ప్రభువుల ఆంక్షలు, పరస్పర అవసరాలు!

ABN , First Publish Date - 2022-03-10T07:31:19+05:30 IST

పదిసంవత్సరాల కిందట ఇరాన్ రాజధాని టెహరాన్‌లో జరిగిన అలీనదేశాల సదస్సుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నాడు....

ప్రభువుల ఆంక్షలు, పరస్పర అవసరాలు!

పదిసంవత్సరాల కిందట ఇరాన్ రాజధాని టెహరాన్‌లో జరిగిన అలీనదేశాల సదస్సుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నాడు. ఆ సందర్శన ఒక గొప్ప, ప్రత్యేకమైన అనుభవం. అమెరికా ఆంక్షలు విధించిన దేశంలో పరిస్థితి ఎట్లా ఉంటుందో ప్రత్యక్షంగా చూడడానికి అది ఒక అవకాశం కల్పించింది. అమెరికా ఉగ్రవాదం అన్న శీర్షికతో ఆ సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శన, రూఢిపడిన అసత్యాలను బద్దలు కొట్టింది. వీసా, మాస్టర్ కార్డ్ చెల్లవు, గూగుల్, మైక్రోసాఫ్ట్ పనిచేయవు. డాలర్ బంగారం. కనిష్ఠమైన విలువతో దేశీయ కరెన్సీ. అయినా, ఆ దేశం బతికింది. తనను రాజకీయంగా ఏమాత్రం సమర్థించని గల్ఫ్‌ దేశాలలోనే, ప్రత్యేకమైన మార్గాల ద్వారా ఆంక్షలను అధిగమించే మార్గాలను కనిపెట్టింది. కట్టడి బిగుసుకున్నప్పుడు రహస్యాన్ని ఆశ్రయించకతప్పదు. అట్లా, ఇరాన్‌కు అప్పుడు అవసరమైన రహస్య మిత్రుడు భారత్. భారత్‌కు, ఇరాన్‌కు సహస్రాబ్దాల స్నేహం. నరవర్గ వారసత్వంలోనూ, భాషావర్గ వారసత్వంలోనూ ఉత్తరభారతదేశమూ, పర్షియా సోదర ప్రాంతాలు.


రెండు అగ్రరాజ్యాలూ మంచి ఊపు మీద ఉన్నప్పుడు కూడా, భారతదేశానికి తన సొంత ఆశలు తనకు ఉండేవి. దక్షిణాసియా ప్రాంతంలో పెద్దన్నగా వ్యవహరించాలని, కొన్నిటిని చేరదీయాలని, కొందరిని అదుపుచేయాలని, ఆర్థికంగా కూడా బలశాలి కావాలని మనదేశాన్ని పాలించిన శక్తులో, వ్యక్తులో అనుకున్నారు, ఆ ఆశలకు అనుగుణమైన కొన్ని సంఘటనలను, చర్యలను చరిత్రలో చూడవచ్చు. అట్లాగే, ఇరాన్ నుంచి చమురును నేరుగా తెప్పించుకోవడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని, ఒక ఓడరేపును కూడా ఏర్పాటు చేసుకోవాలని భారతదేశం సంకల్పించింది. 1979లో ఇస్లామిక్ విప్లవం దగ్గర నుంచి, ఇరాన్ ఆర్థిక పరిస్థితులు అనేక ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికాతో నిత్యవైరం మాత్రమే కాక, ఇరాక్‌తో సుదీర్ఘకాల యుద్ధం ఆ దేశాన్ని బలహీనపరిచింది. భారత్-, ఇరాన్‌ల నడుమ ద్వైపాక్షిక సంబంధం ఉభయతారకంగా పనిచేసింది. ఇరాన్‌కు గోధుమలు కావాలి. భారత్‌కు చమురు కావాలి. అలీన సదస్సు తీర్మానాలు, చర్చలు సరే, భారత దౌత్యప్రతినిధులకు, వాణిజ్యరంగ ప్రతినిధులకు కావలసింది ఒకటే, గోధుమలు-చమురు వస్తుమార్పిడి ఒప్పందం కుదిరిందా లేదా అన్నదే వారికి ఆసక్తి. సహజంగానే మీడియా కూడా ఆ అంశం మీదనే గురిపెట్టింది. ఆంక్షల నడుమ బేరాలాడలేని స్థితిలో ఉన్న ఇరాన్‌కు గోధుమల ఎగుమతి భారత్‌కు మంచి లాభసాటి వ్యవహారం. చారిత్రక అనుబంధం సరే, దాన్ని ఆర్థిక సంబంధంలోకి అనువదించుకోకపోతే ఏమిలాభం?


