కరకట్‌

ABN , First Publish Date - 2021-11-09T04:49:56+05:30 IST

అనుమతులు తీసుకోరు.. పర్యావరణ పరిరక్షణ గురించి పట్టించుకోరు.. కనీసం జనావళి క్షేమమన్నా ఆలోచిస్తారా అంటే అదీ లేదు.

కరకట్‌
లంకెవానిదిబ్బ వద్ద కరకట్ట అంచు వరకు తవ్వకాలు జరిపి సాగు చేస్తున్న ఆక్వా

కట్ట అంచుదాకా తవ్వకాలు

కాలి బాటగా మారిన కర కట్ట

నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు

వరదలు వస్తే తీర ప్రాంత గ్రామాలకు ముప్పే 

బలహీనంగా మారుతున్నా పట్టించుకోని అధికారులు


పటిష్టంగా ఉండాల్సిన కరకట్ట రోజురోజుకు కుదించుకుపోతోంది. కట్ట పటిష్టతను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో కరకట్ట కాలిబాటగా మారిపోయింది. కట్ట వెంబడి ఎటువంటి తవ్వకాలు చేయకూడదు. కాని కొందరు రైతులు కట్ట అంచుదాకా తవ్వేసి నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు చేస్తున్నారు. అనుమతులు పొందకుండా రైతులు ఇష్టానుసారంగా రొయ్యల చెరువుల కోసం కట్ట సమీపం వరకు తవ్వకాలు చేస్తున్నారు. దీంతో రేపల్లె మండలంలోని పెనుమూడి నుంచి మైనేనివారిపాలెం, గంగడిపాలెం వరకు కరకట్ట బలహీనంగా మారింది. సుమారు 45 నుంచి 60 అడుగుల మేర ఉండాల్సిన కరకట్ట అక్రమ తవ్వకాలతో కాలిబాటగా మారింది. కొన్ని దగ్గర్ల అయితే కరకట్ట ఆనవాళ్లు కూడా లేవు. బలహీనంగా మారిన కరకట్టతో కృష్ణమ్మకు వరదలొస్తే ప్రమాదం పొంచి ఉంది. అయినా అధికారుల్లో చలనం లేక పోవడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 


రేపల్లె, నవంబరు 8: అనుమతులు తీసుకోరు.. పర్యావరణ పరిరక్షణ  గురించి పట్టించుకోరు.. కనీసం జనావళి క్షేమమన్నా ఆలోచిస్తారా అంటే అదీ లేదు. పటిష్టంగా ఉండాల్సిన.. ఉంచాల్సిన కరకట్టను ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు. రొయ్యల సాగు కోసం ఏకంగా కరకట్ట ప్రాంతాన్నే ఎంచుకుని చెరువులుగా మార్చేశారు. కట్టను పరిరక్షించాల్సిన ఆర్సీ అధికారులు అటువైపు కన్నెత్నైనా చూడడంలేదు. దీంతో కొందరు రైతులు ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేలాది ఎకరాల రొయ్యల చెరువులను తవ్వి సాగు చేస్తున్నారు. రొయ్యల చెరువులు కరకట్ట అంచుదాకా వచ్చేశాయి. అయినా ఆర్సీ, రెవెన్యూ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. తవ్వకాలు చేస్తున్న వారి నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని పట్టించుకోవటం లేదంటూ సమీప గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు, రైతులు కుమ్మకై రేపల్లె మండలం పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు పట్టా భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట అంచుదాకా తవ్వకాలు జరిపి ఆక్వాసాగు చేస్తున్నారు. కరకట్ట వెంబడి పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు పది వేల ఎకరాలకు పైనే రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. వీరు రెవెన్యూ, ఆర్సీ, మత్స్యశాఖ వద్ద నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సాగు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో వెనుకబడిన తరగతులు కుటుంబాలకు వరి సాగు చేసుకుని జీవనం గడిపేందుకు భూములను ఇచ్చింది. అయితే వారి నుంచి తక్కువ ధరకే ఆ భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల్లో ఇష్టానుసారంగా రొయ్యల చెరువుల కోసం తవ్వకాలు జరిపారు. ఒకవైపు కరకట్టకు ప్రమాదం కలిగించడంతో పాటు మరోవైపు రొయ్యల సాగుతో పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నారు. విద్యుత్‌ శాఖ వద్ద నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే మోటార్లు ఏర్పాటు చేసి దొంగ కరెంటు తీసుకుని సాగు చేస్తున్నారు. కొంతమంది మత్స్యశాఖ ద్వారా అనుమతులు తీసుకుని ఆయిల్‌ ఇంజన్లు, విద్యుత్‌ మోటార్లు కూడా ఏర్పాటు చేసి యథేచ్చగా రొయ్యల సాగు చేస్తున్నారు. రొయ్యల చెరువల నుంచి వచ్చే వ్యర్థ నీటిని కృష్ణానదిలో కలుపుతూ కలుషితం చేస్తున్నారు. తవ్వకాల కారణంగా కరకట్ట కుదించుకుపోయింది. ప్రస్తుతం కాలిబాటగా మారింది. ఉన్నపళంగా వరదలు వస్తే కట్ట ఎక్కడికక్కడ తెగిపోయి సమీప గ్రామాలను ముంచెత్తే పరిస్థితి ఉంది. 2009లో అక్టోబరు 6న ఓలేరు పల్లెపాలెం వద్ద కరకట్ట తెగి ఊళ్లను ముంచెత్తింది. ఇంత జరిగినా అధికారులు కరకట్ట పటిష్టతపైన, తవ్వకాలపైనా దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు.  

 

  

Updated Date - 2021-11-09T04:49:56+05:30 IST