Advertisement

ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు మర్చిపోకండి..!

Apr 7 2020 @ 17:29PM

కరోనా వైరస్ ఒక పెను తుఫానులా ఈ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఈ భయాందోళన నుంచి బయటపడడానికి, ప్రతీ వ్యక్తికీ అన్ని విషయాల గురించి తెలిసేలా చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ సంక్షోభ పరిస్థితిలో, సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండడమే దీనికి ఏకైక మార్గం. ప్రజలు తమని తాము సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రతీ ఒక్కరూ పాటించవలసిన రక్షణ చర్యల గురించి ప్రభుత్వం, వైద్య సిబ్బంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు.


అయితే ఫుడ్ డెలివరీ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో ప్రజలకు అంతగా అవగాహన లేదు. రెస్టారెంట్లలో తినడం కంటే ఫుడ్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదేనా..? అనే విషయంలో గందరగోళం ఉంది. కరోనా వైరస్ బారి నుంచి సురక్షితంగా ఉండడానికి పూర్తి పరిశుభ్రత, 'చేతులు కడుక్కునే విధానం' పాటించవలసిన నేపథ్యంలో, ఫుడ్ డెలివరీ విషయంలో ఉన్న భద్రతను గ్రహించడంతో ప్రజలు విఫలమవుతున్నారు. అయితే ఆహారాన్ని సురక్షితంగా మీ ఇంటికి చేర్చడం వెనుక గల నిజానిజాల గురించి మరింత తెలుసుకుని, డెలివరీ విషయంలో మీకున్న అపోహలను పూర్తిగా తొలగించుకోవడం చాలా ముఖ్యం.

 

మొదటగా, కరోనా వైరస్ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమించే వైరస్ అని అంతా గ్రహించాలి. ఈ వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు. కాబట్టి ఆహార పదార్థాలు, ప్యాకింగ్ పదార్థాలు ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువ, ఎందుకంటే ఇది ఉపరితలాలపై ఎక్కువ సమయం జీవించి ఉండలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) అధ్యయనం ప్రకారం, ఈ వైరస్ అట్టముక్కలపై 24 గంటలు, ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్‌పై 72 గంటలు, గాలిలో కేవలం 3 గంటలు మాత్రమే జీవించగలదు. అందువల్ల ప్రజలు ఫుడ్ ప్యాకేజీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి.


ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీఫుడ్ డెలివరీ ఛానెల్స్ కాంటాక్ట్-లెస్ డెలివరీ విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నాయి. అంటే డెలివరీ సిబ్బంది తమ వినియోగదారులకు ఫుడ్ ప్యాకేజ్‌లను నేరుగా వారి చేతికి అందించకుండా వారి ఇంటి బయటే ఉంచి వెళతారు. మరోవైపు వినియోగదారులు గ్లౌజులు ధరించి తమ ఇంటివద్ద ఉంచిన ఫుడ్ ప్యాకేజ్‌ని తీసుకుంటారు. ఫుడ్ ప్యాకేజీని తెరవడానికి ముందు శుభ్రపరచాలి. ఏదైనా ప్రామాణిక క్రిమిసంహారక మందులను ఉపయోగించి ప్యాకేజ్ ఉపరితలాలను శుభ్రపరిచేటప్పుడు దానిలోని పదార్థాన్ని సురక్షితమైన పాత్రలలోకి మార్చాలి. మీకు అంతగా ఉపయోగపడని అదనపు ప్యాకేజీలను వదిలేయండి. ఫుడ్ ప్యాకేజ్‌ను తాకిన తరువాత మీ చేతులను 20 సెకన్ల పాటు తప్పనిసరిగా కడుక్కోవాలి. మీరు భోజనం తినడానికి ముందు మైక్రోవేవ్లో 1-2 నిమిషాలు వేడిచేయడం అస్సలు మర్చిపోవద్దు.

నిజానికి, చాలా ఫుడ్ డెలివరీ కంపెనీలు ఆరోగ్య అధికారులు సూచించిన పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూనే ఉన్నారు. డెలివరీ బాయ్స్ పాటించవలసిన రక్షణా విధానాలు, కాంటాక్ట్-లెస్ డెలివరీని ప్రోత్సహించడం, డెలివరీ ఎగ్జిక్యూటివ్ శిక్షణ వంటి భద్రతా మార్గదర్శకాలను పాటించేలా జాగ్రత్త పడుతున్నాయి. సురక్షితంగా ఉన్న మీ వద్దకు బయటి ఆహార పదార్థాలను తీసుకువచ్చినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే వైరస్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఎటువంటి ఆందోళన లేకుండా ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. మీరు ఈ విషయంలో జాగ్రత్త వహిస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు సురక్షితంగా ఉండడానికి వీలైనంత ఉత్తమ పద్దతులను అనుసరించండి. మీ ఆహారాన్ని మీ వద్దకు చేరకుండా మేము అడ్డుకోలేము, కానీ దానిపట్ల మీరు వీలైనంత సురక్షితమైన పద్దతిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.