బైడెన్ విజయాన్ని ధృవీకరించిన అరిజోనా.. మెజారిటీ ఎంతంటే..

ABN , First Publish Date - 2020-12-01T19:40:50+05:30 IST

డెమొక్రటిక్ నేత జో బైడెన్ విజయం సాధించినట్లు అరిజోనా రాష్ట్ర అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు.

బైడెన్ విజయాన్ని ధృవీకరించిన అరిజోనా.. మెజారిటీ ఎంతంటే..

అరిజోనా: డెమొక్రటిక్ నేత జో బైడెన్ విజయం సాధించినట్లు అరిజోనా రాష్ట్ర అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై 10,457 ఓట్ల తేడాతో బైడెన్ గెలిచినట్లు వెల్లడించారు. దీంతో బైడెన్ ఈ రాష్ట్రంలోని 11 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నట్లు ప్రకటించారు. అరిజోనా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ కాటీ హబ్స్(డెమొక్రట్), రాష్ట్ర గవర్నర్ డగ్ డ్యూసీ.. బైడెన్ గెలిచినట్లు ధృవపత్రాలు విడుదల చేశారు. ఈ విజయంతో మరో స్వింగ్ స్టేట్ బైడెన్ ఖాతాలో చేరిందని ఈ సందర్భంగా కాటీ హబ్స్ పేర్కొన్నారు. అంతకుముందు జార్జియా కూడా ట్రంప్‌పై బైడెన్ 12,587 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించింది. తాజాగా రీకౌంటింగ్ జరిగిన విస్కాన్సిన్‌లో కూడా బైడెన్ 20వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు.  


పెన్సిల్వేనియాలో సైతం బైడెన్ 81,660 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇలా వరుసగా స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ ఓటమి చవిచూడటం ఈసారి ఆయనను అధ్యక్ష పీఠానికి దూరం చేసింది. 2016లో ఈ రాష్ట్రాలే ట్రంప్‌ను అధ్యక్ష పీఠం ఎక్కించాయి. ఇప్పుడు అవే రాష్ట్రాలు ఆయనను అధికారానికి దూరం చేశాయి. కాగా, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను బైడెన్ 306, ట్రంప్ 232 ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావాల్సిన 270 ఓట్ల మేజిక్ ఫిగర్‌ను బైడెన్ సులువుగా అందుకున్నారు. డిసెంబర్ 14న జరిగే ఎలక్టోర్స్ భేటీలో అమెరికా తదుపరి అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అనంతరం 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. 

Updated Date - 2020-12-01T19:40:50+05:30 IST