మధ్యయుగాలలోకి తిరోగమిస్తున్నామా?

Published: Wed, 08 Jun 2022 01:48:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మధ్యయుగాలలోకి తిరోగమిస్తున్నామా?

ఏదేశ ప్రజలైనా తమ చరిత్ర, ఐక్యత, సాంస్కృతిక వారసత్వం గురించి తలుచుకుని ఉప్పొంగిపోతే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ ఉండదు. భారతీయ జనతా పార్టీ నేతలు కానీ, ఇంకెవరైనా కానీ మన గత ఘన వైభవం గురించి చెప్పుకోవడం, వాటిని తామే కాపాడతామని నిజాయితీగా జనం ముందుకు వెళ్లడం కూడా ప్రశ్నించదగిన విషయమూ కాదు. కాని ఇతరుల మతాలను, ప్రవక్తలను అవమానపరచడం ద్వారా మన ఔన్నత్యం ఏ మాత్రమూ పెరిగే అవకాశం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు అధికార ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం ఒక మతంపై చేసిన విద్వేష వ్యాఖ్యలు మనను తీవ్రంగా విమర్శించేందుకు కనీసం 15 దేశాలను పురిగొల్పాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయనకు ముందు పలువురు ప్రధానమంత్రులు ఆ దేశాలతో నిర్మించుకున్న సత్సంబంధాలు కొన్ని విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందనడంలో సందేహం లేదు. నిజానికి ఇది అంతర్జాతీయ పర్యవసానాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. మన దేశ ఔన్నత్యం గురించి సరిగా చెప్పుకోలేని భావ దారిద్ర్యానికి, దృక్పథ రాహిత్యానికీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు మించి ఆలోచించలేని సంకుచిత మనస్తత్వానికీ నిదర్శనం.


బ్రిటిష్ వారు ఈ దేశంలో జరిపిన దారుణాలు, హత్యాకాండ, అణచివేతలు అంతా ఇంతా కాదు. అదేసమయంలో భారతీయ చారిత్రక, సాంస్కృతిక సంపద గురించి తెలియజేసింది కూడా వారేనని మనం గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశాన్ని ప్రపంచంలో కోట్లాది అతి గొప్ప పురావస్తు చిహ్నాల, కళాఖండాల సముదాయంగా ఒకప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ అభివర్ణించారు. భారతదేశం గురించి తెలుసుకోవాలంటే భారతీయులుగా వ్యవహరించాలని, ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, భాషలను తెలుసుకోవాలని తొలి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ భావించారు, బ్రిటిష్ వారు బెంగాల్‌లో ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే తొలి బెంగాలీ వ్యాకరణాన్ని ప్రచురించారు. సంస్కృతంలో బ్రిటిష్ వారు చేసిన తొలి ప్రచురణ మన భగవద్గీత అని ఎంతమందికి తెలుసు? భగవద్గీత ప్రపంచంలోనే మూల గ్రంథాల్లో ఒకటని, ఒక మహత్తరమైన, హేతుబద్ధమైన శైలిలో రచించిన ఈ గ్రంథానికి సాటిలేదని చెప్పిన విలియం హేస్టింగ్స్ భగవద్గీత ప్రచురణకు నిధులు కేటాయించాల్సిందిగా ఈస్టిండియా కంపెనీకి లేఖ రాశారు. బ్రిటిష్ కాలంలో ఎన్నో చారిత్రక స్థలాల పునరుద్ధరణ జరిగింది. పురాతన తాళప్రతులను వెలికి తీశారు. వేలాది నాణాలు, చిత్రాలను త్రవ్వి తీశారు. మన భిన్న సంస్కృతులను చాటి చెప్పే ఖజురహో, అజంతా, ఎల్లోరా గుహల ఔన్నత్యానికి అంతా ముగ్ధులయ్యేలా చేశారు. మహ్మదీయుల దురాక్రమణలకు ముందు భారతదేశం ఎలా ఉండేదో వెల్లడించారు. రాజులు, చక్రవర్తుల చరిత్రను తేదీల వారీగా నమోదు చేసే ప్రయత్నం చేశారు. తెగ, జాతి, భాష, మత పరమైన సంస్కృతులను కనిపెట్టారు. మొత్తం ఉపఖండాన్ని సర్వే చేసి మ్యాపింగ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశ ఆధునిక దృశ్యాన్ని వారు ప్రపంచానికి తెలియజేశారు. సర్ విలియమ్ జోన్స్, జేమ్స్ ప్రిన్సెప్, సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హామ్, జేమ్స్ ఫెర్గుస్సన్, మెకంజీతో పాటు అనేకమంది వందలాది శతాబ్దాల నుంచి భారతదేశ చరిత్రను మనకు తెలియజేసిన తీరు అపూర్వం, అసాధారణం. వారి యాత్రా చరిత్రలు, జ్ఞాపకాలు, రాజకీయ వ్యాఖ్యానాలు, అధికార పత్రాలు వేలాది పుటల్లో నిక్షిప్తం చేశారు. కేవలం పురాతత్వ చరిత్రే 200కు పైగా పుటల్లో ఉంటుంది. ‘నేను కృష్ణుడి ఆకర్షణకు లోనయ్యాను, రాముడికి ఉప్పొంగే అభిమానినయ్యాను. సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాను. గ్రీకువీరులు అగమెమ్నాన్, అఖిల్లీస్, ఏజాక్స్ కంటే యుధిష్టిరుడు, అర్జునుడు, భీముడు తదితర యోధులు ఎంతో గొప్పవారని నాకు అనిపించింది’ అని విలియం హేస్టింగ్స్ రాసుకున్నారు.


