ప్రభుత్వ వేతనాలు సమర్థనీయమా?

ABN , First Publish Date - 2021-08-03T06:16:17+05:30 IST

దేశపౌరులకు సంక్షేమాన్ని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మన రాజ్యాంగం నిర్దేశించింది. ప్రజలకు శ్రేయస్సు సమకూర్చేందుకే ప్రభుత్వోద్యోగులను...

ప్రభుత్వ వేతనాలు సమర్థనీయమా?

దేశపౌరులకు సంక్షేమాన్ని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మన రాజ్యాంగం నిర్దేశించింది. ప్రజలకు శ్రేయస్సు సమకూర్చేందుకే ప్రభుత్వోద్యోగులను నియమిస్తున్నారు. అది వారి విధ్యుక్తధర్మం. అయితే పౌరుల బాగోగుల కంటే ప్రభుత్వోద్యోగులకు మేలు చేయడమే నేడు ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమైపోయింది!


ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వోద్యోగుల వేతన భత్యాలపై ప్రపంచబ్యాంక్ ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. వియత్నాంలో ప్రభుత్వోద్యోగుల సగటు వేతనం ఆ దేశ పౌరుల తలసరి జీడీపీలో 0.9 శాతంగా ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే వియత్నాం పౌరుల సగటుఆదాయం రూ.100 అయితే ఆ దేశ ప్రభుత్వోద్యోగుల సగటు వేతనం రూ.90. చైనాలో ప్రజల సగటుఆదాయం రూ.100 అయితే ప్రభుత్వోద్యోగుల సగటువేతనం రూ.110గా ఉంది. ఇక మనదేశంలో ప్రజల సగటు ఆదాయం కంటే ప్రభుత్వోద్యోగుల సగటువేతనం 7 రెట్లు అధికంగా ఉంది! దేశ ప్రజల సగటుఆదాయం రూ.100 అయితే ప్రభుత్వోద్యోగుల సగటు వేతనం రూ.700. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేట్లలో వియత్నాం, చైనా మనదేశం కంటే చాలా ముందంజలో ఉన్నాయంటే ఆశ్చర్యమేముంది? ప్రభుత్వోద్యోగుల సగటు వేతనాలు, పౌరుల సగటు ఆదాయానికి కొంచెం అటూఇటూగా ఉండడమే అందుకు కారణమని నేను భావిస్తున్నాను. 


ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ వినియోగం ధోరణులపై ప్రపంచబ్యాంకు నిర్వహించిన ఒక అధ్యయనంలో గత దశాబ్దంలో ప్రభుత్వ వినియోగం తగ్గుముఖంలో ఉందని వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో ప్రభుత్వ వినియోగం వాటా 2009లో 18 శాతంగా ఉంది. ఇది 2014లో 17.2 శాతానికి, 2019లో 17.1 శాతానికి తగ్గిపోయింది. మన దేశంలో జీడీపీలో ప్రభుత్వ వినియోగం వాటా 2014లో 10.4 శాతం నుంచి 2020లో 12.6 శాతానికి పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ బడ్జెట్ డాక్యుమెంట్లు విశదం చేస్తున్నాయి. ఈ పెరుగుదల ఆందోళనకరమైన పరిణామం. అంతర్జాతీయ కార్మికసంస్థ (ఐఎల్ఓ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కొవిడ్ మహమ్మారి ప్రారంభమైన తరువాత వ్యవస్థీకృత రంగంలో కార్మికుల వేతనాలు 3.6 శాతం మేరకు తగ్గిపోగా అసంఘటిత రంగంలో కార్మికుల ఆదాయాలు 22.6 శాతం మేరకు పడిపోయాయి. 


రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి మరింత తీసికట్టుగా ఉంది. కేరళ సర్కార్ తన రాబడిలో 70 శాతాన్ని, తమిళనాడు ప్రభుత్వం తన ఆదాయంలో 71 శాతాన్ని ప్రభుత్వోద్యోగుల వేతన భత్యాలకు వినియోగిస్తున్నాయి. దీనివల్ల ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వాలకు చాలా కొద్ది ధనం మాత్రమే అందుబాటులో ఉంటోంది. 


