వింటున్నావా?!

ABN , First Publish Date - 2021-07-26T06:23:56+05:30 IST

అప్పుడు ఇద్దరం మన చూపులతో కాంతి పూలు ఏరుతుంటాం పువ్వులు ఏరుకోడానికి...

వింటున్నావా?!

వింటున్నావా?!

అప్పుడు ఇద్దరం

మన చూపులతో

కాంతి పూలు ఏరుతుంటాం

పువ్వులు ఏరుకోడానికి 

వంచిన మన హృదయాల్లోంచి

జారిపడిన స్వప్నాలతో

తోట వింతగా పరిమళిస్తుంది

ఒక జులపాల జుట్టు వాడు

అటు పక్కగా నడుస్తూ ఏదో 

ఈల పాడుకుంటూ వెళ్తాడు

గడ్డిలో ఎగురుతూ పిచికలు

బిక్కమొగమేసుకుని చూస్తాయి

నువ్వూ నేనూ 

మంచి పద్యాల వంటి 

       కాంతి పూలకై

నాలుగు నయనాలై 

తిరుగుతూనే వుంటాం, ఆ తోటలో

ఎండాకాలపు సాయంత్రాలు 

అట్నించి నువ్వు ఇట్నించి నేను 

అలసటతో వచ్చి ఒక కిటికీ వద్ద

దీపాలు ఆర్పేసి కూచుంటాం

మిణుగురు పురుగుల కోసం

ఆ పైన అవన్నీ మిణుగురులు

కాకపొయ్యుంటే, ఒకడు అలా

ఒళ్లంతా 

     తెల్లని ముఖం చేసుకుని

ఎందుకలా చూస్తాడు?

ఆకాశం కిటికీలో కూర్చున్న

ఈ రాత్రి, ఎందుకో

నాకిలా అనిపిస్తున్నది

ఎక్కడా ఏమీ లేదు లేదు

నువ్వు నేను ఒక కిటికీ 

కొన్ని మిణుగుర్లు, అంతే 

అదీ చాల కాసేపే, అదీ

చాల చిక్కని చీకట్లలోనే

నువ్వూ నేనూ మన

ఒక కిటికీలో కూర్చుని

ఒకరి మీదికి ఒకరం

ఒరిగిపోతూ మిణుగురు కాంతులకై

ఎదురు చూడడం కాకుండా 

ఇద్దరం కలిసి 

సుఖదుఃఖపడడం కాకుండా

నాకైతే ఏమీ వద్దు, మరి నీకు?

హెచ్చార్కె

వాట్సాప్‌: +160964 72863


Updated Date - 2021-07-26T06:23:56+05:30 IST