రష్యా మీద ఇప్పుడు, అమెరికా, దాని అనుచర దేశాలు విధిస్తున్న ఆంక్షలను చూస్తుంటే, చరిత్ర మరొక విడత ఆవృత్తమవుతున్నదనిపిస్తుంది. యుద్ధాల చేత, ఆక్రమణల చేత కునారిల్లిపోయిన ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలే, బతికి బట్టకట్టడమే కాక ప్రతిఘటన కూడా ఇవ్వగలిగాయంటే, పీకలదాకా అణ్వస్త్రాలను కలిగి, అనేక మంది బాహాటపు, రహస్యపు మిత్రులను కలిగిన రష్యా ఆంక్షల వల్ల అణగారిపోతుందా? రష్యాతో కూడా చారిత్రక మైత్రి, సైనిక వాణిజ్యం కలిగి ఉన్న భారత్ అమెరికా ఆంక్షలను గౌరవించగలుగుతుందా? తన ఆంక్షలను గౌరవించకుంటే శత్రుదేశమే అన్న అమెరికా నిర్వచనం నుంచి తాను మినహాయింపు పొందగలుగుతుందా? 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకున్న తరువాత కూడా అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. నేల మీద నుంచి ఆకాశ లక్ష్యాల వైపు దూసుకుపోయే ఎస్ 500 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి ఎవరూ కొనగూడదన్నది ఆ ఆంక్షల ఉద్దేశ్యాలలో ఒకటి. కానీ, భారతదేశం కొన్నది. పంజాబ్‌లోని ఐఎఎఫ్ స్థావరంలో దాన్ని నెలకొల్పింది కూడా. తన ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే దేశాలను అదుపు చేయడానికి రూపొందించిన ‘కాట్సా’ చట్టాన్ని ఇండియా మీద కూడా ప్రయోగించాలి, కానీ, చూసీ చూడనట్టు ఉండాలని నిర్ణయించుకున్నది.


