ఎంత భద్రం?

ABN , First Publish Date - 2021-05-10T04:39:25+05:30 IST

‘సామర్ధ్యానికి మించి పేలుడు పదార్థాలు వినియోగిస్తారు. అత్యంత శక్తివంతమైన అమ్మోనియం నైట్రేట్‌, జిలెటిన్‌స్టిక్స్‌, కేబుళ్లతో కొండలను పిండి చేస్తారు. సమీప గ్రామాల ప్రజల ఆందోళనను పట్టించుకోరు. కార్మికులకు కనీస రక్షణ చర్యలు ఉండవు. ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు భారీగా పరిహారాన్ని ముట్టజెబుతారు. అధికారులకు మామూళ్లు పంపించి మమ అనిపించేస్తారు. తరువాత షరా మూములుగానే ప్రక్రియ కొనసాగిస్తారు’.. ఇలా జిల్లాలో క్వారీల నిర్వహణ విషయంలో నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. కార్మికుల ప్రాణాలను హరిస్తున్నారు.

ఎంత భద్రం?
గారపేటలో నిర్వహిస్తున్న క్వారీ

జిల్లాలో ఇష్టారాజ్యంగా క్వారీల నిర్వహణ

నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం

యథేచ్ఛగా అమ్మోనియం నైట్రేట్‌, జిలెటెన్‌స్టిక్స్‌ వాడకం

కార్మికుల భద్రత ప్రశ్నార్థకం

పట్టించుకోని యంత్రాంగం

(పొందూరు)

‘సామర్ధ్యానికి మించి పేలుడు పదార్థాలు వినియోగిస్తారు. అత్యంత శక్తివంతమైన అమ్మోనియం నైట్రేట్‌, జిలెటిన్‌స్టిక్స్‌, కేబుళ్లతో కొండలను పిండి చేస్తారు. సమీప గ్రామాల ప్రజల ఆందోళనను పట్టించుకోరు. కార్మికులకు కనీస రక్షణ చర్యలు ఉండవు. ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు భారీగా పరిహారాన్ని ముట్టజెబుతారు. అధికారులకు మామూళ్లు పంపించి మమ అనిపించేస్తారు. తరువాత షరా మూములుగానే ప్రక్రియ కొనసాగిస్తారు’.. ఇలా జిల్లాలో క్వారీల నిర్వహణ విషయంలో నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. కార్మికుల ప్రాణాలను హరిస్తున్నారు. వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్నారు. కడప జిల్లాలో శనివారం జిలెటిన్‌స్టిక్స్‌ పేలుళ్ల ఘటనలో కార్మికులు మృత్యువాత పడిన నేపథ్యంలో.. మన జిల్లాలో క్వారీల్లో భద్రత ఎంత? అనే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.. 

-----------------------

జిల్లాలో అన్నిరకాల క్వారీలు కలిపి సుమారు 200 వరకూ ఉంటాయి. కానీ కొన్నింటికే అనుమతులు ఉన్నాయి. కొందరు రాజకీయ పలుకుబడితో క్వారీలు నిర్వహిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా కార్మిక కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. పొందూరు, టెక్కలి వంటి ప్రాంతాల్లో క్వారీల్లో ప్రమాదాలు జరుగుతున్నా... బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. బాధిత కుటుంబాలకు పరిహారం రూపంలో ముట్టజెబుతుండడంతో వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. క్వారీ నిర్వహణ, పేలుడు పదార్థాల వినియోగం, కార్మికుల భద్రతా చర్యల వంటి విషయంలో ఎక్కడా నిబంధనలు అమలుకావడం లేదు. మైనింగ్‌, పేలుడు పదార్థాల నియంత్రణ అధికారులు తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నారు. 


అనుమతులు లేకుండానే....

క్వారీలలో తవ్వకాలకు, పేలుడు పదార్థాలను వినియోగించడానికి ప్రత్యేక అనుమతులు ఉండాలి. ప్రత్యేక నిపుణుడిని నియమించుకొని ఆయన సమక్షంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలతో క్వారీ పేలుళ్లకు పూనుకోవాలి. కానీ జిల్లాలో చాలాచోట్ల ఇష్టారాజ్యంగా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్‌, జిలెటిన్‌స్టిక్స్‌ వంటి వాటిని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. భారీ పేలుడు సామర్థ్యం కలిగిన వీటిని వినియోగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. క్వారీ పేలుళ్లతో సమీప గ్రామాల ప్రజలు అసౌకర్యానికి గురికావాల్సి వస్తోంది. క్వారీల చుట్టూ ఉన్న వ్యవసాయ భూములకు అపార నష్టం కలుగుతోంది. రాళ్లు ఎగసిపడి ఇళ్లపైకి వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా చాలా క్వారీలపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు. క్వారీ నిర్వాహకులు తమ పలుకుబడితో మేనేజ్‌ చేస్తున్నారు. 


 పొందూరు మండలంలో అధికం

పొందూరు మండలంలో క్వారీలు అధికం. జిల్లాలో సగం ప్రాంతాలకు ఇక్కడి నుంచే రాయి, చిప్స్‌ వంటివి సరఫరా అవుతుంటాయి. రాపాక, ఇల్లయ్యగారిపేట, గారపేట, వావిలపల్లిపేట తదితర గ్రామాల్లో నల్లరాయి క్వారీలు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు క్వారీలపై ఆధారపడి బతుకుతున్నారు.  ఉపాధినిస్తున్న క్వారీలే కొన్నిసార్లు కార్మికులను బలిగొంటున్నాయి. సంబంధిత యాజమాన్యాలు శక్తివంతమైన పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. క్వారీ కార్మికులకు ప్రత్యేక భద్రతా చర్యలు అక్కడ కనిపించవు. యంత్రాలు కానీ, అత్యాధునిక పరికరాలు కానీ ఉండవు. అధిక డబ్బులను ఆశచూపి కార్మికులతో పనిచేయిస్తుంటారు. ఒకవేళ ప్రమాదంలో మృత్యువాత పడితే బాధిత కుటుంబానికి అధిక మొత్తంలో పరిహారం ఇవ్వజూపుతారు. ఈ విషయం బయటకు రాకుండా చూసుకుంటారు. పేలుడు పదార్థాల వినియోగానికి అనుమతి ఉండకపోగా.. వీటి విక్రయాలు కూడా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పొందూరు మండలంలో క్వారీలకు అవసరమైన పేలుడు పదార్థాలను ఓ గ్రామం కేంద్రంగా విక్రయిస్తుంటారు. 


అనుమతులు తప్పనిసరి

క్వారీల్లో పేలుడు పదార్థాల వినియోగానికి అనుమతులు తప్పనిసరి. జిలెటిన్‌స్టిక్స్‌, అమ్మోనియం నైట్రేట్‌ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు వినియోగించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వాటిని వినియోగించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. క్వారీల్లో కార్మికుల భద్రతను పెద్దపీట వేయాలి. ఫిర్యాదులు వస్తే యాజమాన్యాలపై కేసు నమోదు చేస్తాం.  

- ఆర్‌.దేవానంద్‌, ఎస్‌ఐ, పొందూరు

Updated Date - 2021-05-10T04:39:25+05:30 IST