Kapil Dev: టెస్టులు, వన్డేలను రక్షించండి మహాప్రభో: ఐసీసీకి కపిల్ దేవ్ మొర

ABN , First Publish Date - 2022-08-17T01:35:43+05:30 IST

ఐపీఎల్, బీబీఎల్ వంటి పొట్టిఫార్మాట్‌లకు క్రేజ్ పెరుగుతూ సంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్‌పై మోజు తగ్గిపోతుండడంపై

Kapil Dev: టెస్టులు, వన్డేలను రక్షించండి మహాప్రభో: ఐసీసీకి కపిల్ దేవ్ మొర

న్యూఢిల్లీ: ఐపీఎల్, బీబీఎల్ వంటి పొట్టిఫార్మాట్‌లకు క్రేజ్ పెరుగుతూ సంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్‌పై మోజు తగ్గిపోతుండడంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapl Dev) ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను రక్షించాలంటూ ఐసీసీ (ICC)కి మొరపెట్టుకున్నాడు. టీ20, ఫ్రాంచైజీ క్రికెట్ లీగుల సంప్రదాయ క్రికెట్‌ను వెనక్కి నెట్టకుండా చూడాలని కోరాడు. యూరప్‌లో క్రికెట్ ఫుట్‌బాల్ దారిలోనే నడుస్తోందన్న కపిల్.. రోజురోజుకు ద్వైపాక్షిక క్రికెట్‌కు ప్రాధాన్యం తగ్గిపోతోందన్నాడు.


50 ఓవర్ల ఫార్మాట్ నుంచి బెన్‌స్టోక్స్ (Ben Stokes) లాంటి వాళ్లు రిటైర్ కావడానికి ద్వైపాక్షిక క్రికెట్ మరీ ముఖ్యంగా వన్డేల భవిష్యత్తే కారణమని కపిల్ పేర్కొన్నారు. తీరికలేని షెడ్యూల్ కారణంగా అతడు అన్నింటికీ న్యాయం చేయలేకపోతున్నాడని కపిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult)కూడా ఈ నెల మొదట్లో సెంట్రల్ కాంట్రాక్టులను వదులుకున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), దక్షిణాఫ్రికా (South Africa)లో వచ్చే ఏడాది కొత్త పోటీలు ప్రారంభం కానుండడంతో క్యాలెండర్ నిండిపోతోందన్నాడు.


 ఐసీసీ తదుపరి అంతర్జాతీయ క్యాలెండర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చేరగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా తమ దేశవాళీ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్స్ కోసం ప్రత్యేక స్లాట్స్ పొందే అవకాశం ఉంది. వారు ఒక్కో దేశంతో ఆడడం లేదని, నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్‌లోనే అది జరుగుతోందని కపిల్ చెప్పుకొచ్చాడు. ఇదేనా క్రికెట్ అంటే అని ప్రశ్నించాడు. నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్ ఆడడం, మిగతా రోజులు క్లబ్ క్రికెట్ ఆడడమేనా క్రికెట్ అంటే? అని కపిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్లు కూడా అలాగే తయారయ్యారని, ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, లేదంటే అలాంటిదే మరోదాంట్లో ఆడుతున్నారని అన్నాడు. 


వన్డే, టెస్టు క్రికెట్‌ బతికి బట్టకట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో మరింతగా దృష్టిసారించాలని కోరాడు. మరోవైపు ఐసీసీ మాత్రం వచ్చే సైకిల్‌లో వన్డే క్రికెట్ విషయంలో ఎలాంటి తగ్గుదల లేదని ఐసీసీ పేర్కొంది. వచ్చే 9 సంవత్సరాలకు 3.. 50 ఓవర్ల ప్రపంచకప్‌లను షెడ్యూల్ చేసింది. ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న 2023 ప్రపంచకప్‌తో ప్రారంభం అవుతుంది.  

Updated Date - 2022-08-17T01:35:43+05:30 IST