ఈ చిరునవ్వులు విరబూసేనా?

ABN , First Publish Date - 2022-06-29T08:45:38+05:30 IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎట్టకేలకు పరస్పరం పలకరించుకున్నారు.

ఈ చిరునవ్వులు విరబూసేనా?

  • గవర్నర్‌ తమిళిసై, కేసీఆర్‌ మధ్య సఖ్యత కుదిరేనా?
  • సీజే ప్రమాణ స్వీకారోత్సవంలో పలకరింపులు
  • 9 నెలల తర్వాత రాజ్‌భవన్‌లో అడుగు పెట్టిన కేసీఆర్‌


హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎట్టకేలకు పరస్పరం పలకరించుకున్నారు. పుష్పగుచ్ఛాలు అదించుకుని గౌరవించుకున్నారు.. చిరునవ్వులు చిందించారు. ఇరువురి మధ్య విభేదాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత.. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. దీంతో ఈ చిరునవ్వులు మున్ముందు విరబూసేనా? భేషజాలు తొలగిపోయేనా? ప్రజా సంక్షేమం కోసం కలిసి ముందుకు సాగేనా? అని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీని గురించి ఇప్పుడే చెప్పలేకపోయినా.. కొంతలో కొంతైనా ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఇరువురి మధ్య వివాదానికి తొమ్మిది నెలల క్రితమే బీజం పడింది. 


కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడం దగ్గర్నుంచి.. ఇటీవల రాజ్‌భవన్‌ తమిళిసై నిర్వహించిన మహిళా దర్బార్‌ దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గవర్నర్‌ పర్యటనలకు అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోవడం, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ లేకుండా ప్రారంభించడం, దీనిపై గవర్నర్‌ వ్యాఖ్యలు, అందుకు ప్రతిగా మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల స్పందనలు, రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్‌ గైర్హాజరు కావడం, జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై గవర్నర్‌ నివేదిక కోరినా ఇవ్వకపోవడం వంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో గవర్నర్‌కు, సీఎంకు మధ్య దూరం అంతకంతకూ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం కూడా ఇరువురు మొదట ముభావంగానే కనిపించారు. ఆ తర్వాత తేనీటి విందులో పరస్పరం నవ్వుతూ పలకరించుకున్నారు. దీంతో ఇవే నవ్వులు మున్ముందు విరబూస్తాయా లేక మళ్లీ ఎడమొహం పెడమొహాలేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-06-29T08:45:38+05:30 IST