ఏజెన్సీ వైద్యానికి చేయూతనివ్వరూ..

ABN , First Publish Date - 2020-12-04T04:42:42+05:30 IST

నాలుగు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా వైద్యశాలలో స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చాలని ఏజెన్సీవాసులు కోరుతున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ జిల్లాలోని వివిధ విభాగాల వైద్యాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఏజెన్సీ వైద్యానికి చేయూతనివ్వరూ..

భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత

సమస్యలతో సతమతమవుతున్న పీహెచ్‌సీలు

భద్రాద్రి కలెక్టరేట్‌లో నేడు సమీక్ష సమావేశం

హాజరుకానున్న ప్రజారోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌

భద్రాచలం, డిసెంబరు 3: నాలుగు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా వైద్యశాలలో స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చాలని ఏజెన్సీవాసులు కోరుతున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ జిల్లాలోని వివిధ విభాగాల వైద్యాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో భద్రాద్రి ఏరియా వైద్యశాలతో పాటు పీహెచ్‌సీల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లావాసులు ఆశిస్తున్నారు. 

వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత

తెలంగాణతో పాటు సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆరోగ్య సమస్యలతో వచ్చేవారికి  భద్రాచలం ఏరియా వైద్యశాల ప్రధాన ఆధారంగా ఉంది. 200 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఏజెన్సీ వాసులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. ఈ ఏరియా  వైద్యశాలకు వైద్యులు, సిబ్బంది కలిపి 205పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం కేవలం 61మంది మాత్రమే  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రికి 16 సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు మంజూరు కాగా మొత్తం ఖాళీగానే ఉన్నాయి. డిప్యుటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు 8 మంజూరు కాగా అవకూడా ఖాళీగానే ఉన్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 36 ఉండగా 19ఖాళీగా ఉన్నాయి. వైద్య సిబ్బందిలో స్టాఫ్‌నర్సు పోస్టులు 53 ఉండగా 45ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషిన్లు ఏడు పోస్టులకు ఐదు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్‌ఎం పోస్టులు ఏడు ఉండగా ఐదు ఖాళీగా ఉన్నాయి. ప్రసవాలలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంటున్న భద్రాచలం వైద్యశాలకు స్త్రీ వైద్య నిపుణులు ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉండగా అదనంగా కనీసం ముగ్గురైనా కేటాయించాల్సి ఉంది. ఏరియా వైద్యశాలలో స్కానింగ్‌ చేసేందుకు రేడియాలజిస్టు లేకపోవడంతో  స్కానింగ్‌లు ప్రైవేటుకు రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పీహెచ్‌సీల్లో పని చేస్తున్న స్పెషలిస్టు వైద్యులను ఏరియా వైద్యశాలలో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడం ద్వారా ఏరియా వైద్యశాల లక్ష్యం నెరవేరుతుందని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. 

పీహెచ్‌సీల్లో డెంగ్యూ ర్యాపిడ్‌ టెస్టులు చేయాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ ర్యాపిడ్‌ టెస్టులు ఏర్పాటు చేయాలని ఏజెన్సీవాసులు కోరుతున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో ర్యాపిడ్‌ టెస్టుల ఆధారంగా డెంగ్యూ నిర్దారణ చేస్తుండటంతో అధిక శాతం మంది ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారని, దీని ద్వారా పేదలు ఆర్థికంగా నష్టపోతున్నారనే విమర్శలున్నాయి. కొన్ని పీహెచ్‌సీల భవనాలు వర్షాకాలంలో కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటికి మరమ్మత్తులు చేయించాల్సి ఉంది. నెల్లిపాక పీహెచ్‌సీ ఏపీలో విలీనమైన తరువాత భద్రాచలం పట్టణంలో ఉన్న సబ్‌సెంటర్ల నిర్వహణ బాధ్యతను పర్యవేక్షించేవరు కరువయ్యారు. భద్రాచలంలో ఆశాల సంఖ్య తక్కువగా ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆ సంఖ్యను పెంచాలని గతంలో  ఐటీడీఏ పీవోలు సూచించినా అది ఇంతవరకు అమలుకు లేదు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించాలని భద్రాద్రి జిల్లావాసులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-04T04:42:42+05:30 IST