Aam Aadmi Party : కాంగ్రెస్ పని అయిపోయింది : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-09-13T21:13:37+05:30 IST

కాంగ్రెస్ పని అయిపోయిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi

Aam Aadmi Party : కాంగ్రెస్ పని అయిపోయింది : కేజ్రీవాల్

అహ్మదాబాద్ : కాంగ్రెస్ పని అయిపోయిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party-AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. గుజరాత్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఆ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులతో మంగళవారం టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 


ఓ విలేకరి మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి గుజరాత్‌లో ప్రకటనలు ఇస్తోందని, పంజాబ్ దివాలా అంచున ఉందని కాంగ్రెస్ ఆరోపించిందని, దీనిపై స్పందించాలని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఈ ప్రశ్నను ఎవరు అడిగారని ప్రశ్నించారు. దీనికి ఆ విలేకరి బదులిస్తూ, ఓ కాంగ్రెస్ నాయకుడు అడిగినట్లు చెప్పారు. వెంటనే కేజ్రీవాల్ బదులిస్తూ, కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. వాళ్ళ ప్రశ్నలను అడగడం మానేయండన్నారు. ప్రజలు ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారన్నారు. వాళ్ళ ప్రశ్నలను ఎవరూ పట్టించుకోరన్నారు. 


కేజ్రీవాల్ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను గుజరాత్ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని బీజేపీ చెప్తోందని ఓ విలేకరి ప్రస్తావించారు. దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ తర్వాత సోనియా గాంధీని ప్రధాన మంత్రిని చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పండన్నారు. దీని గురించి ఏమంటారో బీజేపీ నేతలను అడగాలన్నారు.


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కేజ్రీవాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పాలన రాకూడదని కోరుకునేవారు ఉన్నారని, వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి కూడా ఇష్టపడటం లేదని, మనం మాత్రమే బీజేపీకి ప్రత్యామ్నాయం కాబట్టి, అలాంటివారి ఓట్లను సాధించాలని చెప్పారు. 


Updated Date - 2022-09-13T21:13:37+05:30 IST