అరాచకీయం!

ABN , First Publish Date - 2020-06-21T05:46:06+05:30 IST

తెలుగునాట సరికొత్త రాజకీయ వ్యూహ రచనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పూనుకున్నారా? నిజానికి ఈ వ్యూహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే పాక్షికంగా అమలు చేశారు...

అరాచకీయం!

నిధులన్నీ సంక్షేమానికే కేటాయించి, పెట్టుబడి వ్యయాన్ని దారుణంగా తగ్గించడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం కాబోతోంది. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం కేటాయించిన 500 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదని ప్రజలు ఆర్థంచేసుకోవలసి ఉంది. పైసా ఖర్చు లేకుండా సమకూరిన 50 వేల ఎకరాల భూమిని, పది వేల కోట్ల రూపాయలతో జరిగిన నిర్మాణాలను దయ్యాల కొంపలుగా మార్చి.. 500 కోట్లతో మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనుకోవడం హాస్యాస్పదం కాదా? యేటా 500 లేదా వెయ్యి కోట్లు కేటాయించినా నాలుగేళ్లలో 4 వేల కోట్లతో మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయనడం ఆత్మవంచన కాదా? సామాజికవర్గాల మధ్య ద్వేషాన్ని రగిలించి అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశమున్న అమరావతిని ఎడారిగా మార్చివేయడం విజన్‌ అనిపించుకుంటుందా?


సొంత పార్టీలో రాజకీయ కుటుంబాలను, పలుకుబడి ఉన్న నాయకులను బలహీనపరిచే వ్యూహానికి జగన్మోహన్‌రెడ్డి తెర తీశారని అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన నాయకులను, సామాజిక వర్గాలను దూరం చేసుకుంటే జగన్‌కే నష్టం కదా? అని ఎవరికైనా అనుమానం రావొచ్చు. జగన్మోహన్‌రెడ్డి అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ సందేహానికి సమాధానం లభిస్తుంది. ఓటర్లకు, తనకు మధ్య నాయకుల అవసరం ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి సిద్ధాంతంగా చెబుతున్నారు. రాజకీయ కుటుంబాలకు చెందినవారిని సంతృప్తిపరచడం కష్టమనీ, అదేవిధంగా కమ్మ, కాపు సామాజికవర్గాలపై ఆధారపడకూడదనీ ఆయన నిర్ణయించుకున్నారట. ముఖ్యమంత్రి పదవికి కమ్మ, కాపు సామాజికవర్గాలతోపాటు రాజకీయ కుటుంబాల నుంచి ఎప్పటికైనా పోటీ ఉంటుందనీ, కనుక తన అధికారాన్ని ఆశించలేని స్థితిలో ఉన్న బడుగు, బలహీనవర్గాల వారిని దరిజేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయానికి జగన్మోహన్‌రెడ్డి వచ్చినట్టు కనిపిస్తోంది. సీనియర్లు, రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఎప్పటికైనా కొరకరాని కొయ్యలుగానే ఉంటారనీ, అలాంటి వారిని కేసీఆర్‌ తరహాలో పక్కనబెట్టాలనీ జగన్‌ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.


తెలుగునాట సరికొత్త రాజకీయ వ్యూహ రచనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పూనుకున్నారా? నిజానికి ఈ వ్యూహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే పాక్షికంగా అమలు చేశారు. పలు విషయాల్లో కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు తనదైన శైలిలో రాజకీయం మొదలెట్టారు. రాజకీయ పరమైన అంశాలలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పరిణామాలకు, సంఘటనలకు కేసీఆర్‌ మీడియాలో చోటు ఉండకపోవడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేక వార్తలకు కేసీఆర్‌ మీడియాలో అధిక ప్రాధాన్యం లభించేది. రాష్ట్రం విడిపోక ముందు నుంచి తెలుగునాట కొన్ని రాజకీయ కుటుంబాలు ఆయా రాజకీయ పార్టీలలో ఆధిపత్యం చలాయిస్తూ ఉండేవి. 1983లో ఎన్‌టీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో రాజకీయ కుటుంబాల ఆధిపత్యమే కొనసాగింది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం లభించింది.


రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యం ఇచ్చింది. తొలి విడతలో అనుభవం ఉన్నవారిని ఇతర పార్టీల నుంచి తెచ్చుకొని మరీ.. వారికి మంత్రి పదవులు కేటాయించిన కేసీఆర్‌.. రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహం మార్చుకున్నారు. తన కుమారుడైన కేటీఆర్‌కు రాజకీయ వారసత్వం అందించాలన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్‌ ఒక పద్ధతి ప్రకారం సీనియర్లను పక్కన పెట్టారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈటల రాజేందర్‌ను మాత్రం మంత్రిగా కొనసాగనిచ్చారు. పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్‌కు ఎదురు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఈ వ్యూహాన్ని అమలుచేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్‌ కుటుంబాన్ని ఒక్కరు కూడా సవాల్‌ చేయలేని పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికి వస్తే ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పార్టీ టికెట్ల కేటాయింపులో ఆయన రాజీపడ్డారు. రాజకీయ కుటుంబాలకు చెందిన పలువురికి కూడా పార్టీ టికెట్లు కేటాయించారు. ఏడాది క్రితం జరిగిన ఎన్నికలలో తనకు అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలు లభించడంతో కేసీఆర్‌ అమలుచేసిన వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయడానికి జగన్మోహన్‌రెడ్డి నడుం బిగించారు.


సొంత పార్టీలోనే కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంలో కూడా రాజకీయ కుటుంబాలను దెబ్బతీయడానికై పావులు కదపడం మొదలెట్టారు. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి, చిత్తూరులో భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు వంటివారు జగన్మోహన్‌రెడ్డి హిట్‌లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. భూమన కరుణాకర్‌రెడ్డికి జగన్‌ తాత రాజారెడ్డితోనే సన్నిహిత సంబంధాలు ఉండేవి. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఆయనను ప్రోత్సహించారు. జగన్మోహన్‌రెడ్డి తరఫున ఎన్నో కార్యకలాపాలను కరుణాకర్‌రెడ్డి చక్కబెట్టేవారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం వంటివారిని రెచ్చగొట్టడంలో భూమన కరుణాకర్‌రెడ్డి కీలక పాత్ర వహించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్‌ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో భూమన కొంత హడావుడిగా కనిపించినప్పటికీ గడిచిన కొన్ని మాసాలుగా ఆయన ఎక్కడా కనిపించడం గానీ, వినిపించడం గానీ లేదు. కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి దూరంపెట్టారని ప్రచారం జరుగుతోంది. భూమనకు పలువురితో పరిచయాలు కూడా ఉన్నాయి. అయినా ఆయనను కాదని నమ్మినబంటు వలె ఉండే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జగన్‌ ఆదరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక అవసరాల రీత్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డికి జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఎంత కాలమో తెలియదు. నెల్లూరులో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అంతేకాదు.. జిల్లా రాజకీయాలలో రెడ్ల ఆధిపత్యం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయినప్పటికీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ను మంత్రిగా తీసుకోవడమే కాకుండా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.


మేకపాటి గౌతమ్‌రెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చినప్పటికీ జిల్లా మంత్రిగా అనిల్‌కుమార్‌కే గుర్తింపు ఉంటోంది. అధికారులు ఆయన మాటకే విలువ ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ధర్మాన ప్రసాదరావుది ప్రత్యేక స్థానం. ధర్మాన కుటుంబం నుంచి కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ప్రసాదరావు ప్రాధాన్యాన్ని కుదించారు. విజయనగరం జిల్లాలో అశోక్‌ గజపతిరాజు ప్రాబల్యం తగ్గించడం కోసం మాత్రమే సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణను మంత్రిగా జగన్‌ తీసుకున్నారు. ఈ విధంగా సొంత పార్టీలో రాజకీయ కుటుంబాలను, పలుకుబడి ఉన్న నాయకులను బలహీనపరిచే వ్యూహానికి జగన్మోహన్‌రెడ్డి తెర తీశారని అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన నాయకులను, సామాజిక వర్గాలను దూరం చేసుకుంటే జగన్‌కే నష్టం కదా? అని ఎవరికైనా అనుమానం రావొచ్చు. జగన్మోహన్‌రెడ్డి అంతరంగాన్ని అర్థంచేసుకోగలిగితే ఈ సందేహానికి సమాధానం లభిస్తుంది. ఓటర్లకు, తనకు మధ్య నాయకుల అవసరం ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి సిద్ధాంతంగా చెబుతున్నారు. రాజకీయ కుటుంబాలకు చెందినవారిని సంతృప్తిపరచడం కష్టమనీ, అదేవిధంగా కమ్మ, కాపు సామాజికవర్గాలపై ఆధారపడకూడదనీ ఆయన నిర్ణయించుకున్నారట. ముఖ్యమంత్రి పదవికి కమ్మ, కాపు సామాజికవర్గాలతోపాటు రాజకీయ కుటుంబాల నుంచి ఎప్పటికైనా పోటీ ఉంటుందనీ, కనుక తన అధికారాన్ని ఆశించలేని స్థితిలో ఉన్న బడుగు, బలహీనవర్గాల వారిని దరిజేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయానికి జగన్మోహన్‌రెడ్డి వచ్చినట్టు కనిపిస్తోంది. సీనియర్లు, రాజకీయ కుటుంబాలకు చెందినవారు ఎప్పటికైనా కొరకరాని కొయ్యలుగానే ఉంటారనీ, అలాంటి వారిని కేసీఆర్‌ తరహాలో పక్కనబెట్టాలనీ జగన్‌ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే నాయకులతో పనిలేకుండా తనకు సొంతంగా బలమైన ఓటుబ్యాంక్‌ను ఏర్పాటుచేసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందినా, చెందకపోయినా సంక్షేమ పథకాల పేరిట ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోగలిగితే అధికారానికి ఢోకా ఉండదన్నది జగన్‌ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను చూస్తే జగన్‌ వ్యూహం ఏమిటో అవగతమవుతుంది. సంక్షేమం మాత్రమే ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచుతుందా? అంటే గ్యారంటీ ఉండదు. ఉప ముఖ్యమంత్రులుగా జగన్‌ ఎంపిక చేసినవారిని గమనిస్తే.. ఆయన ఆలోచన ఏమిటో వెల్లడవుతుంది.


