ఎమ్మెల్యేగా ‘ఆరణి’కి గుర్తింపు లేదు

ABN , First Publish Date - 2022-06-27T06:44:39+05:30 IST

టీడీపీకి అన్ని సామాజిక వర్గాలు సమానమేనని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎమ్మెల్యేగా ‘ఆరణి’కి గుర్తింపు లేదు
ఎమ్మెల్సీ దొరబాబు

కఠారి దంపతుల హత్యపై ఎమ్మెల్యే మాటలు దురదృష్టకరం 

ఆ వ్యాఖ్యలు నిరూపించకుంటే పరువునష్టం దావా వేస్తామన్న ఎమ్మెల్సీ దొరబాబు 

చిత్తూరు సిటీ, జూన్‌26: టీడీపీకి అన్ని సామాజిక వర్గాలు సమానమేనని ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరులో ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులుకు గుర్తింపులేదన్నారు. అధికారులంతా ఇంకో వైసీపీ నేతవద్దకే వెళుతున్నారని చెప్పారు. ఆయనకు మంత్రిపదవి ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అన్ని సామాజిక వర్గాలను సమానంగానే చూస్తోందన్నారు. బీసీలకు 20 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి అన్ని రంగాల్లో అవకాశం కల్పించింది స్వర్గీయ ఎన్టీయార్‌ అని అన్నారు. సామాజిక వర్గాల గురించి ఎమ్మెల్యే మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ‘కఠారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్య వారి కుటుంబీకులకు సంబంధించిందని చెబుతూనే దీని వెనుక ఒక సామాజికవర్గం ప్రోత్సహించింది అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయాన్ని ఆయన నిరూపించాలి. లేకుంటే పరువునష్టం దావా వేస్తాం’ అని చెప్పారు. సర్పంచిగా, జట్పీటీసీగా, జిల్లా విప్‌గా, పార్టీ అధ్యక్షుడిగా, రాజకీయంగా ఎలా ఎదిగావో గుర్తుంచుకోవాలని, ఆదరించిన పార్టీపైన ఇలా మాట్లాడటం సభ్యత కాదని హితవుపలికారు. కఠారి హేమలత అనుచరుడు పూర్ణపై జరిగిన సంఘటనలో కూడా పోలీసులే గంజాయి పెట్టి తప్పుడు కేసు పెట్టారన్నారు. నిజంగా రాష్ట్రంలో గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 

Updated Date - 2022-06-27T06:44:39+05:30 IST