ముందస్తు అరెస్టులు బలమా, బలహీనతా?

ABN , First Publish Date - 2022-08-05T10:04:17+05:30 IST

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతంలోని నాయకులను ముఖ్యంగా వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులను...

ముందస్తు అరెస్టులు బలమా, బలహీనతా?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతంలోని నాయకులను ముఖ్యంగా వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం, ఇళ్లవద్ద నిర్బంధించడం ఒక రివాజుగా మారింది. తాజాగా జగన్‌ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఒక పెళ్ళికి రావడంతో సమీప మండలంలోని సిపిఎం పార్టీ నాయకులను పోలీసులు ముందు రోజు రాత్రి నుంచే కాపలాకాసి, స్టేషన్లో నిర్భంధించారు. కొద్ది రోజుల ముందు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శితో సహా అనేక మందిని నిర్బంధించారు. ఆ మధ్య తిరుపతి, కాకినాడ, విశాఖ నగరానికి వచ్చినప్పుడూ ఇదే తీరు. ఒక దగ్గరా, రెండు దగ్గర్లా కాదు. నేడు ప్రభువులు ఎక్కడికెళ్లినా అక్కడ ఇదే తంతుగా అయిపోయింది.


ఎక్కడైనా పెద్ద ప్రజా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు గతంలో ఇలా చేయడం కొన్ని సందర్భాలలో చూశాం. కానీ ఇప్పుడు ఏ ఉద్యమాలు లేకపోయినా ఎందుకిలా చేస్తున్నారనేది సామాన్యులకు అర్థంకాని అంశమే. పోనీ ఈ నాయకులేమైనా ప్రభుత్వాన్ని కూల్చేంత బలం ఉన్న వారా అంటే అసలే కాదు, సరికదా వీరికి అసెంబ్లీలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేరు. ఈ ఒకరిద్దరు నాయకులు నిజంగా అమాత్యులను అడ్డుకోవడానికి ప్రయత్నించినా, వారిని అదుపుచేయలేని స్థితిలో ఆంతరంగిక సిబ్బంది ఉన్నారా? మరోలా చూస్తే, తాను గొప్ప పరిపాలన అందిస్తున్నానని, పదేపదే ప్రకటిస్తున్న ప్రభువులు అదే ప్రజల వద్దకు వెళ్లడానికి వెనుకాడడం, ఆ ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న నాయకులను ఇలా నిర్బంధించడం భావ్యమేనా? అసలు ప్రభుత్వానికి ఎందుకింత భయం?


ఇటీవల ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రదర్శనలో కూడా ప్రభుత్వం ఇలాగే చేసింది. విద్యారంగ పరిరక్షణకై పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు చేసిన బస్సు యాత్ర కూడా సాగనీయకుండా ఆరంభంలోనే అనేక అడ్డంకులు సృష్టించింది. యువజన, విద్యార్థి నాయకులపై కూడా ఇదే ప్రతాపం. శ్రామిక మహిళలయిన అంగన్‌ వాడి, ఆశ, మిడ్ డే మీల్స్‌ కార్మికులపైనా ఇదే నిర్బంధం. ప్రజల మన్ననలు పొందిన ఏ ప్రభుత్వమైనా ఇటువంటి చర్యలకు పాల్పడడం అసమంజసంగానే ఉంటుంది. ఎందువల్లనంటే ప్రజారంజక పాలనను అందించిన నాయకులను ఎటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది లేకపోయినా, ఆ ప్రజలే కాపాడుకుంటారు. మరి ఇక్కడ, సీను రివర్సులో ఉండడం దేన్ని సూచిస్తున్నట్లు? తమ పాలనలో ఏదో లోపం ఉన్నట్లు తామే భావించడం కాదా? ఇటువంటి నిర్భంధాలు ఎప్పుడూ అభద్రత నుండే వస్తాయి. నేడు జగన్‌ ప్రభుత్వానికి ఉన్న ఆ అభద్రత ఏమిటి? దీనికి సమాధానాన్ని ఎవరైనా మంచి కోరి చెప్పినా వినే స్థితిలో పాలకులు ఎలాగూ లేరు. పోనీ తమ స్వంత నిఘా సిబ్బంది ఏమైనా చెబుతారా అంటే, ప్రభువులకు కోపం వస్తుందేమోనని వారికి అసలు విషయం తెలిసినా, మనకెందుకులే అని గమ్మున ఉరుకుంటారు. ఈ స్థితిని గమనించే గతంలో జనరంజక పాలన అందించాలనుకునే రాజులు మారు వేషాలలో ప్రజల వద్దకు వెళ్ళి, రాజ్యపాలన గురించి, ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునేవారట! పోనీ ఆ పనైనా నేడు జగన్‌ చేసి, తన పాలనలో ఏదైనా లోపం ఉంటే తానే స్వయంగా తెలుసుకుని, సరిచేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు, తమ పాలనంతా భేషుగ్గా ఉందని భావిస్తే, ఇలాంటి చవకబారు ముందస్తు అరెస్టులు మానుకోవడం వారికే మంచిది.


అలా కాకుండా, మా పాలన ఇలాగే ఉంటుంది, ఏం చేస్తారో చేసుకోండని ప్రభుత్వం తెగించేస్తే, అరెస్టులవుతున్న నాయకులకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే అరెస్టులు వీరికి కొత్తేమీ కాదు. కానీ ఇబ్బందంతా పాలకులకే. ఇలా నిర్బంధాలకు పాల్పడడం బలానికి కాదు, బలహీనతకే సంకేతం. 

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2022-08-05T10:04:17+05:30 IST