ఆక్వా రైతుల ఉరుకులు..పరుగులు

ABN , First Publish Date - 2022-05-26T06:40:07+05:30 IST

మంగళవారం రాత్రి గాలి వాన ఆక్వా రైతులను పరుగులు పెట్టించింది.

ఆక్వా రైతుల ఉరుకులు..పరుగులు
హడావిడిగా రొయ్యల పట్టుబడులు

ఏరియేటర్లు తిప్పేందుకు చెరువుల వద్దకు

పలు చోట్ల తేలిన చేపలు, రొయ్యలు

కౌంటుకు రాకుండానే రొయ్యల పట్టుబడి

నష్టపోయామంటున్న రైతులు.. ఆదుకోవాలని వినతి

మంగళవారం రాత్రి గాలి వాన ఆక్వా రైతులను పరుగులు పెట్టించింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఆక్సిజన్‌ అందక రొయ్యలు, చేపలు చనిపోతాయన్న ఆందోళనతో రైతులు ఏరియేటర్లు తిప్పేందుకు చెరువుల వద్దకు పరుగులు పెట్టారు. అయినా పలు చెరువుల్లో చేపలు, రొయ్యలు చనిపోయి నీటిపై తేలాయి. 

ముదినేపల్లి, మే 25: గాలివాన ఆక్వా రైతులను బెంబేలెత్తించింది. మంగళవారం పగలు సెగలు కక్కే ఎండ రాత్రి వాతావరణం చల్లబడి వర్షం కురవటంతో చేపలు, రొయ్యల చెరువులకు రైతులు పరుగులెత్తారు.   అర్థరా త్రి దాటాక వర్షం ప్రారంభం కావటంతో రైతులు చెరువుల వద్దకు వర్షంలోనే వెళ్లి ఏరియేటర్లను తిప్పే పనిలో పడ్డారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోవటంతో డీజిల్‌తో జనరేటర్లను వినియోగించి ఏరియేటర్లను తిప్పారు. ఉన్నట్లుండి వర్షం కురవటంతో చెరువుల్లో ఆక్సిజన్‌ శాతం తగ్గకుం డా ఆక్వా రైతులు అర్థరాత్రి నానా తంటారుపడ్డారు. బుధవారం ఉదయం ముదినేపల్లి ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో హడావిడిగా రొయ్యల పట్టుబడులు నిర్వహించారు. ఆక్సిజన్‌ శాతం పెంచేందుకు టాబ్లెట్లు, పౌడర్‌ ఇతర మెటీరియల్‌ను రొయ్యల చెరువుల్లో వినియోగించారు. ఇది రైతులకు అదనపు ఖర్చు. విశ్వనాద్రిపాలెం చెరువుల్లో  ఫంగస్‌ చేపలు చనిపోయి  నీటిపై తేలియాడాయి. వీటిని చెరువుల నుంచి తొలగించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

కలిదిండి: మంగళవారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురవటంతో  ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రొయ్యలు నీటిపై తేలి ఆడాయి. దీంతో రొయ్యల సాగు చేపట్టి నెల రోజులు కాకముందే అర్థాంతరంగా రొయ్యల పట్టుబడులు పట్టామని పలువురు రైతులు  వాపోతున్నారు. సాగు చేపట్టిన 45 రోజుల వరకు రొయ్యలు కౌంటుకు రావని, కనీసం పెట్టుబడి కూడా రాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలతో మందులు కొనుగోలు చేసి చెరువుల్లో చల్లుతున్నా ప్రయోజనం ఉండటం లేదని,  ప్రభుత్వం నాణ్యమైన సీడ్‌ను అందించాలని కోరుతున్నారు. 


నేలవాలిన అరటి..

ముసునూరు: మండల వ్యాప్తంగా  ఈదురుగాలులతో  భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి సూమారు 12 గంటల నుంచి ప్రారంభమైన గాలులు, వర్షం విడతల వారిగా గంటల తరబడి కురిసింది. ఈ వర్షం వల్ల పలు గ్రామాల్లో  అరటి తోటల్లో  అక్కడక్కడ  చెట్లు నేలకు ఒరిగాయి. గుడిపాడు, గుళ్ళపూడి, చెక్కపల్లి గ్రామాల్లో  దాళ్వా వరి కోతకు వచ్చిన నేపధ్యంలో ఈ వర్షం వల్ల కోతలు ఆలస్యమై కొంతమేర నష్టం కలుగు తుందని రైతులు వాపోతున్నారు. పామాయిల్‌, ఉద్యానవన పంటలకు ఈ వర్షం ఉపయుక్తంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.      

Updated Date - 2022-05-26T06:40:07+05:30 IST