ఆప్తహస్తం

ABN , First Publish Date - 2022-01-20T05:52:04+05:30 IST

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిన శ్రీలంకను ఉదారంగా ఆదుకోవడం ద్వారా దానికి మనం మరింత దగ్గరకావచ్చునని దౌత్యవ్యవహారాల నిపుణులు అంటున్నారు...

ఆప్తహస్తం

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిన శ్రీలంకను ఉదారంగా ఆదుకోవడం ద్వారా దానికి మనం మరింత దగ్గరకావచ్చునని దౌత్యవ్యవహారాల నిపుణులు అంటున్నారు. శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో ఉంది. దాని విదేశీ మారకద్రవ్యనిలువలు ఘోరంగా ఉన్నాయి. దివాలా ముద్ర పడకుండా ఉండటానికి ఆ దేశం తన నిల్వ బంగారాన్ని అమ్ముకుంటోంది. ఇరవై టన్నుల బంగారం నిల్వలు అనతికాలంలోనే కరిగి మూడుటన్నులు మిగిలాయట. కరోనా తెచ్చిన కష్టాలను లంక ఎంతగానో అనుభవిస్తోంది.


లంక ఆర్థికమంత్రి బసిల్ రాజపక్స, భారత విదేశాంగమంత్రి ఎస్. జయశంకర్ మధ్యన మొన్న శనివారం వర్చువల్ సమావేశం జరిగిన వెంటనే ఆ దేశం చమురు కష్టాలు తీర్చే నిమిత్తం భారత్ ఐదువందల మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. దీనికి ముందు 900మిలియన్ డాలర్ల  చేయూతనిచ్చినట్టు భారత్ ప్రకటించింది. లంక పరిస్థితి ఊహకందనంత ఘోరంగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఉద్యోగ ఉపాధులు కోల్పోయి రోడ్డునపడిన ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో లేవు. బతకడం కోసం అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేక తిండితగ్గించడం ద్వారా జనం రోజులు నెట్టుకొస్తున్నారు. ఒకరోజు తినే తిండిని ఇప్పుడు వారంపాటు సర్దుకుంటున్నారట. విదేశీమారక ద్రవ్య నిల్వలను ఆదాచేసే లక్ష్యంతో ప్రభుత్వం పప్పూ ఉప్పూ దిగుమతులను కూడా నియంత్రించడం ప్రజలకు సమస్య తెచ్చింది. అలాగే, గత ఏడాది మార్చిలో రసాయనాలు, పురుగుమందుల వినియోగంపై నిషేధం విధించి, రాజపక్స ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయంవైపు దేశాన్ని మళ్ళించే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్నది కూడా విదేశీమారకద్రవ్యాన్ని ఆదాచేయాలన్న ఆరాటమే. కానీ, భూములను సిద్ధం చేయకుండా సేంద్రీయ సేద్యానికి మారడం దిగుబడులను దెబ్బతీసింది, ఆహారకొరతకు కారణమైంది.


ఆహార అత్యయిక స్థితిని విధించాల్సిన దుస్థితికి లంక దిగజారడానికి మూడేళ్ళనాటి ఉగ్రదాడులు కూడా కారణమైనాయి. 2019లో లంకలో ఈస్టర్ సందర్భంగా జరిగిన బాంబుపేలుళ్ళతో దేశ ఆర్థికానికి ఆయువుపట్టులాంటి పర్యాటకరంగం ప్రమాదంలో పడింది. ఆ తరువాత తరుముకొచ్చిన కరోనా ఆ రంగాన్ని మళ్ళీ కోలుకోనివ్వకుండా చేసింది. 


ఆర్థికవ్యవస్థలో లిక్విడిటినీ పెంచే పేరిట వందలకోట్ల కరెన్సీని ముద్రించడం మరింత ముంచింది. ఇంధనరంగం దెబ్బతిని, విద్యుత్ కోతలు పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గి, దిగుమతులు నిలిచిపోయి లంక అష్టకష్టాల్లోకి జారింది. ‘దివాలా’ దేశాలకు దక్కే రేటింగ్‌లో ప్రస్తుతం ఉన్న లంక నిజానికి ఈ ఒక్క ఏడాదే దాదాపు ఐదువందలకోట్ల డాలర్ల అప్పు చెల్లించాల్సి ఉన్నదట.


దివాలా స్థితి రాలేదని ఆ దేశ పాలకులు దబాయిస్తున్నప్పటికీ, మిత్రదేశం చైనానుంచి, చివరకు బంగ్లాదేశ్ నుంచి కూడా వీలైనంత సాయం స్వీకరించారు. ప్రధానంగా ఈ కష్టకాలంలో చైనా చేయగలిగినంత సాయం చేయకపోగా, అప్పుకు అనేక ఆంక్షలు పెడుతూ దోచుకుంటున్నదని లంక విపక్షాల విమర్శ. రాజపక్స సోదరులకు చైనాతో ఉన్న సాన్నిహిత్యాన్ని అధికారపక్ష సభ్యులు కూడా ఎత్తిచూపుతున్నారు. ఈ ప్రాంతంలో మీ రాజకీయప్రాబల్యాన్ని విస్తరించడానికి మా దేశాన్ని కుట్రపూరితంగా భారీ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, అప్పుల విషవలయంలోకి నెట్టేశారంటూ అధికారపక్ష సభ్యుడొకరు చైనా అధ్యక్షుడికి ఓ పెద్ద లేఖరాశారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ)లో భాగంగా లంకలో చైనా జరిపిన భారీ నిర్మాణాలే దేశాన్ని ప్రధానంగా ముంచేశాయన్నది విమర్శ. హంబన్ టోట పోర్టు నిర్మాణం ఖర్చు తీర్చలేక లంక తిరిగి చైనాకే దానిని నూరేళ్ళు లీజుకు రాసిచ్చిన విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్న లంకకు చేసే ఆర్థికసాయం పరోక్షంగా చైనాకు ఉపకరిస్తుందన్న అనుమానం భారత్‌కు లేకపోలేదు. కానీ, తమ కష్టాలకు చైనా ప్రధానకారణమని ప్రజలూ ప్రతినిధులూ ప్రగాఢంగా నమ్ముతున్న ప్రస్తుత తరుణంలో లంకను భారత్ మరింత ఉదారంగా ఆదుకోవడం ద్వారా భవిష్యత్తులోనైనా దానిని చైనాకు కాస్తంత ఎడం జరపవచ్చుననీ, బలమైన ఆర్థిక బంధంతో రెండోస్థానాన్నయినా పదిలపరుచుకోవచ్చుననీ నిపుణుల అభిప్రాయం.

Updated Date - 2022-01-20T05:52:04+05:30 IST