లాక్‌డౌన్ విధించే యోచన లేదు : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-09T19:59:37+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్-19 ఐదో ప్రభంజనం

లాక్‌డౌన్ విధించే యోచన లేదు : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్-19 ప్రభంజనం వ్యాపిస్తున్నప్పటికీ  అష్ట దిగ్బంధనం (లాక్‌డౌన్)ను విధించే యోచన లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం చెప్పారు. గడచిన 24 గంటల్లో దాదాపు 22,000 కేసులు నమోదైనట్లు తెలిపారు. రోజువారీ ఆరోగ్య ప్రకటన ఆదివారం సాయంత్రం విడుదలవుతుంది. 


శనివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం, నగరంలో కొత్తగా 20,181 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాను కోవిడ్-19 నుంచి కోలుకున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అనంతరం వీడియో బ్రిఫింగ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధక మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరారు. కోవిడ్-19 వ్యాప్తి వేగంగా జరుగుతున్నప్పటికీ, ఆసుపత్రి పడకలను వినియోగించుకోవలసిన అవసరం తక్కువగా ఉందని తెలిపారు. కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. 


గత కోవిడ్ ప్రభంజనం సమయంలో 2021 మే 7న 20,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 341 మంది మరణించారని, 20,000 ఆసుపత్రి పడకలను వినియోగించుకోవలసిన అవసరం ఏర్పడిందని తెలిపారు. 2022 జనవరి 8న ఢిల్లీలో 20,000 కేసులు నమోదయ్యాయని, ఏడుగురు మరణించారని, 1,500 పడకలు వినియోగించుకున్నారని చెప్పారు. తాను కోవిడ్-19 పాజిటివ్ అయినప్పటికీ ఐసొలేషన్‌లో ఉంటూ రాష్ట్రంలో పరిస్థితిని నిశితంగా పరిశీలించానని తెలిపారు. 


ఇదిలావుండగా, ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశం సోమవారం జరుగుతుంది. నిపుణులు, ఉన్నతాధికారులతో కోవిడ్ పరిస్థితిని సమీక్షిస్తుంది. మరిన్ని ఆర్థిక, ప్రయాణ సంబంధిత ఆంక్షలను విధించవలసిన అవసరం ఉందా? అనే అంశంపై చర్చిస్తుంది. 


Updated Date - 2022-01-09T19:59:37+05:30 IST