రాజకీయం మారాలి!

సొంత పార్టీలోనే కాకుండా ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో కూడా బలమైన నాయకులను, రాజకీయ కుటుంబాలను దెబ్బతీయడానికి జగన్మోహన్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ వేధింపులను భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాకు చెందిన అశోక్‌ గజపతిరాజుపై దృష్టిసారించారు. రాజ వంశానికి చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ను తొలగించి అప్పటివరకు విజయనగరం ప్రజలకు పెద్దగా పరిచయం లేని ఆనంద్‌ గజపతిరాజు కుమార్తె సంచయితను తెరపైకి తెచ్చి చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. జిల్లా రాజకీయాలలో అశోక్‌ గజపతిరాజు ప్రాబల్యం మసకబారేలా పావులు కదుపుతున్నారు. రాజకీయ కుటుంబంలో లుకలుకలు ఉన్నాయని ప్రచారం చేయడం ద్వారా ప్రజలలో పలుచన చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది జరుగుతుండగానే పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా చలామణి అవుతున్న అచ్చెన్నాయుడిపై దృష్టిపెట్టారు. ఈఎస్‌ఐ కుంభకోణం అంటూ అచ్చెన్నను అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలపై ఎర్రన్నాయుడు కుటుంబానికి మంచి పట్టు ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మృతి చెందిన తర్వాత ఆయన సోదరుడైన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న యనమల రామకృష్ణుడు రాష్ట్రస్థాయిలో బీసీ నాయకుడిగా పేరొందారు. ఆయన చంద్రబాబుకు కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు. నిమ్మకాయల చినరాజప్ప మరో సీనియర్‌ నాయకుడు.


పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన నిర్వహించారు. ఈ ఇరువురు నాయకులపై అనూహ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వారు చేసిన నేరం ఏమిటంటే.. గతంలో ఎస్సీ మహిళను పెళ్లి చేసుకున్న ఒక బీసీ నాయకుడు ఆమెతో తెగదెంపులు చేసుకుని ఇటీవల రెండవ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి యనమల, చినరాజప్ప హాజరయ్యారు. దీంతో ఎస్సీ వర్గానికి చెందిన మొదటి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఇరువురు నాయకులపై సదరు కేసు పెట్టారు. పెళ్లికి హాజరైనవారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని పోలీసులు ఎలా సమర్థించుకుంటారో తెలియదు. నిన్నటివరకు ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా పనిచేసిన చినరాజప్ప, 1983లోనే ఎన్‌టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నాయకుడైన యనమలపైనా ఈ తరహా కేసుపెట్టడం జగన్మోహన్‌రెడ్డి రచించుకున్న సరికొత్త రాజకీయ వ్యూహంలో భాగం. ఈ కేసు వెలుగు చూసే లోపే విశాఖపట్టణానికి చెందిన తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, అత్యాచారం చేసిన సందర్భాలలో ఈ చట్టం కింద కేసు పెడతారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు అలాంటివి ఏమీ చేయలేదు. నర్సీపట్నం మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఒక మహిళా అధికారిణిపై.. ఆమె పరోక్షంలో కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల వల్ల తనకు బిడియంగా అనిపించిందనీ, సిగ్గు వేసిందనీ, ఈ కారణంగా ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని సదరు మునిసిపల్‌ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే... నిర్భయ చట్టం కింద ఆయనపై కేసు పెట్టారు.