మరి ప్రజల సంక్షేమసాధనకు ఆర్థికవనరులు ఎలా సమకూర్చుకోవాలి? ప్రభుత్వోద్యోగుల వేతనాలలో భారీ కోత విధించడమే మార్గాంతరం. శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న వియత్నాం, చైనాల ఆర్థికవ్యవస్థలకు దీటుగా మన ఆర్థికవ్యవస్థను రూపొందించాలంటే మన ప్రభుత్వోద్యోగుల వేతనాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వియత్నాం, చైనాలలో వలే ప్రజల సగటు ఆదాయాలకు కొంచెం అటూఇటూగా మాత్రమే ప్రభుత్వోద్యోగుల వేతనాలు ఉండేలా తప్పక చర్యలు చేపట్టాలి. ఇందుకు ప్రభుత్వోద్యోగుల వేతనాలలో 85 శాతం తగ్గించాల్సి ఉంది. ఈ చర్య చేపట్టినప్పుడు ప్రభుత్వోద్యోగుల సగటు వేతనాలు దేశ ప్రజల సగటు ఆదాయానికి సమానస్థాయిలో ఉంటాయి. తొలుత 50 శాతం మేరకు తగ్గించేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. అలా ఆదా అయిన సొమ్మును సంక్షేమరాజ్య సూత్రాల ప్రకారం దేశపౌరులకు నగదు రూపేణా పంపిణీ చేయాలి. దీనివల్ల ప్రజల కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థికవ్యవస్థలో డిమాండ్ భారీగా పెరిగి సత్వర ఆర్థికాభివృద్ధి సుసాధ్యమవుతుంది. 


అర్థశాస్త్రంలో ‘వినియోగ ప్రవృత్తి’ (ప్రాపెన్సిటి టు కన్స్యూమ్) అనే భావన ఒకటి ఉంది. ఆదాయానికి వినియోగానికి ఉన్న సంబంధాన్ని తెలిపే భావన ఇది. ఒక ప్రభుత్వోద్యోగికి రూ.100 అదనపు ఆదాయం సమకూరితే రూ.20 విలువైన వస్తువులను అదనంగా వినియోగించుకుంటాడు. రూ.20 మాత్రమే వ్యయం చేయడమంటే అతనిలో వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంది. ఎందుకంటే అప్పటికే అతనిది ‘వడ్డించిన విస్తరి’. మురికివాడల్లో ఉండేవారి పరిస్థితి ఇది కాదు. వారికి రూ.100 అదనపు ఆదాయం లభిస్తే అందులో రూ.80 తప్పక వినియోగించుకుంటారు. ఎందుకంటే ఏ పూటకా పూట కష్టపడితేనే వారి పొయ్యిలో పిల్లి లేస్తుంది. రూ.100 అదనపు ఆదాయంలో రూ.80 వినియోగం చాలా అధికం. ప్రభుత్వోద్యోగుల వేతనాన్ని రూ.100 తగ్గిస్తే రూ.20 విలువైన డిమాండ్ తగ్గుదలకు దారితీస్తుంది. మురికివాడ వాసుల ఆదాయాన్ని రూ.100 మేరకు పెంచినప్పుడు డిమాండ్‌లో రూ.80 విలువైన పెరుగుదల ఉంటుంది. ప్రభుత్వోద్యోగి నుంచి ఒక పౌరుడికి రూ.100 బదిలీ చేస్తే డిమాండ్ రూ.60 విలువైన నికర పెరుగుదల సంభవిస్తుంది. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండానే డిమాండ్‌లో పెరుగుదల సంభవిస్తుంది.


మార్కెట్‌లో డిమాండ్ పెరిగినప్పుడు ఆర్థికవ్యవస్థ పటిష్ఠమవుతుంది. కనుకనే ప్రస్తుత మహమ్మారి విరుచుకుపడిన తరువాత చాలాదేశాలు తమ ప్రభుత్వోద్యోగుల వేతన భత్యాలలో భారీ కోత విధించాయి. ఇందుకొక ఉదాహరణ పరాగ్వే. ఈ లాటిన్‌అమెరికా దేశం తన ప్రభుత్వోద్యోగుల వేతనాలను 20 శాతం తగ్గించినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వెల్లడించింది. మనదేశంలో కూడా ప్రభుత్వోద్యోగుల వేతనాలను 85 శాతం తగ్గించి తీరాలి. అలా ఆదా అయిన సొమ్మును దేశపౌరులకు పునఃపంపిణీ చేయాలి. ఈ చర్యతో పౌరులకు సంక్షేమం సమకూరడంతో పాటు ఆ దేశ ఆర్థికవ్యవస్థ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-08-03T06:16:17+05:30 IST