అరబ్ యువరాజులు... కాంగ్రెస్ ‘ప్రిన్స్’

Published: Wed, 12 Jan 2022 01:21:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అరబ్ యువరాజులు... కాంగ్రెస్ ప్రిన్స్

రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్ దేశాలలో ‘యువరాజు’ (ప్రిన్స్) అనే నామవాచకాన్ని ఉపయోగించడం ఒక సాధారణ విషయం. మరి ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోనూ కొంతకాలంగా ఆ గౌరవ వాచకం విస్తృతంగా వాడుక అవుతోంది!


భారత జాతీయ కాంగ్రెస్ భావి అధినేత రాహుల్ గాంధీ అని స్పష్టమైన తరువాత ఆయనను ‘ప్రిన్స్’ అని వ్యవహరించడం పరిపాటి అయింది. వివిధ ప్రాంతీయ పార్టీల యువనేతలూ తమ తల్లితండ్రుల తర్వాత తామే పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వ పదవులకు వారసులమనే భావనతో అతిశయాలకు పోతున్నారు. భజనపరులను చేరదీస్తున్నారు. అలా ఈ ‘యువరాజు’ల అధికార దర్పం క్రమేణా పెరిగిపోతోంది. 


కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత కష్టకాలంలో ఉంది. ఈ క్లిష్టకాలంలో పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేయవలసిన రాహుల్ వ్యవహార శైలి రాజకీయ పరిశీలకులను విస్మయపరుస్తోంది.


ఆయన పదేపదే విదేశీ పర్యటనలకు వెళ్ళడాన్ని ప్రస్తావించి నిట్టూరుస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటి నుంచి 2021 వరకు రాహూల్ గాంధీ మొత్తం 248 సార్లు విదేశాలకు వెళ్ళారు. తాజాగా, 2022 సంవత్సర స్వాగతోత్సవ వేడుకలకు గాను ఇటలీ వెళ్ళారు. పార్టీ వ్యవహారాల నిమిత్తం వెళ్ళింది కేవలం మూడుసార్లు మాత్రమే కాగా మిగిలినవన్ని ఆయన వ్యక్తిగతమైన పర్యటనలే కావడం విశేషం. కొన్ని పర్యటనల విషయం ఆయన ప్రత్యేక భద్రతా సిబ్బందికి కూడా తెలియదని ప్రతీతి. కీలకమైన బిల్లులు పార్లమెంటులో ఉన్నప్పుడు, రాజకీయ సమీకరణలు మారుతున్నప్పుడు ఆయన గుట్టుగా విదేశాలకు విశ్రాంతి కోసం వెళుతుండడం పార్టీని నవ్వులపాలు చేస్తోంది. ఎక్కడకు, ఎందుకు వెళ్ళుతున్నారనేది రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయం. కానీ ఎక్కడ ఉన్నా ఎంతవరకు ఎవరికి అందుబాటులో ఉన్నారనేది మాత్రం అవసరం. హేమాహేమీలయిన పార్టీ నేతలకు కూడ రాహుల్ గాంధీ దర్శనభాగ్యం దొరకడం కష్టం కాగా విదేశాలలో ఉన్న ఆయనను ఫోన్‌లో సంప్రదించడం దాదాపుగా అసాధ్యం.


సరే, దేశంలోని ఇతర రాజకీయ పార్టీలలో వారసులుగా వచ్చిన లేదా వస్తున్న ‘యువరాజు’ల సంగతి అలా ఉంచి, అసలు యువరాజులు ఉంటున్న గల్ఫ్ రాచరిక దేశాలలో పరిస్ధితిని ఒక్కసారి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతాయి. అరబ్ రాజులు తమ కుమారులను చిన్నప్పటి నుంచి తమ వెంట ఉంచుకుంటూ వారికి పాలనా పద్ధతుల గురించి విశదం చేస్తుంటారు. పాశ్చాత్య దేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన అరబ్ యువరాజులు తమ తమ దేశాలలో అత్యంత కీలకమైన తెగల విధానం గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. విభిన్న తెగలు అనుసరించే వేర్వేరు వైవిధ్య పద్ధతులను అవలంబించడమూ నేర్చుకుంటారు. పాశ్చాత్య దేశాలలో తాము స్వంతంగా నిర్మించుకున్న సువిశాల రాజప్రాసాదాలలో గడిపినా తమ అధికారులకు, ప్రజలకు రేయింబవళ్ళు అందుబాటులో ఉంటారు. సుదూర సీమల నుంచి తమ రాజ్య వ్యవహారాలను గమనిస్తూ పాలనపై పూర్తి పట్టు కలిగి ఉంటారు.


యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ అధ్యక్షుడు, ఆబుధాబి రాజు అయిన శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నహ్యాయన్ ఒక విశిష్ట రాచరిక పాలకుడు. చిన్ననాటి నుంచి తండ్రి, పెదనాన్న, తాత వెంబడి ఎడారులలో తిరిగి వివిధ అరబ్బు తెగలను సమన్వయపరుస్తూ తమ తెగను ప్రత్యర్థిగా పరిగణించే ఇతర తెగల ప్రజల హృదయాలను జయించిన శేఖ్ ఖలీఫా ప్రపంచంలోకెల్లా సుదీర్ఘకాలం పాటు యువరాజుగా వ్యవహరించిన రాజవంశీకుడు. తండ్రి మరణానంతరం రాజుగా బాధ్యతలు చేపట్టిన అసలైన యువరాజు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో దైనందిన పాలన వ్యవహారాలను ఆయన సోదరుడు శేఖ్ మోహమ్మద్ చూస్తున్నారు.


శేఖ్ ఖలీఫా రాజుగా పట్టాభిషిక్తుడు అయిన తరువాత యువరాజుగా ఉన్నతి పొందిన శేఖ్ మోహమ్మద్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌ను ఒక నూతన పురోగమన పథంలోకి తీసుకువెళ్ళారు. తండ్రి, సోదరుడికి ఉన్నట్టుగానే అరబ్ తెగల వ్యవహారాల గురించి ఈయనకూ సమగ్ర అవగాహన ఉంది. ఇప్పుడు యువరాజుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దాకా పలువురు దేశాధినేతలతో వ్యక్తిగతంగా సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకున్నాడు. అరబ్ పాలకులలో ఆయన నిస్సందేహంగా ఒక విలక్షణ వ్యక్తి.


దుబాయి యువరాజు శేఖ్ హాందాన్ కూడ తండ్రికి తగ్గ వారసుడిగా ఉంటూ పాలనపై పూర్తిపట్టు సాధించారు. ముమ్మాటికి నిండు అరబ్ సంప్రదాయంలో ఉంటూ లండన్ ప్యాలెస్‌లో ఉన్నా, దుబాయి ఎడారి గుడారంలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా ఆయన కళ్ళు, చెవులు సదా దుబాయిపైనే ఉంటాయి.


ప్రజలకు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా కేవలం జన్మతః పదవి పొందిన గల్ఫ్ యువరాజులు నిండు సంకల్పంతో పాలనా వ్యవహారాలు నేర్చుకుంటారు. సమర్థంగా రాజ్యాలను నడిపిస్తారు. ఈ యువరాజుల నుంచి రాహుల్ స్ఫూర్తి పొందాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.