైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే హాజరు అప్‌లోడ్‌ చేయవద్దని పేర్కొన్నారు.

- తరగతి గదుల్లో స్మార్ట్‌ ఫోన్లను నిషేధించాలి

తరగతి గదుల్లో స్మార్ట్‌ ఫోన్లను నిషేధించాలని, పాత పద్ధతిలోనే ఉపాధ్యాయుల బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవాలని ఏపీటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హాజరు కూడా స్మార్ట్‌ ఫోన్ల ద్వారా స్వీకరించడం తగదన్నారు. ఇలా స్మార్ట్‌ ఫోన్ల యాప్‌ల్లో గంటల తరబడి పనిచేయడం వల్ల విద్యార్ధులకు చదువు చెప్పే కాల హరణం అవుతోందన్నారు. గతంలో ఉపాధ్యాయులు స్మార్ట్‌ ఫోన్లు వాడవద్దని, వాడితే చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారని, నేడు స్మార్ట్‌ ఫోన్‌ లేనిదే ఉపాధ్యాయుడు బడికి వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. 

Updated Date - 2022-08-17T06:54:23+05:30 IST