1783 సెప్టెంబర్ 1న ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కలకత్తాలో అడుగు పెట్టిన 37 ఏళ్ల విలియమ్ జోన్స్ ఆసియాటిక్ సొసైటీని స్థాపించి భారతీయ చరిత్రను పునర్మిర్మించే ప్రయత్నం చేశారు. సంస్కృత చట్టాల్ని, మనుస్మృతిని అధ్యయనం చేశారు. హిందూ న్యాయశాస్త్రంపై ఏడుసంపుటాలు ప్రచురించారు. ప్రాచీన నగరాల్ని సందర్శించారు. హిందూమతంలో శృంగార కళ స్థానాన్ని ఆయన గుర్తించారు. రామలోచంద్ అనే పండితుడి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. ‘సంస్కృతం గ్రీకు కంటే పరిపుష్టమైనది. లాటిన్ కంటే విస్తృతమైనది. క్రియలు, వ్యాకరణ రూపాల విషయంలో సంస్కృతం, గ్రీకు, లాటిన్ మూలాలు ఒకటైనప్పటికీ, సంస్కృతం వాటికంటే పరిశుద్ధమైనది. బహుశా ఇండో యూరోపియన్ భాషలకు ఎక్కడో కోల్పోయిన మూలాలుండి ఉంటాయనిపిస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. భారత నాగరికత యూరోపియన్ నాగరికత కంటే ప్రాచీనం కావచ్చునని ఆయన అంగీకరించారు. ‘భారతదేశంలో ప్రవేశించిన తర్వాత కొత్త జ్ఞానాన్ని సముపార్జించని రోజును జీవితం నుంచి కోల్పోయినట్లేనని భావిస్తాను’ అని ఆయన రాశారు. ఆయన ఉదయాన్నే సూర్యుడికంటే ముందుగా లేచి ఏడు గంటలకు ముందే సంస్కృతం నేర్చుకోవడానికి సిద్ధపడేవారు. ఆ తర్వాత అరబ్ భాషను నేర్చుకుని ఉదయం 9 గంటలకల్లా కోర్టుకు వెళ్లేవారు. ‘సంస్కృతం నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అందులో కొన్ని లక్షల శ్లోకాలు, కావ్యాల్లో చరిత్ర దాగి ఉన్నది. వ్యంగ్య, విషాదాంత సాహిత్యం ఉన్నది. చట్టం, న్యాయం, వైద్యం, గణితం, ధర్మ నీతి శాస్త్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయి’ అని ఆయన రాసుకున్నారు. చదరంగం, అల్జీబ్రా భారతదేశం నుంచే వచ్చాయని గ్రహించారు. సంగీతంపై సంస్కృత ప్రతుల్ని అధ్యయనం చేశారు. కాళిదాసు శాకుంతలాన్ని ఆయన అనువదించారు. హిందూయిజంపై 31 వ్యాసాలు రాశారు. భారతీయ సమాజానికి అద్వితీయమైన సేవ చేసిన విలియమ్ జోన్స్ అనారోగ్యంతో కేవలం 47 ఏళ్లకే మరణించారు. ఆయన స్థాపించిన ఆసియాటిక్ సొసైటీ కోల్‌కతాలో ఇంకా ఉన్నది.


