అంతరాష్ట్ర గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే అంత రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలిపారు.

అంతరాష్ట్ర గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్టు
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ విజయభాస్కరరెడ్డి

సత్తెనపల్లి, ఏప్రిల్‌ 22: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే అంత రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలిపారు. గురువారం నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు ప్రకటించారు. అరెస్టు అయిన వారిలో దాచేపల్లికి చెందిన మంతెని రాంబాబు, అంబటి చినవెంకటేశ్వర్లు అలియాస్‌ శ్రీను, షేక్‌ జిలానీ అలియాస్‌ కటింగ్‌ జిలానీ, షేక్‌ సైదా సాహెబ్‌ అలియాస్‌ సైతా, వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన అన్నం గోపాలరావు అలియాస్‌ గోపయ్య ఉన్నారు. కోళ్లూరులో వెయ్యేళ్ల నాటి ఆంజనేయస్వామి గుడి  సమీపంలో ఐదుగురు  ఈ ముఠా అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పిడుగురాళ్ల రూరల్‌ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పురాతన ఆలయ ఆవరణలో గుప్త నిధులు ఉంటాయని భావించిన వీరు వాటిని వెలికితీసేందుకు 10 నెలల క్రితం తవ్వకాలు జరిపారు. అయితే వారికి ఎటువంటి నిధులు లభ్యం కాలేదు. అయినప్పటికీ వారు అదే ప్రయత్నంలో ఉండగా వర్షాల కారణంగా ఆలయం నీట మునిగింది. ప్రస్తుతం నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవటంతో నిధుల తవ్వకాల కోసం వెళ్లినట్లు నిందితులు వెల్లడించారు. వీరితోపాటు పిడుగురాళ్లకు చెందిన వీరాస్వామి, పాల్వంచకు చెందిన భిక్షపతి, విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే ముగ్గురు కూడా ఈ ముఠాతో కలిసి గతంలో తవ్వకాల్లో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా గతంలో కొండవీడు కోట, కర్నూలు జిల్లా ఆత్మకూరులో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు అంగీకరించారు. కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు.    బెల్లంకొండ ఎస్‌ఐ కె.రాజశేఖర్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు వేణుగోపాలరావు, షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌, కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌, హోంగార్డులు షరీఫ్‌ తదితరులకు డీఎస్పీ రివార్డులు ప్రకటించారు. నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే డయల్‌ 100 కానీ రూరల్‌ జిల్లా వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ 8866268899 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST