లాక్‌డౌన్‌లో వర్క్ ఫ్రం హోం కోసం.. కొత్తగా ల్యాప్‌టాప్‌ కొన్నారా..?

ABN , First Publish Date - 2020-07-06T18:14:38+05:30 IST

ఆన్‌లైన్‌ క్లాస్‌లు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలు పెరగడంతో మార్కెట్‌లో ల్యాప్‌టా్‌పలు, ట్యాబ్‌లకు డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌లో స్టాక్‌ ఖాళీ కావడంతో నవీకరించిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లనూ చాలామంది కొనుగోలు చేశారు

లాక్‌డౌన్‌లో వర్క్ ఫ్రం హోం కోసం.. కొత్తగా ల్యాప్‌టాప్‌ కొన్నారా..?

రిపేరొస్తే.. వెయిటింగే...

ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల విడిభాగాలు, నిపుణుల కొరత

మరో 15-20 రోజుల్లో స్టాక్‌ పూర్తిగా ఖాళీ

చైనా నుంచి విడిభాగాలు రాకపోవడమూ కారణమే

సరిగ్గా హ్యాండిల్‌ చేయకపోవడంతోనూ సమస్యలు 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ క్లాస్‌లు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలు పెరగడంతో మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లకు డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌లో స్టాక్‌ ఖాళీ కావడంతో నవీకరించిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లనూ చాలామంది కొనుగోలు చేశారు. ఇప్పటికీ మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందుకు తగ్గ సరఫరా లేకపోవడంతో చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కొన్ని పాఠశాలలు తామే ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పలు సరఫరా చేస్తామంటూ పిల్లల తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ క్లాస్‌లు జోరుగా సాగుతుండటం, గతంలో పిల్లలు వీటిని పెద్దగా వాడిన అనుభవం లేకపోవడంతో ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలు మూలన పడుతున్నాయి. దీనికి తోడు విడిభాగాల లభ్యత పెద్దగా లేకపోవడం, సర్వీస్‌ నిపుణుల కొరత తల్లిదండ్రుల ఆందోళనను రెట్టింపు చేస్తోంది. బ్రాండెడ్‌ సంస్థల విడిభాగాల కొరత ఎక్కువగా ఉందని, కంపాటబుల్‌ విడిభాగాలకూ కొరత అక్కడక్కడా కనిపిస్తోందని, కస్టమ్స్‌ వద్దనే చైనా ఉత్పత్తులు ఆపివేస్తే 15-20 రోజుల్లో స్టాక్‌ పూర్తిగా నిండుకునే అవకాశాలున్నాయంటున్నారు డీలర్లు. 


పిల్లల ఆరాటం.. 

ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలను స్వేచ్ఛగా వినియోగించే అవకాశం రావడంతో పిల్లలు వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లో అసలేం ఉన్నాయో అన్న కుతూహలం వాటి పనితీరుపై పడుతోందని సర్వీస్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. చాలావరకూ ల్యాప్‌టా్‌పలలో ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కరెప్ట్‌ అవుతున్న కేసులే అధికంగా వస్తున్నాయంటున్నారు అమీర్‌పేట మైత్రివనంలో ల్యాప్‌టాప్‌ రిపేర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న పాండు. అతనే మాట్లాడుతూ తల్లిదండ్రులు ల్యాప్‌టా్‌పలో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే వస్తున్నారని, సౌండ్‌ రావడం లేదు, మైక్‌ పనిచేయడం లేదనే స్వల్పకారణాలతో కూడా వస్తున్నారని, కేవలం సెట్టింగ్స్‌ మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు. కొత్త ల్యాప్‌టా్‌పలు కూడా మరమ్మతుల బారిన పడటానికి సరిగా వాటిని నిర్వహించకపోవడమే కారణమని ఓ సుప్రసిద్ధ బ్రాండ్‌ సర్వీస్‌ ఇంజినీర్‌ మణికంఠ అంటున్నారు. తమ బ్రాండ్‌ ల్యాప్‌టా్‌పను రఫ్‌అండ్‌ ట్‌ఫగా వినియోగించవచ్చని, అయినా, మరమ్మతుకు వస్తోందంటే నిర్వహణ సరిగా లేకపోవడమేనన్నారు. 


