ముస్లింలకిచ్చిన హామీలేమయ్యాయి?

ABN , First Publish Date - 2021-06-18T05:57:15+05:30 IST

మీకు తెలియదని కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మంది యువకులలో ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు ఎందరో ఉన్నారు....

ముస్లింలకిచ్చిన హామీలేమయ్యాయి?

జనాబ్ సీఏం కేసీఆర్ సాబ్!

మీకు తెలియదని కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మంది యువకులలో ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు ఎందరో ఉన్నారు. ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమానికి ఆర్థిక సహాయం చేసిన ముస్లింలు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని కేసులు, జైళ్ల పాలు అయిన వారు ఎందరో ఉన్నారు. ఉద్యమంలో ముస్లింల పాత్రను గుర్తించిన మీరు నాడు అనేక హామీలు ఇచ్చారు. కానీ రాష్ట్రం ఏర్పడి నేటికి ఏడు సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఆ హామీలు నెరవేరనే లేదు.


ముస్లింల అభివృద్ధి కోసం వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరమైన అంశాల వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి మీ ప్రభుత్వం 2015 మార్చి 3వ తేదీన సుధీర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుదీర్ఘ అధ్యయనం తర్వాత 2016 ఆగస్టు 12న ఈ కమిషన్ మీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 85శాతం ముస్లింలు దారిద్య్రరేఖకు దిగువన ఉండి, విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఈ నివేదిక తెలిపింది. సుధీర్ కమిషన్ రిపోర్టు అంది ఐదేళ్లు పూర్తి కావస్తున్నా అందులోని సూచనలను మీ ప్రభుత్వం అమలుచేయనే లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నాలుగు నెలలలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి జిల్లాకి ఒక ముస్లిం మైనార్టీకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు. నామినేటేడ్ పదవులలో కూడ సరైన ప్రాతినిధ్యం ముస్లింలకు దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్ కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. అసంఘటిత కార్మిక రంగంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆదరువు ఏర్పాటు చేయవలసి ఉంది. ఏడాదిగా మైనార్టీ కమిషన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ తదితర సంస్థల పాలకమండళ్లకు పూర్తిస్థాయి కమిటీలు లేవు. ఇటీవల టీఏస్పీఎస్సీకి నియమించిన ఎనిమిది మంది సభ్యులలో, పది యూనివర్శిటీలకు నియమించిన వైస్ ఛాన్సలర్లలో ఒక్కరంటే ఒక్కరు మైనారిటీ వారు లేరు. తెలంగాణలోని ముస్లిం ఆలోచనాపరులం ఈ లేఖ ద్వారా పై విషయాలన్నీ మీ దృష్టికి తీసుకువస్తూ తెలంగాణలోని అతిపెద్ద సమూహమైన ముస్లింలను అన్ని రంగాలలో ఆదుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 


సలీంపాష, జహీరుద్దీన్ అలీఖాన్, ప్రొ.అన్సారీ, సనాఉల్లా ఖాన్, యూనస్ పర్వేజ్, జియావుద్దీన్, మహమ్మద్ ఫయాజ్, స్కైబాబ, ఎమ్.ఎ. రవూఫ్ ఖాన్, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ వహీద్, ఖాలిదా పర్వీన్, సిరిసిల్లా గఫుర్ శిక్షక్, ఎంఏ రహమాన్ ఖాన్, అక్బర్, షాజహానా, ఖాజా, అన్వర్, డా.మహమ్మద్ రఫీ; రహీమ్ ఖాన్, మహమ్మద్ నజీరుద్దీన్, నస్రీన్ ఖాన్ తదితరులు

Updated Date - 2021-06-18T05:57:15+05:30 IST