యథేచ్చగా ఇసుక దందా

ABN , First Publish Date - 2021-04-18T06:16:57+05:30 IST

మండలంలోని శెట్టిపల్లిలో అధికార పార్టీ అండదండలతో ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

యథేచ్చగా ఇసుక దందా
శెట్టిపల్లి వ్యవసాయ పొలంలో నిలువ ఉంచిన ఇసుక

-వ్యవసాయ పొలాల్లో నిల్వలు

-కన్నెత్తి చూడని అధికారులు 

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 17: మండలంలోని శెట్టిపల్లిలో అధికార పార్టీ అండదండలతో ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో ఇసుక లోడ్‌చేసుకుని వ్యవసాయ పొలాలకు తరలించి విచ్చలవిడిగా లోడ్‌ చేస్తున్నా సెబ్‌ అధికారులు, పోలీసులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది.  నిబంధనల ప్రకారం ఎవరికైతే ఇసుక అవసరమో వారు దరఖాస్తు చేసుకుంటే లబ్దిదారుల పేరిట ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తారు. శెట్టిపల్లి చెరువులో అధికారులు ఇసుక రీచను ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్దంగా అటవీప్రాంతంలో ఎక్కడబడితే అక్కడ తవ్వుకుని ఇసుక లోడింగ్‌ చేసుకుని వ్యవసాయ పొలాల్లో ఇసుక నిలువలు చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెనుకొండ చుట్టుపక్కల ప్రాంతాల తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయ పొలాల్లో కాలువల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు అడుగంటిపోతున్నాయని గ్రామంలోని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శెట్టిపల్లిలో వ్యవసాయ పొలాల్లో కాలువ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు.


Updated Date - 2021-04-18T06:16:57+05:30 IST