కంపాటబుల్‌తోనే.. 

లాక్‌డౌన్‌ కాలంలో చాలామంది బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు లభ్యంకాక పాతవాటిని నవీకరించిన ల్యాప్‌టాప్‌లు, సెకండ్‌ హ్యాండ్‌ ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారు. అలాంటివారు ఇప్పుడు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు సర్వీస్‌ ఇంజినీర్లు. కొన్నిరకాల ల్యాప్‌టాప్‌లు ఔట్‌ డేటెడ్‌ మోడల్స్‌ కావడం వల్ల విడిభాగాల లభ్యత లేదంటూ, కొత్త మోడల్స్‌కు కంపాటబుల్‌ మోడల్స్‌ దొరుకుతున్నా, కొన్ని రోజుల్లో అవి కూడా లభించకపోవచ్చన్నారు సికింద్రాబాద్‌లో గణేష్‌ కంప్యూటర్స్‌ ప్రతినిధి సంజయ్‌. లాక్‌డౌన్‌ కాలంలో హడావిడిగా ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసిన వారిలో కొంతమంది మోసపోవడం కూడా ల్యాప్‌టాప్‌లు రిపేర్‌ కావడానికి ఓ కారణంగా చెబుతున్నారు. నవీకరించిన మోడల్స్‌నే కొత్తవిగా నమ్మించి విక్రయించిన కేసులనూ చూస్తున్నామంటున్నారు సంజయ్‌. ఆయనే మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో సరిగా డిస్ర్కిప్షన్‌ చదవకుండా, రేటు చూసి కొనుగోలు చేసిన వారే ఇలాంటి వారిలో అధికమని వెల్లడించారు. నిజానికి పలు బ్రాండ్ల ఒరిజినల్‌ విడిభాగాలు లభించే అవకాశాలు ఇప్పుడు పెద్దగా లేవనే అంటున్నారు డీలర్లు. చాలా వరకూ ల్యాప్‌టాప్‌ల విడిభాగాలు చైనా తయారీవే కావడం కూడా దీనికి ఓ కారణంగా పేర్కొంటూ కంపాటబుల్‌ మోడల్స్‌ అంతకన్నా తక్కువ ధరకు రావడం, పనితీరు పరంగా పెద్దగా మార్పు లేకపోవడంతో వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటుందంటున్నారు. 


రఫ్‌ హ్యాండ్లింగ్‌ వల్లే సమస్యలు: సతీష్‌, సిస్ట్రోనిక్‌ కంప్యూటర్స్‌

ఆన్‌లైన్‌ క్లాస్‌ల కారణంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లకు కొరత నెలకొంది. పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇస్తుండటం, వారు సరిగా వాటిని వినియోగించకపోవడం వల్ల  సమస్యలు వస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లను డెస్క్‌టాప్‌ తరహాలో వాడకూడదు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు కాస్త శిక్షణ ఇస్తే బాగుంటుంది.


నవీకరణతోనే ఎక్కువ సమస్యలు: శర్మ, శ్వేతా కంప్యూటర్స్‌

సెకండ్‌ హ్యాండ్‌, నవీకరణ ల్యాప్‌టాప్‌లతో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. చాలా కంపెనీలతోపాటుగా సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్స్‌ కోసం పాతవాటిని బల్క్‌గా అమ్ముతుంటారు. అలాంటి వాటిలో డాటా తొలగించి, కొన్ని భాగాలు మార్చి కొత్తవిగా విక్రయిస్తుంటారు కొందరు. ఇలాంటి వాటి వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జూమ్‌ లేదంటే ఆతరహా మాధ్యమాలు వినియోగిస్తే ఇవి హ్యాంగ్‌ అవుతుంటాయి. కొనే ముందే శ్రద్ధ చూపితే ఈ తరహా సమస్యలుండవు. 

Updated Date - 2020-07-06T18:14:38+05:30 IST