గతంలో జగన్మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే సందర్భంగా రక్షణగా వచ్చిన పోలీసులలో ఒకరిపై ఆయన భార్య భారతిరెడ్డి చేయిచేసుకోవడాన్ని మనం టీవీలలో చూశాం. అయినా అప్పటి ప్రభుత్వం ఇలా కేసులు పెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఎంతో మంది అధికారులకు హెచ్చరికలు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న అహ్మద్‌బాబు పట్ల దురుసుగా వ్యవహరించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టలేదు. రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉన్నవారు కొన్ని సందర్భాలలో సంయమనం కోల్పోయి నోరు జారుతుంటారు. అధికారంలో ఉన్నవారు కొందరు చేయిచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు.. రాజకీయాలలోకి రాకముందే జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లాలో ఒక ఎస్సైని చెంప మీద కొట్టారు. ఆ సంఘటనను నాడు ఎంపీగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఒక సందర్భంలో సమర్థించుకున్నారు. తన కుమారుడు జగన్‌లో పౌర హక్కుల నాయకుడు ఉన్నాడనీ, అన్యాయాలను ప్రశ్నిస్తాడనీ, అతడిలో ఒక నక్సలైట్‌ కూడా ఉన్నాడనీ, అందుకే సరిగా స్పందించని ఎస్సైని కొట్టాడనీ రాజశేఖర్‌రెడ్డి తెలివిగా సమర్థించుకున్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను ఒకప్పుడు కొట్టిన పోలీసులను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు నమ్మకం లేదన్న పోలీసులతోనే ప్రతిపక్షాలపై కేసులు పెట్టిస్తున్నారు. ఈ కేసులు న్యాయ సమీక్షలో నిలబడతాయా? లేదా? అన్నది తర్వాత విషయం.


ప్రస్తుతానికి తన టార్గెట్‌లో ఉన్న నాయకులను, రాజకీయ కుటుంబాలను దెబ్బతీయవచ్చు.. మానసికంగా కుంగదీయవచ్చు అని జగన్‌ నమ్ముతున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా జగన్‌ నుంచి ఎదురవుతున్న సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలెంజ్‌గా మారింది. సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడిన తెలుగుదేశం పార్టీకి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ తరహా గెరిల్లా దాడులను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను మదింపు చేసుకుని తెలుగుదేశం పార్టీ తమ సిలబస్‌ను మార్చుకోవలసిన అవసరముంది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా హిట్‌లిస్టులో ఉన్నవారిని జగన్‌ టార్గెట్‌ చేసుకుంటూ పోతుండగా.. ఆవేదన, ఆక్రోశం వ్యక్తంచేయడం చంద్రబాబు వంతు అవుతోంది. చట్టసభలలోనే అసహ్యకర హావభావాలతో, తొడలు చరుస్తూ ఏమి పీకుతారో అని సవాల్‌ చేసే మంత్రులను జగన్‌ తన పక్కన పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు తమిళనాడు రాజకీయాలను ఇప్పటికే మరిపించాయి. రాజకీయాలలో హుందాతనాన్ని ఆశించేవారు సిగ్గుపడే పరిస్థితులు తలెత్తాయి. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా జగన్‌ రాజకీయాలను ఆయన బాటలోనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పెద్దమనిషి తరహా రాజకీయాలు చేయాలనుకునేవారికి ఇకపై ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో చోటు ఉండకపోవచ్చు. కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. కలి పురుషుల పాలనలో రాజకీయాలు ఇలానే ఉంటాయి కాబోలు!


రాజధాని.. విషాదం!

