సర్వాధికారాలూ కేంద్రానివేనా?

Mar 17 2021 @ 01:24AM

దేశాధినేతగా దేశ రాజధాని నుంచి మొత్తం భారత దేశాన్ని శాసించాలనుకుంటున్న నరేంద్రమోదీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేకపోవడం మింగుడుపడడం లేదు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని వ్యూహరచనలు చేసినా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బిజెపి గద్దె దించలేకపోతోంది. మోదీ సర్కార్ అనుసరించిన హిందూత్వ విధానాలు ఢిల్లీ ప్రజలను ఏ మాత్రం ఆకర్షించలేదు. సిఏఏ, త్రిపుల్ తలాఖ్ చట్టం, అయోధ్యలో రామమందిరం, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు లాంటి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఢిల్లీ ప్రజలు స్పందించలేదు, యూనివర్సిటీల్లో దాడులు, ఢిల్లీ అల్లర్లకు కూడా ప్రజలు చలించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు, ఉచిత ఆరోగ్య సేవలు, తక్కువ ధరకు విద్యుత్, మహిళలకు ఉచితంగా బస్‌లో ప్రయాణించే అవకాశం వంటి ప్రజా హిత నిర్ణయాలు కేజ్రీవాల్ పట్ల జనాదరణను పెంచాయని అనేక సర్వేలు తెలిపాయి. ఇటీవల జరిగిన మునిసిపల్ ఉప ఎన్నికల్లో బిజెపి ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం కేజ్రీవాల్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానానికి తార్కాణం. 


2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఢిల్లీ పై కన్ను వేసిన మోదీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేజ్రీవాల్ సర్కార్‌ను నానా ఇబ్బందులు పెట్టింది. ప్రజలకు నాయకులపై విశ్వాసం పెంచే జన లోక్‌పాల్ బిల్లును లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) తిప్పికొట్టారు. కేజ్రీవాల్‌ను సంప్రదించకుండా ఏక పక్షంగా ఛీప్ సెక్రటరీని నియమించారు. కాలనీల్లో వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేయదలిచిన మొహల్లా క్లినిక్‌ల ఫైల్‌ను క్లియర్ చేయకుండా తొక్కి పెట్టారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో అవకతవకల్ని విచారించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన విచారణను అడ్డుకున్నారు. తాత్కాలికంగా నియమించిన గెస్ట్ అధ్యాపకుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించే బిల్లును కూడా లెఫ్టినెంట్ గవర్నర్ నిలిపి వేశారు. ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శి, పిడబ్ల్యుడి కార్యదర్శిపై ఎల్‌జీ వేటు వేశారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న 400 నిర్ణయాలపై ఆయన విచారణ ప్రారంభించారు. చికెన్ గున్యా వ్యాపించడంతో ఫిన్ లాండ్‌లో ఉన్న డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాను ఢిల్లీ రమ్మన్నారు. ఇది చాలదన్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) పై కూడా తన పట్టు బిగించారు. ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ ఎంకె మీనాను ఏసీబీ చీఫ్‌గా తానే నియమించారు. ఆ తర్వాత ఏసీబీ ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ ప్రారంభించింది, యాప్ ఆధారిత ప్రీమీయం బస్ సర్వీస్‌ల విషయంలో అక్రమాలు జరిగాయంటూ విచారణ సాగించింది, నీటి టాంకర్ కుంభకోణం జరిగిందని కేజ్రీవాల్ పైనే విచారణ మొదలుపెట్టింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ హైకోర్టులో సవాల్ చేస్తే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ మాటే చెల్లుబాటవుతుందని హైకోర్టు చెప్పింది, హైకోర్టు తీర్పుపై ఆమ్ అద్మీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ఎట్టకేలకు 2018 జులై 4న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేజ్రీవాల్ ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించింది. శాసన సభ అధికారాల ప్రకారం తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎన్నికైన ప్రభుత్వ సలహా మేరకే ఎల్‌జీ నడుచుకోవాలని చెప్పింది, పైళ్లను లెఫ్టినెంట్ గవర్నర్ దీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టకూడదని సుప్రీం ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను ఎల్‌జీకి చెప్పాలి కాని ఆయన ఆమోదం అవసరం లేదని స్పష్టం చేసింది. ఎల్‌జీకి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య సమతుల్యతను ఏర్పర్చింది. ఈ తీర్పు తర్వాత దాదాపు రెండేళ్లు ఢిల్లీలో ప్రశాంతత ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు నేషనల్ కేపిటల్ టెర్రిటరీ (ఎన్‌సిటి) చట్ట సవరణ బిల్లు పేరుతో మోదీ సర్కార్ తన ఆయుధాన్ని పైకి తీసింది.ఈ బిల్లు చట్టం అయితే లెఫ్టినెంట్ గవర్నర్‌కు అనేక అధికారాలు లభిస్తాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇకనుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంప్రదించే తీసుకోవాలి, శాసన సభలో ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా అందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కావాలి. పరిపాలనా నిర్ణయాలపై సమీక్షించే అధికారం అసెంబ్లీకి కానీ, శాసన సభా కమిటీలకుకానీ ఉండదు. ఈ బిల్లు సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమని, ప్రజలు తిరస్కరించడంతో ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను కత్తిరించేందుకే ప్రవేశపెట్టారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలపై ఏమైనా భేదాభిప్రాయాలుంటే రాజ్యాంగంలోని 231- ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి ఎల్‌జీ నివేదించాలని, రాష్ట్రపతి అభిప్రాయం ప్రకారమే నడుచుకోవాలని సుప్రీం తెలిపింది. తాజా చట్టంలో కేంద్రం సెక్షన్ 44కు కొత్త నిబంధన చేర్చి ఏ నిర్ణయం తీసుకున్నా ఎల్‌జీ అభిప్రాయం కోరడం తప్పనిసరిగా మార్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టి నెంట్ గవర్నర్ అని ఈ బిల్లు నిర్థారించింది, మరి ఎన్నికైన ప్రభుత్వం ఏం చేయాలి? ఎన్నికైన ముఖ్యమంత్రిని అర్ధరహితంగా మార్చడమే ఈ బిల్లు ఉద్దేశమని, దేశంలో సమాఖ్య నిర్మాణానికి ఇది ప్రమాదకరమని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు.


