బరి తెగిస్తున్నారు

ABN , First Publish Date - 2021-08-03T05:01:20+05:30 IST

బద్వేలులో అధికార పార్టీ నేతలు కొందరు బరి తెగిస్తున్నారు. స్థలాలు కానొస్తే చాలు.. కొందరు ఆక్రమిస్తుంటే మరికొందరు డీకేటీ భూములు కొనుగోలు చేసి అనుమతులు లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెర లేపినట్లు ఆరోపణలున్నాయి.

బరి తెగిస్తున్నారు
బద్వేలులోని సిద్దవటం రోడ్డులో వ్యవసాయ భూముల్లో చేస్తున్న నిర్మాణాలు

ఇష్టారాజ్యంగా డీకేటీ పట్టాల భూముల కొనుగోలు

అనధికారికంగా రియల్‌ వెంచర్లు

నిర్మాణాలు ఆపాలన్నజిల్లా అధికారుల ఆదేశాలు బేఖాతర్‌

బద్వేలులో అధికార పార్టీ అండతో పేట్రేగుతున్న వైనం

కడప, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): బద్వేలులో అధికార పార్టీ నేతలు కొందరు బరి తెగిస్తున్నారు. స్థలాలు కానొస్తే చాలు.. కొందరు ఆక్రమిస్తుంటే మరికొందరు డీకేటీ భూములు కొనుగోలు చేసి అనుమతులు లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెర లేపినట్లు ఆరోపణలున్నాయి. కాలజ్ఞానతత్వవేత్త బ్రహ్మంగారు బద్వేలు బస్తీ అవుతుందని చెప్పారు. ఆ మహనీయుడి మాటలకు తగ్గట్లుగానే పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. బ్రహ్మంగారిమఠం, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, నెల్లూరు జిల్లాలోని సరిహద్దు మండలాల ప్రజలు బద్వేలులోనే స్థిర నివాసానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో అక్కడ నివాస భూములకు రెక్కలొచ్చాయి. అలాగే బద్వేలు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. సక్రమంగా రియల్‌ఎస్టేట్‌ జరిగితే మంచిదే. అయితే అధికారులను అడ్డు పెట్టుకుని అడ్డదారుల్లో వెంచర్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సొంతంగా లబ్ధి పొందుతున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, కొంతమంది మున్సిపల్‌ అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక వారికే సలాం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అక్కడ  కొందరు నేతల ఆగడాలకు అడ్డులేకుండాపోయిందని అంటున్నారు. డీకేటీ భూములు క్రయవిక్రయాలు నిషేధం. అయితే బద్వేలులో మాత్రం యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడ జరుగుతున్న భూఆక్రమణలపై స్థానికులు, కమ్యూనిస్టు నాయకులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. 


ఇష్టారాజ్యంగా డీకేటీ భూముల కొనుగోలు

పట్టణంలోని సిద్దవటం రోడ్డులో గల విద్యానగర్‌ సమీపంలో సర్వే నెం.1754, 1754-2, 1755-3తో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో భూమి లేని నిరుపేదలకు పంటల సాగు కోసం గతంలో కొందరికి పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో స్థలాలకు మంచి డిమాండ్‌ ఉంది. అయితే మున్సిపల్‌ పాలకవర్గంలోని ఓ కీలక నేత ఆ భూములను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర వాటికి ఉపయోగించడం, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ కలెక్టరుకు ఫిర్యాదులు చేశారు. నిర్మాణాలు ఆపాలంటూ కలెక్టరు ఆదేశాలు ఇచ్చారు. అయితే స్థానిక అధికారులు దానిని లైట్‌ తీసుకోవడంతో అక్కడ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతరానికి ఉపయోగించాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫీజు చెల్లించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారు. బద్వేలు, గోపవరం మండలం శరవేగంగా విస్తరిస్తోంది. ఎక్కువ శాతం ఇక్కడ డీకేటీ భూములే ఉన్నాయి. మడకలవారిపల్లె రెవెన్యూ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములన్నీ వ్యవసాయేతర భూములుగా మార్చి వేసి క్రయ విక్రయాలు జరిపారు. సిద్దవటం రోడ్డులోని ఓ ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్లు వేసి విక్రయించినట్లు చెబుతారు. పట్టణ శివారు మైదుకూరు రోడ్డులోని వ్యవసాయ భూములన్నీ వ్యవసాయేతర భూములుగా చాలావరకు మారిపోతున్నాయి. జాతీయ రహదారి ఉండడంతో ఇక్కడ భూములకు డిమాండ్‌ పెరిగింది. దీంతో అనుమతులు లేకుండానే కమర్షియల్‌ కట్టడాలు నిర్మిస్తున్నారు. 


అక్రమ కట్టడాలు నిలిపివేశాం

విద్యానగర్‌లో వ్యవసాయ భూమిలో చేపట్టిన కట్టడాలను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు బద్వేలు తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మూడు శాతం ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫీజు చెల్లించిన తర్వాతనే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వినియోగించుకోవాలన్నారు. అనుమతులు లేని లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-08-03T05:01:20+05:30 IST