ప్రతిపక్ష నేతలు మాత్రమే స్థానికేతరులా...?

ABN , First Publish Date - 2021-11-11T07:30:31+05:30 IST

వారాల తరబడి తిష్టవేసి మరీ ప్రచారాలు చేసిన వైసీపీ నేతలకు వర్తించని నిబంధన టీడీపీ వారి నెత్తినే ఎందుకు వేలాడదీశారనే ప్రశ్న ఎదురవుతోంది.

ప్రతిపక్ష నేతలు మాత్రమే స్థానికేతరులా...?
రామానాయుడు, నానీ అరెస్టు

కుప్పంలో పోలీసు వివక్షపై విస్తుపోతున్న జనం


మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారనే కారణంతో స్థానికేతరులను కుప్పం వదలి వెళ్లిపోవాలంటూ పోలీసులు జారీ చేసిన హుకుం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రచార గడువు ముగిసేదాకా ఎవరైనా కుప్పంలో ఉండవచ్చు. బద్వేలులో, తిరుపతిలో వారాల తరబడి తిష్టవేసి మరీ ప్రచారాలు చేసిన వైసీపీ నేతలకు వర్తించని నిబంధన టీడీపీ వారి నెత్తినే ఎందుకు వేలాడదీశారనే ప్రశ్న ఎదురవుతోంది. టీడీపీ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకుని నెట్టుకుంటూ వాహనాల్లో ఎక్కించి కుప్పం దాటించిన పోలీసులు, వైసీపీ నేతలను మాత్రం కుప్పంలో విచ్చలవిడిగా తిరగడానికి రాచబాట పరుస్తున్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు.  

- కుప్పం


మంగళవారం రాత్రి డ్రామా

మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని భోజనం చేస్తున్న  బీసీఎన్‌ రిసార్ట్స్‌ను రాత్రి 11 గంటలకు పోలీసులు ముట్టడించారు. ఇద్దరు నేతలనూ నెట్టుకుంటూ బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచీ తరలించి అమర్‌ను పలమనేరులో, నానీని చిత్తూరులో ఇళ్ల వద్ద వదిలి పెట్టారు. అంతకు ముందే కుప్పంలోనే వేరేచోట ఉన్న ఎమ్మెల్సీ దొరబాబును కూడా అరెస్టు చేసి చిత్తూరుకు తరలించారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎమ్మెల్యే రామానాయుడును కూడా బలవంతంగా అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. 


కుప్పం మున్సిపల్‌ కమిషర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19 మందిపై కేసు నమోదు చేశాం. వీరిలో చాలావరకు స్థానికేతరులు ఉన్నారు. వేరే జిల్లాలవాళ్లు వెంటనే కుప్పం వదిలి వెళ్లిపోవాలి. 

- డీఎస్పీ గంగయ్య మంగళవారం చేసిన హెచ్చరిక ప్రకటన


బుధవారం ఏం జరిగింది?


వైసీపీ నేతలు ప్రచారంలో..

కుప్పంలోనే కొద్ది రోజులుగా బస చేసిన మంత్రి పెద్దిరెడ్డి - కమతమూరు, సీగలపల్లె, కత్తిమానుపల్లె తదితర ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రాత్రి ఒక పెళ్లికి కూడా హాజరయ్యారు. ఫ పట్టణ పరిధిలోని వార్డుల్లో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి,  పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ప్రచారంచేశారు.  ఫ ఎంపీ మిథున్‌రెడ్డి స్థానికంగా ఉన్న ఒక అధికార పార్టీ నేత ఇంట్లో బస చేసి మంతనాలు సాగించారు.


టీడీపీ నేతలు నిర్బంధంలో

పోలీసుల కన్నుగప్పి పలమనేరు నుంచి తెల్లవారకముందే బయలుదేరి కుప్పం వచ్చిన మాజీ మంత్రి అమరనాథరెడ్డి పార్టీ ఆఫీసులో మీడి యాతో మాట్లాడారు. తర్వాత వెళ్లిపోయారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని పోలీసు నిర్బంధంలో చిత్తూరులో ఇంట్లోనే ఉన్నారు. 

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా నాని ఇంట్లోనే ఉన్నారు.

ఎమ్మెల్సీ దొరబాబును సైతం చిత్తూరులోని ఆయన ఇంట్లోనే పోలీసులు నిర్బంధంలో ఉంచారు. 









Updated Date - 2021-11-11T07:30:31+05:30 IST