జలసిరులు

ABN , First Publish Date - 2021-07-25T04:58:30+05:30 IST

జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, వాగుల్లో జలసవ్వడి నెలకొంటుంది. పట్టణాలు, మారుమూల గ్రామాలు ఎటుచూసినా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి.

జలసిరులు
పొంగిపొర్లుతున్న సింగీతం రిజర్వాయర్‌

- జిల్లాలో జలకళను సంతరించుకుంటున్న ప్రాజెక్టులు, చెరువులు
- సగానికి చేరిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు
- ప్రాజెక్టులోకి 7,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- అలుగు దూకిన పోచారం ప్రాజెక్టు
- ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి విడుదల
- కౌలాస్‌ నుంచి 1,700 క్యూసెక్కుల వరద దిగువకు
- కళ్యాణి, సింగీతం రిజర్వాయర్‌ల గేట్ల ద్వారా నీటి విడుదల
- జిల్లాలో అలుగుదూకిన 685 చెరువులు
- వందశాతం నిండుకున్న 411 చెరువులు


కామారెడ్డి, జూలై 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, వాగుల్లో జలసవ్వడి నెలకొంటుంది. పట్టణాలు, మారుమూల గ్రామాలు ఎటుచూసినా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ సీజన్‌ మొదట్లోనే వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో జూలైలోనే ప్రాజెక్టులు, చెరువులు పూర్తిస్థాయిలో నిండుకోవడం విశేషం. ఆయా ప్రాజెక్టులు, చెరువుల కింద ఆయకట్టు రైతులకు జలసిరులుగా భరోసానిస్తున్నాయి. వానాకాలం పంటలకే కాకుండా వచ్చే యాసంగి సీజన్‌కు సైతం సాగునీటి డోకా లేనట్టే. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇప్పటికే సగం నిండుకుంది. ప్రాజెక్టులోకి భారీగానే వరద వచ్చి చేరుతోంది. కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండడంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం పోచారం ప్రాజెక్టు నిండి అలుగు దూకుతుండడంతో ఆయకట్టు పంటలకు సాగు నీటిని విడుదల చేశారు. కళ్యాణి, సింగీతం రిజర్వాయర్‌లు సైతం పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి నిజాంసాగర్‌ వరద కాలువలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని సుమారు 1000కిపైగా చెరువులు నిండడమే కాకుండా అలుగు దూకుతున్నాయి. మిగతా చెరువులు 75 శాతం నిండినట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
అలుగు దూకిన 685 చెరువులు
జిల్లాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుల్లో జలసవ్వడి నెలకొంటుంది. చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌ నీటి పారుదలశాఖ డివిజన్‌ల పరిధిలో మొత్తం 2,167 చెరువులు ఉన్నాయి. ఇందులో 685 చెరువులు ఇప్పటికే పూర్తిగా నిండి అలుగు దూకుతున్నాయి. 411 చెరువులు వంద శాతం నిండాయి. 275 చెరువులు 75 శాతం నిండగా 593 చెరువులు 50 శాతం, 203 చెరువులు 25 శాతం నిండుకున్నాయి. బాన్సువాడ డివిజన్‌ పరిధిలో 215 చెరువులు పూర్తిగా నిండగా జలకళను సంతరించుకున్నాయి. ఈ చెరువుల ఆయకట్టు కింద లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయి. జూలైలోనే ఈ చెరువులు నిండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటల సాగుకే కాకుండా యాసంగి పంటలకు సైతం సాగునీరు అందే అవకాశం ఉంటుందని రైతులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.
నిండుతున్న నిజాంసాగర్‌
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు వర ప్రదాయినిగా ఉన్న ప్రధాన జలాశయం నిజాంసాగర్‌. ఈ ప్రాజెక్టు ద్వారా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌, బిచ్కుంద, బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాలతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని లక్ష ఎకరాలకు పైగా సాగు నీటిని అందిస్తోంది. గత రెండు సంవత్సరాల తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఉమ్మడి జిల్లాల రైతాంగానికి రెండు సీజన్‌లకు తాగు నీటిని అందించారు. ఈ సీజన్‌లోనూ జూలైలోనే నిజాంసాగర్‌ సగం నిండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.570 టీఎంసీలలో నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాన కురుస్తున్న వర్షాలకు సాగర్‌లోకి 7,242 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సెప్టెంబర్‌, అక్టోబరు కల్లా విస్తారంగా వర్షాలు పడితే నిజాంసాగర్‌ ప్రాజెక్టు సైతం పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
పోచారం నుంచి సాగు నీటి విడుదల
ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోని సుమారు 17వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పోచారం. గాంధారి, తాడ్వాయి, లింగంపేట మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పోర్లుతుండడం, అటవీ ప్రాంతాల్లోని పాయల ద్వారా వరద నీరు పోచారం ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపులేని వర్షాలకు లింగంపేట పెద్ద చెరువు, తాడ్వాయిలోకి భీమేశ్వరం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ పోచారంలోకి చేరాయి. దీంతో ఈ ప్రాజెక్టు శుక్రవారం నాటిని పూర్తిగా నిండుకోవడంతో అలుగు దూకుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 1.820 టీఎంసీలు పూర్తిగా నిండడంతో ప్రాజెక్టులోకి 24,636 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో శుక్రవారం ఆయకట్టు పంటల కోసం ఎమ్మెత్యే సురేందర్‌ నీటి పారదలశాఖ సీఈ శ్రీనివాస్‌తో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నిండి అలుగు దూకుతుండడంతో అందాలు చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో ప్రాజెక్టుల వద్ద పర్యాటకుల సందడి నెలకొంటుంది.
కౌలాస్‌నాలా నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
జుక్కల్‌ మండలంలో గల కౌలాస్‌నాల ప్రాజెక్టు గత 5 రోజుల కిందటే పూర్తిగా నిండడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద జుక్కల్‌, పిట్లం, బిచ్కుంద మండలాల్లో సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. భారీ వర్షాలకు కౌలాస్‌నాలా ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.237 టీఎంసీలు ఈ ప్రాజెక్టులోకి 1,755 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకోవడంతో మూడు గేట్లు ఎత్తి 1,755 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలకళను సంతరించుకున్న సింగీతం, కళ్యాణి
నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి మండలాల్లోని సింగీతం, కళ్యాణి రిజర్వాయర్‌లు సైతం నిండుకోవడంతో జలకళను సంతరించుకున్నాయి. ఈ రిజర్వాయర్‌లు పూర్తిస్థాయిలో నిండుకోవడంతో గేట్లు ఎత్తి నిజాంసాగర్‌ వరద కాలువలోకి నీటిని వదులుతున్నారు. సింగీతం రిజర్వాయర్‌ 416 అడుగులు కాగా పూర్తిస్థాయిలో  నిండింది. ఈ రిజర్వాయర్‌లోకి 4,760 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిండడంతో అలుగు దూకడం చూడచక్కనిగా మారింది. అదే విధంగా కళ్యాణి ప్రాజెక్టు సామర్థ్యం 408 అడుగులు కాగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. ఇందులోకి 488 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 290 వరద నీటిని రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా జిల్లాలో జూలైలోనే ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2021-07-25T04:58:30+05:30 IST