యథేచ్ఛగా వేట

ABN , First Publish Date - 2022-05-09T04:09:27+05:30 IST

పచ్చని అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్య ప్రాణుల కు వేటగాళ్ల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది. వన్య ప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు వదులుతున్నాయి. విద్యుత్‌ తీగలు అమర్చడంతో వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలు, పశువుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడి మాంసం, చర్మం, కొమ్ములు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడవుల్లో, పంట పొలా లు, చేన్లలో విద్యుత్‌ తీగలు అమర్చడంతో మూగజీవాలు బలవుతున్న ఘట నలు జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిత్యకృత్యమయ్యాయి.

యథేచ్ఛగా వేట
ఇటీవల తీగలకు తగిలి మృతిచెందిన కిష్టయ్య మృతదేహం వద్ద కుటుంబీకులు

వన్యప్రాణులను హతమార్చేందుకు విద్యుత్‌ తీగలు అమరుస్తున్న వేటగాళ్లు 

గాలిలో కలుస్తున్న మనుషులు, పశువుల ప్రాణాలు

వేటగాళ్లకు అవగాహన కల్పిస్తున్న అటవీ, పోలీసు అధికారులు

పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరిక

కోటపల్లి, మే 8 : పచ్చని అడవుల్లో  స్వేచ్ఛగా తిరగాల్సిన వన్య ప్రాణుల కు వేటగాళ్ల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది. వన్య ప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు వదులుతున్నాయి. విద్యుత్‌ తీగలు అమర్చడంతో  వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలు, పశువుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడి మాంసం, చర్మం, కొమ్ములు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  అడవుల్లో, పంట పొలా లు, చేన్లలో విద్యుత్‌ తీగలు అమర్చడంతో మూగజీవాలు బలవుతున్న ఘట నలు జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిత్యకృత్యమయ్యాయి. క్షేత్రస్థాయిలో విద్యుత్‌, అటవీ శాఖల సమన్వయ లోపమే ఇందుకు ప్రధాన కారణం అవుతుండగా, వేటగాళ్లను పోలీసులు పట్టుకుని జైలుకు పంపినా వారిలో మార్పు రావడం లేదు. 

విద్యుత్‌ తీగలతో ఉచ్చులు బిగిస్తూ...

కోటపల్లి మండలంలోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో వేటగాళ్లు విద్యుత్‌ తీగలతో ఉచ్చులు బిగిస్తున్నారు. పిన్నారం, ఎడగట్ట, పంగిడిసోమారం, నక్కలపల్లి, సిర్సా, వెంచపల్లి, అర్జునగుట్ట, రాజా రం, అన్నారం, రాపనపల్లి, ఏదులబంధం, బొప్పారం, నాగంపేట, కొత్తపల్లి, బ్రహ్మణపల్లి తదితర గ్రామాల్లోని సరిహద్దు అటవీ ప్రాంతాలు, ప్రాణహిత సరిహద్దుల్లో పెద్ద ఎత్తున వన్య ప్రాణులు ఉన్నాయి. జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, మెఖాలు, అడవి పందులతోపాటు పులుల సంచారం ఉంటోంది. రాత్రిపూట వేటగాళ్లు 11కేవీ విద్యుత్‌ తీగలకు అల్యూమినియం తీగలను కొక్కీలుగా అమర్చి ఉచ్చులు బిగిస్తున్నారు. నీటి కుంటల వద్ద దాహం తీర్చుకునేందుకు వచ్చే వన్యప్రాణులు వేటగాళ్ల వలలో పడి ప్రాణాలు వదులుతున్నాయి. 

పులులకు ముప్పే...

తాడోబా నుంచి ఇక్కడకు వలస వచ్చే పులులకు వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. ఇక్కడి అడవులు పులులకు ఆవాసంగా మారాయి. జిల్లాలో ఏడాదికో పులి వేటగాళ్ల ఉచ్చుకు బలవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. పిన్నారం అటవీ ప్రాంతంలో 2017లో నాలుగేండ్ల వయస్సున్న పులి విద్యుత్‌ కంచెలకు తగిలి ప్రాణాలు కోల్పోయింది. అలాగే జైపూర్‌ మండలం శివ్వా రంలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ సైతం వేటగాళ్ల ఉచ్చులో పడి మృతిచెందింది. ఈ ఘటనలో నిందితులుగా తేలిన వేటగాళ్లు జైలుకు వెళ్లినా వారిలో మార్పు రాకపోగా మళ్లీ వేటను ప్రారంభించడంతో మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. శాకాహార జంతువులు నిత్యం బలవుతుండగా వీటి మాం సాన్ని వేటగాళ్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

పంటలకు రక్షణ పేరుతో

పంట పొలాలు, చేన్లలోని పంటలను అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయనే నెపంతో పంటల చుట్టూ విద్యుత్‌ తీగలను అమర్చడం ప్రమాదకరంగా మారింది. నవంబర్‌ నెలలో పిన్నారంలో పంటలకు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి మంద రాజన్న అనే రైతు మృతిచెందాడు. ఇటీవల దేవులవాడలో పంట పొలాలకు విద్యుత్‌ తీగలు అమర్చగా రెండు ఆవులు మృతి చెందడంతో గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున ఆందళన చేపట్టారు. దీంతో విచారణ చేసిన పోలీసులు విద్యుత్‌ తీగలు అమర్చిన ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఇటీవల ఎడగట్టకు చెందిన ముగ్గురు వేటగాళ్లు అటవీ ప్రాంతంలో విద్యుత్‌ తీగలు అమర్చగా చికినం కిష్టయ్య అనే వేటగాడు విద్యుత్‌ తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనలోని మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పులి మృతిచెందిన ఘటనలోని నిందితుడే ప్రస్తుతం మళ్లీ వేట సాగించడం, మరో మారు అరెస్టు కావడం గమనార్హం.

వేటగాళ్లకు అవగాహన

వేట మానుకోవాలని లేదంటే కఠినచర్యలు తప్పవని పోలీసులు  అవగాహన కల్పిస్తున్నారు. కోటపల్లి, నీల్వాయి, అటవీ రేంజ్‌ పరిధిలోని పలువురు వేటగాళ్లతో చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ రవికుమార్‌లతోపాటు అటవీ రేంజర్‌ రవి, విద్యుత్‌ శాఖ ఏఈ జాన్‌ విక్టర్‌లు కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్‌ తీగలతో వేట సాగిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

Read more