జోన్స్ చేసిన పనిని జేమ్స్ ప్రిన్సెప్ ముందుకు తీసుకువెళ్లారు. నాణేల నిపుణుడుగా భారత్‌లో ప్రవేశించిన ఆయన శిలాశాసనాలు, ఢిల్లీ, అలహాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన స్తూపాలపై రచించిన ప్రాచీన ఇండో–ఇరానియన్‌ ఖరోస్తి లిపి, గుప్తులు, మౌర్యుల కాలం నాటి బ్రాహ్మీ లిపి అంతరార్థాన్ని ప్రపంచానికి తెలియజేశారు. గుజరాత్‌లోని గిర్నార్ పర్వత ప్రాంతాల్లో రాళ్లపై రచించిన లిపిని బ్రిటిష్ సైనికాధికారి జేమ్స్ టాడ్ కనిపెడితే, దాని అర్థాన్ని ప్రిన్సెప్ విశదీకరించారు. ఒడిషాలోని ధౌళిలో రాళ్లపై నిక్షిప్తమైన బ్రాహ్మీ లిపి ద్వారా అశోకుడి చరిత్రను ప్రపంచానికి వెల్లడించారు. సాంచీలో లభించిన లిపిని కూడా పరిష్కరించింది ఆయనే. ప్రిన్సెప్ కేవలం 40 సంవత్సరాల వయసులో మరణిస్తే, ఆయన కృషిని కొనసాగించిన బ్రిటిష్ సైనికాధికారి అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ సారనాథ్‌ను వెలికి తీసి భారతదేశంలో బౌద్ధ చరిత్ర గురించి తెలిపారు. కశ్మీర్‌లో ఆలయ శిల్పకళ గురించి అధ్యయనం చేశారు. తక్షశిల, నలంద, శ్రావస్తి, వైశాలి, కోశాంబి వంటి అనేక చారిత్రక స్థలాలను ఆయన గుర్తించారు. ఆ తర్వాతే గాంధార కళ గురించి ప్రపంచానికి తెలిసింది. ఆయన భారత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ తొలి డైరెక్టర్ కూడా. ప్రాచీన భారత భౌగోళిక శాస్త్రాన్ని ఆయన రచించారు. వాస్తు శాస్త్రవేత్త జాన్ మార్షల్ నేతృత్వంలో సింధూలోయనాగరికతను చాటిచెప్పే మొహెంజోదారో, హరప్పాలను త్రవ్వి తీశారు. ‘భారత్‌లో మా కవులు గానం చేస్తే, మా చిత్రకారులు చిత్రాలు గీస్తే, మా కథానాయకులు జీవిస్తే, యూరప్‌లో ప్రతి మనిషి పెదాలపై శాశ్వతంగా నిలిచేవి’ అని రాజపుత్రుల గురించి బ్రిటిష్ చరిత్రకారుడు ఇ.బి హావెల్ రాశారు. కల్నల్ మెకంజీ సేకరించిన తాళపత్రాలు, లిపులు, నాణాలే ఇప్పటికీ భారత చరిత్ర పునర్నిర్మాణానికి దోహదం చేస్తున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి స్థూపంతో పాటు అనేక చారిత్రక అవశేషాల గురించి ఆయన ప్రపంచానికి తెలిపారు. భారతదేశంలోని వివిధ జాతులపై అయిదు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన హాడ్జ్‌సన్ తన జీవితంలో అత్యధిక కాలం హిమాలయాల్లో యోగిలా జీవించారు. ప్రాంతీయ భాషల్ని గౌరవించాలని చెప్పిన ఆయన మెకాలే విద్యావిధానాన్ని వ్యతిరేకించారు.


ఇలా బ్రిటిష్ వారు భారతీయ సాంస్కృతిక చారిత్రక వారసత్వం గురించి చేసిన అన్వేషణ, పరిశోధన, తెలియజేసిన వాస్తవాల గురించి చెబితే ఉద్గ్రంథమే అవుతుంది. భారతీయ సాంస్కృతిక ఔన్నత్యం గురించి చెప్పడానికి మనకు అపారమైన చరిత్ర ఉన్నది. కళలు, ఆయుర్వేదం, గణితం, సంగీతం, నృత్యం, శిల్పకళ, వాస్తు శాస్త్రం, చదరంగం ఎన్నో ఏళ్ల నుంచి విలసిల్లిన నాగరికత ఇది. జ్ఞానాన్వేషణకు, ప్రశ్నకూ, హేతువాదానికీ నిలయం ఇది. భారతీయ జనతా పార్టీ కానీ, వారి ప్రతినిధులు కానీ, వారి భావజాలం ఉన్నవారు కానీ వీటన్నిటి గురించి ఏనాడూ చెప్పిన పాపాన పోలేదు. నాడు ఒక విలియమ్ జోన్స్, ఒక ప్రిన్సెప్, ఒక మెకంజీ తదితరులు బ్రిటిష్ వారైనప్పటికీ ముక్కలు ముక్కలుగా మారిన భారతీయ ఆత్మలోని ఐక్యతను కనిపెట్టే ప్రయత్నం చేస్తే, ఇవాళ మన నేతలు భారతీయ ఆత్మను ముక్కలు ముక్కలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ప్రతి మసీదులో లింగాన్ని వెతికే పనిచేస్తూ వివాదాలు రేకెత్తించనవసరం లేదు’ అని సాక్షాత్తూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ సైతం అన్నారంటే బిజెపి స్వయంగా నిందించిన ఉన్మాదశక్తుల ప్రాబల్యం ఎంత పెరుగుతున్నదో అర్థమవుతోంది. అధికారప్రతినిధుల విషయమే ఇలా ఉంటే, బ్రిటిష్ వారు ప్రవేశించకముందు భారత్‌లో నెలకొన్న మధ్య యుగాల మూఢాంధకార ప్రపంచంలో మళ్లీ మనం ప్రవేశిస్తున్నామా అన్న ఆలోచన కలిగేంతగా ఎన్నో అనధికార శక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఒక కర్ణాటకలోనో, ఒక తెలంగాణలోనో లేదా మరో రాష్ట్రంలోనో విజయం సాధించడమనే తాత్కాలిక లక్ష్యాలకోసమే ఈ శక్తులకు ప్రేరణ కలిగిస్తే అంతకంటే విషాదం ఇంకొకటి లేదు.

మధ్యయుగాలలోకి తిరోగమిస్తున్నామా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.