రష్యా చమురు కొనకూడదని అమెరికా తీసుకున్న నిర్ణయం, నేరుగా ఆ దేశపు యుద్ధయంత్రం గుండెల్లోకి దించిన అస్త్రం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యాఖ్యానించాడు. ఒక దేశం ఏ వనరుల మీద అయితే ఆధారపడుతుందో, ఆ వనరులకు అమ్మకాలు కొనుగోళ్లు నిషేధిస్తే, యుద్ధయంత్రమేమిటి, సమాజయంత్రమే గిలగిలలాడుతుంది. రష్యాకు చమురు పెద్ద వాణిజ్య వనరే కానీ, ఇంకా ఇతర ఆధారాలు కూడా ఆ దేశానికి ఉన్నాయి. రష్యా గోధుమ తదితర ఆహార ఎగుమతులు కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. ఇక యుద్ధసామగ్రి సంగతి చెప్పనక్కరలేదు. చమురు తప్ప మరొకటి లేని దేశాలను ఆంక్షలు మరీ ఊపిరాడకుండా చేస్తాయి. మూడుదశాబ్దాల కిందట కువాయిట్ మీద దాడి చేసిందన్న కారణంతో, అమెరికా ఇరాక్ మీద మొదటి గల్ఫ్‌ యుద్ధం చేసింది. ఆ తరువాత అనేక ఆంక్షలు పెట్టింది. యుద్ధంలో జరిగిన మరణాలకు కొన్ని రెట్లు ఆంక్షల కారణంగా జరిగాయి. మందులు, పోషకాలు దొరకక పదిలక్షల మంది పిల్లలు మరణించారని నివేదికలు చెబుతాయి. ఆ సమయంలో, ఇరాక్ చమురును ఆహారపదార్థాల కోసం, మందుల కోసం అమ్ముకోవచ్చు అంటూ అమెరికా ‘మహా మానవతాదృష్టితో’ ఒక పథకాన్ని ప్రారంభించింది. అంతే కాదు, తన యుద్ధఖర్చులను రాబట్టుకోవడానికి చమురు అమ్మకాలను అనుమతించింది. ఆ కాలంలో భారతదేశం కూడా ఆ పథకాన్ని అవకాశం చేసుకుని ఇరాక్‌కు ఆహారాన్ని, మందులను సరఫరా చేసింది. అమెరికా పర్యవేక్షణలో జరిగే సరఫరాలకు తోడు, సద్దాం హుస్సేన్ అగ్రరాజ్యం కన్ను గప్పి, ఐక్యరాజ్యసమితి అధికారులకు, వివిధ దేశాల రాజకీయవాదులకు ప్రోత్సాహకాలు ఇచ్చి దేశంలోకి కొన్ని నిత్యావసరాలను రప్పించుకున్నారు. తరువాత కాలంలో విదేశాంగ మంత్రి అయిన నట్వర్ సింగ్ కూడా ఇరాక్‌కు అక్రమంగా మేలుచేశాడని, ఐక్యరాజ్యసమితిలో ఇరాక్ ప్రయోజనాల కోసం అందుకే మాట్లాడాడని వివాదం కూడా నడిచింది. లంచం ఇచ్చారో లేదో పుచ్చుకున్నారో లేదో కానీ, వర్ధమానదేశాల మధ్య ఉండే ఒక బంధం ఏదో పనిచేసిందని కూడా అనుకోవచ్చు. అమెరికా ఆంక్షలను ఏదో ఒక పద్ధతిలో అధిగమించడానికి, తద్వారా సొంత లాభం కూడా కొంత చూసుకోవడానికి భారతదేశం వెనుకాడదని అర్థం చేసుకోవడానికి ఇరాన్, ఇరాక్ రెండూ కూడా ఉదాహరణలే.


ఇప్పుడిక రష్యా. రష్యా నుంచి మనకు గ్యాస్ కావాలి. చమురూ కావాలి. ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ కావాలి. ఇవన్నీ చిన్న విషయాలు. ప్రచ్ఛన్నయుద్ధం, భారత్‌–సోవియట్ ఒప్పందాలూ ముగిసిపోయి మూడుదశాబ్దాలు గడచినా, భారతీయ ఆయుధాగారం ఇంకా సగానికి పైగా రష్యన్ ఉత్పత్తులతోనే నిండి ఉంది. వీటిలో తాజా కొనుగోళ్లు ఉన్నాయి. వాటి చెల్లింపులు దశలవారీగా సాగుతున్నాయి. అట్లాగే, ఉపయోగంలో ఉన్న ఆయుధసామగ్రికి నిరంతర నిర్వహణసేవలు కావాలి. వాటిని రష్యన్‌లే అందించాలి. ఇప్పుడు బైడెన్ దొరగారు ఆదేశించారని లేదా సందేశించారని, రష్యాతో ఆర్థిక లావాదేవీలు భారతదేశం విరమించుకోగలదా? ఉన్నట్టుండి, రష్యాతో రక్షణ సంబంధాలు తెంచుకుంటే, భారత్ నిరాయుధం కాదా? మరి ఖ్వాడ్ ఒప్పందం ద్వారా, చైనాను కట్టడి చేయాలనుకునే సంకల్పానికి అది విఘాతం కాదా? కాబట్టి, రక్షణ నిపుణులు, విశ్లేషకులు అందరూ, చాకచక్యంగా అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలన్న సలహానే భారత్‌కు ఇస్తున్నారు.


