అభినందనల్లేని అర్వింద్‌!

ABN , First Publish Date - 2022-03-12T07:26:38+05:30 IST

ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాఽధిస్తే ఆ పార్టీ అధినేతకు సాధారణంగా అభినందనలు వెల్లువెత్తుతాయి...

అభినందనల్లేని అర్వింద్‌!

  ఆప్‌ ఘనవిజయంపై అభినందించని విపక్ష నేతలు

న్యూఢిల్లీ, మార్చి 11: ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాఽధిస్తే ఆ పార్టీ అధినేతకు సాధారణంగా అభినందనలు వెల్లువెత్తుతాయి. పంజాబ్‌లో.. అధికార కాంగ్రె్‌సను మట్టి కరిపించి, బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధించినా అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు విపక్ష నేతలెవరూ శుభాకాంక్షలు చెప్పలేదు. బీజేపీ పొడ గిట్టని నేతలు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గానీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ గానీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గానీ, కేరళ సీఎం పినరయి విజయన్‌ గానీ, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గానీ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలపలేదు. యూపీలో బీజేపీ విజయం సాధించడం గొప్పేమీ కాదని.. కేంద్ర బలగాలను దించి, ఈవీఎంలను మేనేజ్‌ చేసి అక్కడ కమలనాథులు గెలిచారని విమర్శించిన మమత.. పంజాబ్‌లో ఆప్‌ విజయం గురించి గానీ కేజ్రీవాల్‌ గురించి గానీ ఏమీ మాట్లాడలేదు. శుక్రవారం ఫలితాలు వెలువడిన తర్వాత పినయి విజయన్‌, ఓ వంతెన ప్రారంభోత్సవం గురించి ట్వీట్‌లో రాసినా ఆప్‌ విజయంపై అక్షరం ముక్క కూడా రాయలేదు. ఒరియా భాషకు కళాత్మక భాషగా గుర్తింపు దక్కడంపై ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేసినా ఆప్‌ విజయం గురించి మాట మాత్రమైనా రాయలేదు. కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ మాత్రం కేజ్రీవాల్‌కు అభినందనలు తెలియజేశాయి.

Updated Date - 2022-03-12T07:26:38+05:30 IST