ఇక జగన్‌ ప్రభుత్వం శాసనసభ ఆమోదం పొందిన 2020–21 వార్షిక బడ్జెట్‌ను పరిశీలిస్తే.. పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బడ్జెట్‌ ఆసాంతం అంకెల గారడీగా ఉంది. వివిధ పద్దులలో డూప్లికేషన్‌ కనిపించింది. కాపులకు కేటాయించిన నిధులే ఇందుకు నిదర్శనం. ఇతర పథకాల కింద కాపులకు ఇచ్చే మొత్తాలను కూడా కాపులకు కేటాయించిన రూ.2,800 కోట్లలో కలిపేశారు. మిగతావారి విషయంలో కూడా ఇలాగే జరిగింది. నిధులన్నీ సంక్షేమానికే కేటాయించి, పెట్టుబడి వ్యయాన్ని దారుణంగా తగ్గించడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం కాబోతోంది. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం కేటాయించిన 500 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదని ప్రజలు ఆర్థంచేసుకోవలసి ఉంది. పైసా ఖర్చు లేకుండా సమకూరిన 50 వేల ఎకరాల భూమిని, పది వేల కోట్ల రూపాయలతో జరిగిన నిర్మాణాలను దయ్యాల కొంపలుగా మార్చి.. 500 కోట్లతో మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనుకోవడం హాస్యాస్పదం కాదా? యేటా 500 లేదా వెయ్యి కోట్లు కేటాయించినా నాలుగేళ్లలో 4 వేల కోట్లతో మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయనడం ఆత్మవంచన కాదా? సామాజికవర్గాల మధ్య ద్వేషాన్ని రగిలించి అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశమున్న అమరావతిని ఎడారిగా మార్చివేయడం విజన్‌ అనిపించుకుంటుందా? జగన్‌ స్థానంలో రాజశేఖర్‌రెడ్డి ఉండి వుంటే అమరావతిని మహానగరంగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యం ఇచ్చి ఉండేవారు. అధికార వికేంద్రీకరణ బిల్లు విషయమై శాసనమండలిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రుల వ్యవహార శైలిని ప్రజల విజ్ఞతకే వదిలివేయాలి. ఈ రెండు జిల్లాలకు చెందిన అధికార పార్టీ శాసనసభ్యులు శాసనసభలో ఈ బిల్లును సమర్థించి పాస్‌ చేయడం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ దురదృష్టానికి చింతించడం మినహా చేయగలిగింది ఏమీ లేదు.


అమరావతినే రాజధానిగా కొనసాగించాలని భూములు ఇచ్చిన రైతులు ఆరు నెలలుగా చేస్తున్న ఆందోళన అరణ్యరోదనగా మారిపోవడం విషాదం. రాజధానిని ముక్కలు చేయాలనుకోవడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇవ్వాళ కాకపోయినా, రేపు అయినా ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించకపోరు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా జగన్‌ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భూములిచ్చిన రైతులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందో తెలియదు. ఆ పరిస్థితి ఎదురైతే నష్టపరిహారానికి అవసరమైన డబ్బును జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుందో తెలియదు. రాజకీయ వ్యూహంతో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం వేరు.. మందబలం ఉందన్న అహంభావంతో దుష్ట ఆలోచనలు చేయడం వేరు. ప్రజాధనాన్ని సంక్షేమం పేరిట పంచడానికి తెలివితేటలు అవసరం లేదు. రాష్ట్ర సంపదను పెంచే ఆలోచనలు చేసేవాడే రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకుంటారు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలని ఏ రాజకీయ నాయకుడైనా కోరుకుంటారు. అయితే అందుకు వారు ఎంచుకునే మార్గం ఎలాంటిది అన్నదే ముఖ్యం. తనకు రాజకీయంగా ఎదురులేకుండా చేసుకోవడానికై జగన్మోహన్‌రెడ్డి ఎంచుకున్న మార్గం ప్రమాదకరమైనదని చెప్పవచ్చు! ప్రమాదాలు జరిగినప్పుడు మృతిచెందిన వారికి ఉదారంగా సహాయం చేసి తాత్కాలికంగా మంచిపేరు తెచ్చుకోవచ్చు. జగ్గయ్యపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణవారికి కూడా ఐదు లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని జగన్‌ ప్రకటించగా, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమ పౌరులకు రెండు లక్షలు మాత్రమే ప్రకటించారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ ధనిక రాష్ట్రమని ఆంధ్రా ప్రజలు కూడా భావిస్తే చేయగలిగింది ఏమీ లేదు. ‘నాది కాకపోతే...’ అన్నట్టుగా జగన్‌ వ్యవహరిస్తున్నారు. అన్నింటా రాజకీయ ప్రయోజనాలను వెతుక్కోవాలనుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-06-21T05:46:06+05:30 IST