కానీ, దేశంలో ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా వ్యతిరేక మనోభావాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. ఒకప్పుడు, ఇరాక్‌కు ఆయుధసరఫరాలు అందించే అమెరికన్ విమానాలకు ఇంధనం నింపినందుకు భారతప్రభుత్వం దోషిగా నిలబడింది. కువాయిట్ మీద ఇరాక్ దాడిని దుస్సాహసం అంటూనే దాన్ని అర్థం చేసుకోగలిగిన ఔదార్యాన్ని నాడు మెజారిటీ రాజకీయవాదులు ప్రదర్శించారు. సుదీర్ఘకాలం భారత్ అనుసరించిన అంతర్జాతీయ విధానాల నేపథ్యం, అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేకత దేశ చింతనలో ఒక విలువగా ఉండడం అందుకు కారణమై ఉండవచ్చు. ఈ మూడు దశాబ్దాల కాలంలో మన దేశంలో విలువలు మారిపోయాయి. లోతైన వివేచన, చారిత్రక అవగాహన లోపించి, మీడియా ప్రభావంలోనూ, ఆధునిక జీవనశైలుల ప్రలోభంలోనూ ఉద్వేగాలు తమపై చేసే స్వారీలో కొట్టుకుపోతున్నారు. బాధిత దేశంగా ఉక్రెయిన్ మీద సానుభూతి చూపడం సరైన మానవీయ స్పందనే, సందేహం లేదు. కానీ, గతంలో జరిగిన దురాక్రమణల్లో మన స్పందనలు ఇట్లా ఉన్నాయా, ఇప్పుడు రష్యాను నిందించినట్టుగా ఎప్పుడైనా అమెరికాను మాట అనగలిగామా అని కూడా దేశంలోని అభిప్రాయకర్తలు తరచిచూసుకోవాలి. అన్నిటికంటె హాస్యాస్పదం, రష్యా వాదనను కూడా వినిపించేవారిని కమ్యూనిస్టులని ఆరోపించడం. రష్యాను ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నవారే కమ్యూనిజంపై తమ వ్యతిరేకతను ఇట్లా తీర్చుకుంటున్నారేమోననిపిస్తుంది. రష్యా, చైనా ఫక్తు పెట్టుబడిదారీ దేశాలు. చరిత్రను తనకు అనుగుణంగా వ్యాఖ్యానించుకుని తిరిగి రష్యన్ సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు పుతిన్. నాటో వచ్చి పక్కలో డేరా వేస్తే ఊరుకుంటాడా మరి!


మధ్య వైష్ణవుడికి నామాలెక్కువ అని, గతంలో సోవియట్ కూటమిలో ఉండి, తరవాత నాటోలో చేరిన పోలండ్, తన దగ్గర ఉన్న మిగ్ 29 యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు ఇవ్వనా అని అమెరికాను అడిగింది. వద్దు, వద్దు తొందరపడకు,- అంటూ అమెరికా వారించింది. ఒకసారి మూడో దేశం సాయం అందించిందంటే, అది కూడా యుద్ధంలో దిగినట్టేనని రష్యా భావిస్తుందని అమెరికాకు తెలుసు. అది ఆచితూచి అడుగు కాదు, అణుయుద్ధ భయం. జెలెన్ స్కీ ‘నాటో’ ఆలోచన విరమించుకుంటే, కథ వెంటనే సుఖాంతం. లేకపోతే, చమురు పీపా 300 కావడం ఖాయం, తటస్థతతో సంపాదించుకున్న పలుకుబడితో మనకు రష్యా చవుక చమురు వస్తే తప్ప!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-03-10T07:31:19+05:30 IST