Make India No. 1: అన్ని పార్టీలు నా వెంట రావాలి : అరవింద్ కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-08-17T21:13:45+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)

Make India No. 1: అన్ని పార్టీలు నా వెంట రావాలి : అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) యావత్తు దేశ సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ లక్ష్యం కోసం మేక్ ఇండియా నెం.1 (Make India No. 1) అనే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. భారత దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ప్రథమ స్థానంలో నిలిపేందుకు తనతో కలిసి రావాలని అన్ని పార్టీలను కోరారు. 


ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాఠశాలలను నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంపై ప్రధాన దృష్టితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు తనతో కలిసి రావాలన్నారు. 


మేక్ ఇండియా నెంబర్ వన్ మిషన్ ద్వారా దేశంలోని 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానం చేస్తామన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిందని, ఈ సమయంలో ఎంతో సాధించామని, అయితే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఈ కాలంలో చాలా చిన్న దేశాలు మన కన్నా ముందుకు దూసుకెళ్ళాయనే భావన ఉందని చెప్పారు. 


27 కోట్ల మంది బాలలకు మంచి, ఉచిత విద్యను అందజేయాలన్నారు. పర్వతాలు, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయలేమని మనం చెప్పకూడదన్నారు. ఎంత ఖర్చు అయినప్పటికీ, ఈ పనిని చేయాలన్నారు. ఓ బాలుడు లేదా బాలిక తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసి, ధనిక కుటుంబంగా మార్చగలరన్నారు. అలాంటపుడు సంపన్న దేశాల జాబితాలో భారత దేశం చేరుతుందని చెప్పారు. 


మనం దృష్టి సారించవలసిన రెండో అంశం, ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్య చికిత్సను అందజేయడమని చెప్పారు. మనం కృషి చేయవలసిన మూడో అంశం యువ శక్తి అని తెలిపారు. యువ శక్తి మనకుగల అద్భుతమైన బలమని చెప్పారు. నేడు యువత నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని, యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. 


విశ్లేషకుల కథనం ప్రకారం, గుజరాత్ శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఢిల్లీలో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ను కూడా కైవసం చేసుకోవడంతో ఆ పార్టీలో గొప్ప ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇక గుజరాత్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. 


Updated Date - 2022-08-17T21:13:45+05:30 IST