ఢిల్లీలో పక్కలో బల్లెంగా మారడమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపికి ఒక బలమైన సైద్ధాంతిక ప్రత్యర్థిగా మారుతోంది, ఢిల్లీ సరిహద్దుల్లో గత వందరోజులకు పైగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న రైతులకు ఈ పార్టీ బలమైన మద్దతును అందించింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తోంది, ఇటీవల గుజరాత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆశ్చర్యకరమైన రీతిలో మంచి ఫలితాలు సాధించింది. సూరత్ మునిసిపల్ కార్పోరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 120 సీట్లలో బిజెపి 93 గెలుచుకోగా, ఆప్ 27 సీట్లను గెలుచుకుంది, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు, కేజ్రీవాల్ సూరత్ వెళ్లి తమ కార్పొరేటర్ల తో సమావేశం ఏర్పాటు చేశారు, బహుశా ఈ పరిణామం కూడా మోదీకి ఆగ్రహం కలిగించి ఉండాలి.


ఢిల్లీ, పుదుచ్చేరితో సహా తమ పార్టీ అధికారంలో లేని అనేక రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రత్యర్థులపై మోదీ సర్కార్ అనేక ఆయుధాలను, సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నదనడంలో సందేహం లేదు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపైనే కాదు, తమ విధానాలపై నిరసన తెలిపే ఏ ఒక్కరినీ సహించలేని పరిస్థితికి మోదీ సర్కార్ చేరుకుంది. ఎన్‌ఐఏ, సిబిఐ, ఈడీ, ఆదాయపన్ను విభాగాలు మోదీ సర్కార్‌కు అనుకూలంగా మారాయని ఆరోపణలు ఉన్నాయి. మోదీ హయాంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు రూపొందించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపిఏ) క్రింద అరెస్టులు 72 శాతం పెరిగాయని పార్లమెంట్‌లో హోంమంత్రిత్వ శాఖే అంగీకరించింది. గుజరాత్‌లోని సూరత్‌లో 2001 డిసెంబర్‌లో ఒక సమావేశంలో పాల్గొన్నారనే పేరుతో ఈ చట్టం క్రింద 122 మందిని అరెస్టు చేశారు. వారిపై పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు సమర్పించలేకపోవడంతో సూరత్ సిటీ కోర్టు ఇటీవలే వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ 19 సంవత్సరాల్లో అయిదుగురు విచారణ దశలోనే మరణించారు, అనేక మంది జైలు పాలయ్యారు. వారి జీవితాలు దాదాపు వృధాగా మారాయి. కొన్ని క్రూరమైన చట్టాలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఈ ఉదంతం స్పష్టం చేయడం లేదా?


ఉద్యమాలను, నిరసన తెలిపే వారిని, రాజకీయ ప్రత్యర్థులను ఆఖరుకు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలనూ కూడా సహించలేని పరిస్థితికి మోదీ ప్రభుత్వం చేరుకున్నది. బహుశా అందుకే భారత దేశంలో ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం క్షీణించిపోతున్నాయని విదేశీ సంస్థలు విమర్శిస్తున్నాయి. భారత దేశాన్ని నియంతృత్వపాలన దిశగా మోదీ సర్కార్ తీసుకువెళుతోందని అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ ఫ్రీడమ్ హౌజ్ ప్రకటించింది. పాక్షిక స్వేచ్ఛ లభించే దేశాల్లో భారత్‌ను చేర్చింది, స్వీడన్‌కు చెందిన వీడెమ్ సంస్థ కూడా భారత దేశంలో క్రమంగా ప్రజాస్వామిక స్వేచ్ఛ హరించుకుపోతోందని విమర్శించింది. భారత దేశాన్ని విదేశీ సంస్థలు విమర్శించడమేమిటి? ఇది మన సార్వభౌమత్వానికి సవాలు అని కొందరు దేశ భక్తులు విమర్శించవచ్చు. కానీ నరేంద్రమోదీ 108 సార్లు విదేశీ పర్యటనలు చేసినప్పుడు, అనేక విదేశీ సంస్థలు భారత్ కు మంచి రేటింగ్స్ ప్రకటించినప్పుడు ఆనందాతిరేకాన్ని ప్రదర్శించిన దేశ భక్తులు ఈ పరిణామాన్ని కూడా అర్థం చేసుకోవడం మంచిది.

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.