‘SMS ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక’

ABN , First Publish Date - 2022-01-13T19:57:58+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం ప్రజాభిప్రాయాన్ని

‘SMS ద్వారా సీఎం అభ్యర్థి ఎంపిక’

న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సీఎం అభ్యర్థిని తానే ప్రకటిస్తానని చెప్పిన మర్నాడే ఆయన సెల్ నెంబరు 70748 70748ను ప్రకటించారు. ఈ సెల్‌ నెంబరుకు కాల్ చేసి లేదా మెసేజ్ లేదా వాట్సాప్ సందేశం ఇచ్చి  తమకు నచ్చిన అభ్యర్థి పేరును చెప్పాలని పంజాబ్ ప్రజలను కోరారు. తాను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని చెప్పారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను ఆ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజలకు వదిలిపెట్టాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని జనవరి 17 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలన్నారు. ప్రజల ఓట్ల ద్వారా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు.


పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ అధ్యక్షుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ సింగ్ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని నాలుగు గోడల మధ్య ఎంపిక చేయవద్దని, ప్రజల వద్దకు వెళ్ళాలని మాన్ తనకు చెప్పారని కేజ్రీవాల్ తెలిపారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరుగుతాయి. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలేవీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఇటీవల మాట్లాడుతూ, పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది ప్రజలేనని, కాంగ్రెస్ హైకమాండ్ కాదని చెప్పారు. 


Updated Date - 2022-01-13T19:57:58+05:30 IST