పగలు ఉద్యోగం.. రాత్రిళ్లలో చోరీలు

ABN , First Publish Date - 2022-08-14T05:22:03+05:30 IST

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దానికోసం చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలిపారు.

పగలు ఉద్యోగం.. రాత్రిళ్లలో చోరీలు
నిందితుల వివరాలు ప్రకటిస్తున్న డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, సీఐ శోభన్‌బాబు తదితరులు

అంతర జిల్లాల దొంగ అరెస్ట్‌ 

సత్తెనపల్లి, ఆగస్టు13: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దానికోసం చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయభాస్కరరెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ గుంటూరు మండలం అంకిరెడ్డిపాలేనికి చెందిన వడ్లమాను శివారెడ్డి ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా  పనిచేస్తుంటాడు. దురలవాట్లకు, జల్సాలకు అలవాటు పడిన అతను దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ప్రస్తుతం జిల్లాలోని పది పోలీస్‌స్టేషన్ల పరిధిలో 14 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. వేలిముద్రలు దొరకకుండా చేతులకు గ్లౌజులు, ముఖం గుర్తుపట్టకుండా మాస్కు, తలకు క్యాప్‌ పెట్టుకొని దొంగతనాలు చేస్తాడని ఆయన తెలిపారు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి శివారెడ్డిని అరెస్ట్‌ చేశామన్నారు. అతని వద్ద నుంచి రూ.7లక్షల నగదు, ఒక ఫోన్‌, రెండు మోటర్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.   


Updated Date - 2022-08-14T05:22:03+05:30 IST