Advertisement

ఏపీ ప్రభుత్వ అనాలోచిత ప్రకటనతో దారుణంగా దెబ్బతిన్న దివి ఆక్వా రైతులు

Oct 21 2020 @ 10:42AM

ఇదేంది‘రొయ్యో’!

9.50 లక్షల క్యూసెక్కుల వరద అంటూ చేసిన ప్రకటనలతో కౌంట్‌కు రాకుండానే రొయ్యల పట్టుబడి

800 ఎకరాల్లో రూ.16 కోట్లు నష్టపోయిన వైనం


అవనిగడ్డ టౌన్(కృష్ణా): నాగాయలంక ప్రాంతానికి చెందిన రైతు శ్రీనివాస్‌ 5 ఎకరాల్లో రొయ్యలు సాగు చేశాడు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధరల పెరుగుదల ఆశాజనకంగా ఉందని, గత నష్టాల నుంచి గట్టెక్కి ఈ ఏడాది ఎంతోకొంత మిగులు పొందొచ్చని భావించాడు. ముంపు నేపథ్యంలో అధికారుల ప్రకటనకు భయపడి 80 నుంచి 70 కౌంట్‌ మధ్యే రొయ్య పట్టుబడి చేసి తీవ్రంగా నష్టపోయాడు. ఈయనొక్కడే కాదు అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాల్లోని ఆక్వా రైతులందరిదీ ఇదే దుస్థితి. వీరంతా 800 ఎకరాల్లో కౌంట్‌కు రాకుండానే రొయ్యలను పట్టుబడి చేయటంతో దాదాపు రూ.16కోట్లు నష్టపోయినట్టు అంచనా. 


అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన ప్రభుత్వ పెద్దలు, కొందరు జిల్లా అధికారులు వరదల తీవ్రతపై చేసిన అనాలోచిత ప్రకటనలు దివి ప్రాంత ఆక్వా రైతులను నిలువునా ముంచాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, కృష్ణానది ఉప నదుల నుంచి వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏ ప్రాజెక్ట్‌ నుంచి ఎంత వరద వస్తుందన్న విషయాన్ని ముందుగానే ప్రకటిస్తూ వచ్చారు. గురువారం రాత్రి నుంచి కృష్ణానదికి భారీ వరద వచ్చేస్తుందంటూ అధికారులు హడావుడి చేయటంతోపాటు శుక్రవారం సాయంత్రానికే దాదాపు 9.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజి దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాకు చెందిన ఓ ముఖ్య ఉన్నతాధికారి నుంచి వచ్చిన వాట్సప్‌ సందేశం ఆధారంగా మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఈ మేరకు ప్రజలను, లంకల్లో మెట్ట, ఆక్వా సాగు చేసే రైతులను అప్రమత్తం చేశారు.


పులిచింతల నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద, దీనికితోడు ఖమ్మం నుంచి మున్నేరు మీదుగా వచ్చే వరద మొత్తం కలుపుకొని 9.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేస్తుందని అధికారులతోపాటు  ప్రజాప్రతినిధులు సైతం దివి ప్రాంతంలో హడావుడి చేశారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాల్లోని నదీతీర లంక భూముల్లో ఆక్వాసాగు చేస్తున్న రైతులు కౌంట్‌కు రాకుండానే ముందస్తుగా పట్టుబడి చేసి లక్షల్లో నష్టాన్ని చవి చూశారు.


నివేదికలను పట్టించుకోకుండా ప్రకటనలా?

కృష్ణా వరదల విషయంలో ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ప్రాజెక్టుల వారీగా వస్తున్న ఇన్‌ఫ్లోను, అవుట్‌ ఫ్లోను, మధ్యలో కలిసే చిన్నచిన్న వాగుల నుంచి వచ్చే ప్రవాహాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గంటకూ ఒకసారి పులిచింతల నుంచి ఎంత నీరు విడుదల చేస్తోందీ, దానికి అనుగుణంగా ప్రకాశం బ్యారేజి నుంచి ఎంత అవుట్‌ఫ్లో అవుతోంది అన్న విషయాలను ఎప్పటికప్పుడు పబ్లిక్‌ డొమైన్‌లోంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఇరిగేషన్‌ అధికారుల ప్రకటనలను పరిశీలిస్తే శుక్రవారం నాడు పులిచింతల నుంచి అత్యధికంగా విడుదల చేసిన సమాచారాన్ని పరిశీలిస్తే గురువారం అర్థరాత్రి 7.14 లక్షల క్యూసెక్కులు, శుక్రవారం ఉదయం 6 గంటలకు 6.64 లక్షలు, శుక్రవారం ఉదయం 9 గంటలకు 6.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేసినట్లు ప్రకటించారు. అయితే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి మాత్రం ఉదయం 10 గంటల సమయంలో పెద్ద ఎత్తున వరద వస్తుందని ప్రకటన విడుదల కావటంతోపాటు అదే వాట్సప్‌ సందేశాన్ని అన్ని మండలాలకూ పంపటంతో 4 మండలాల్లోని ఆక్వా రైతులు ముంపు భయంతో రొయ్యలు కౌంట్‌కు రాకుండానే పట్టుబడి చేసేశారు.


నాలుగు మండలాల పరిధిలో ఇలా పట్టుబడి చేసిన విస్తీర్ణం 800 ఎకరాల మేర ఉంటుందని రైతులు చెబుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి ప్రకాశం బ్యారేజి నుంచి విడుదల చేసిన గరిష్ట వరద కేవలం 7.79 లక్షల క్యూసెక్కులు మాత్రమే. అది గత నెలలో వచ్చిన వరదల్లో గరిష్ట నమోదు కంటే దాదాపు 30,000 క్యూసెక్కులు తక్కువ కావటం ఇక్కడ గమనార్హం. 


నెలరోజులు ఆగితే సిరులు కురిసేవి

గురు, శుక్రవారాల్లో అధికారులు, అమాత్యులు చేసిన ప్రకటనల కారణంగా నెల రోజుల్లో 40 నుంచి 30 కౌంట్‌కు వచ్చే రొయ్యలను 80 నుంచి 60 కౌంట్‌ మధ్యే పట్టుబడి చేయటంతో ఒక్కో రైతు ఎకరాకు కనిష్టంగా రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల మేర నష్టపోయారు. 30 కౌంట్‌ రొయ్యల ధర రూ.470కుపైగా ఉండగా 80 కౌంట్‌ ధర రూ. 260 మాత్రమే పలుకుతున్నా తప్పని పరిస్థితుల్లో రైతులు ముందుగానే పట్టుబడి చేసి ఎకరాకు దాదాపు 60 శాతం మేర పంట నష్టాన్ని చవిచూశారు. టన్నుకురూ.2లక్షల మేర అంచనా ధరను నష్టపోయారు. Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.