ఇష్టారాజ్యంగా డివైడర్ల నిర్మాణం

ABN , First Publish Date - 2021-11-28T05:22:23+05:30 IST

అద్దంకి నగర పంచాయతీలో రోడ్లు, సైడ్‌ డ్రైన్‌లతోపాటు డివైడర్ల నిర్మాణ పనుల్లో ప్రణాళిక లోపించింది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. బంగ్లారోడ్డులో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, సీపీ కెమెరాల పోల్సు తొలగించకుండానే డివైడర్లు నిర్మించడంతో మరింత ఇరుకుగా మారింది.

ఇష్టారాజ్యంగా డివైడర్ల నిర్మాణం
నగరపంచాయతీ కార్యాలయం ఎదురు ఏర్పాటు చేయని డివైడర్‌

ప్రణాళిక ప్రకారం చేయడం లేదని ప్రజల విమర్శలు

నగర పంచాయతీ అధికారుల తీరుపై విస్మయం

 అద్దంకి, నవంబరు 27 : అద్దంకి  నగర పంచాయతీలో రోడ్లు, సైడ్‌ డ్రైన్‌లతోపాటు డివైడర్ల నిర్మాణ పనుల్లో ప్రణాళిక లోపించింది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. బంగ్లారోడ్డులో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, సీపీ కెమెరాల పోల్సు తొలగించకుండానే డివైడర్లు నిర్మించడంతో మరింత ఇరుకుగా మారింది. అంబేడ్కర్‌ బొమ్మ వద్ద నుంచి ప్రకాశం పంతులు బొమ్మ వరకూ డివైడర్‌ల మధ్యలో అక్కడక్కడా ఖాళీ ఇవ్వకపోవటంతో చిన్న పనులకు సైతం వాహన చోదకులు, ప్రజలు చివర వరకూ ప్రయాణించాల్సి వస్తోంది. నగర పంచాయతీ కార్యాలయం (మెయిన్‌) రోడ్డులో జరుగుతున్న పనుల పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సెంటర్‌ పేరుతో కొద్దిమేర వ్యత్యాసం ఉన్నా సరిచేయకుండా డివైడర్‌ను వంకగా నిర్మించారు. ప్రజల  ఇబ్బందులు  పట్టించుకోకుండా నగరపంచాయతీ కార్యాలయానికి వచ్చే వారు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సౌకర్యవంతంగా ఉంటేచాలు అన్న విధంగా పనులు చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు బొమ్మ వద్ద నుంచి నగరపంచాయతీ కార్యాలయం వరకు మధ్యలో ఏఒక్క చోట కూడా వాహనాలు  మలుపు తిరిగే విధంగా డివైడర్‌ మధ్యలో గ్యాప్‌  ఇవ్వలేదు. కానీ నగరపంచాయతీ కార్యాలయం ఎదురు మాత్రం అసలు డివైడర్‌ ఏర్పాటు చేయకుండా పూర్తిగా వదిలి వేశారు. నగరపంచాయతీ కార్యాలయం పక్కనే నాలుగు రోడ్ల కూడలి ఉంది. అక్కడ ఎక్కువ ఖాళీ వదిలితే అన్ని వాహనాలూ మలుపు తిరిగే వీలుంటుంది. అందుకు భిన్నంగా నగరపంచాయతీ కార్యాలయంలోకి సులువుగా రాకపోకలు సాగించే విధంగా సుమారు 60 అడుగుల దూరం డివైడర్‌ లేకుండా వదిలివేయడాన్ని పలువురు వ్యాపారులు, వాహనచోదకులు తప్పుబడుతున్నారు. ఆ పక్కనే కూడలి ఉన్నందున డివైడర్‌ నిర్మించకుండా వదిలివేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా వాహనచోదకులు  ఒక్కసారిగా అడ్డదిడ్డంగా ప్రయాణించి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు  స్పందించి నగరపంచాయతీ కార్యాలయం ఎదురు మరికొంత దూరం డివైడర్‌ పెంచాలని, అదే సమయంలో కూడలి ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి విశాలంగా మార్చి సర్కిల్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

కార్యాలయంలోకి రాకపోకలకు వీలుగా డివైడర్‌ నిర్మించాం

రోహిణి, ఏఈ, అద్దంకి నగరపంచాయతీ

నగరపంచాయతీ కార్యాలయంలోకి సులువుగా రాకపోకలు సాగించే విధంగా గ్యాప్‌ ఎక్కువ వదిలాం. కూడలి నుంచి కన్యకాపరమేశ్వరి దేవాలయం సమీపం వరకూ డివైడర్‌ నిర్మించే క్రమంలో ప్రస్తుతం ఉన్న ఖాళీని కొంత మేరకు తగ్గేంచేలా చర్యలు చేపడతాం.   

Updated Date - 2021-11-28T05:22:23+05:30 IST