ఆ నటుడ్ని కంటిన్యూ చేస్తోన్న లోకేష్ కనగరాజ్

Jun 7 2021 @ 22:36PM

కోలీవుడ్‌ యువ దర్శక సంచలనం లోకేష్‌ కనగరాజ్‌. అతి తక్కువ కాలంలోనే విశ్వనటుడు కమల్‌హాసన్‌, ఇళయదళపతి విజయ్‌, కార్తీ వంటి స్టార్‌ హీరోలకు దర్శకత్వం చేసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మాస్టర్‌’ గత సంక్రాంతికి విడుదలై సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రం విడుదలకాకముందే ఆయనకు కమల్‌హాసన్‌ను డైరెక్ట్‌ చేసే గొప్ప అవకాశం దక్కింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘విక్రమ్‌’ అనే టైటిల్‌లో ఓ చిత్రం రానుంది. ఈ చిత్రంలో అర్జున్‌దాస్ నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కావాల్సివుంది. 


కానీ, కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా చిత్రం షూటింగ్‌లో జాప్యం ఏర్పడింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్ర కథ రాజకీయ నేపథ్యంలో కొనసాగనుంది. ఇదిలావుంటే, ఈ చిత్రంలో విలన్‌గా ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రను విజయ్‌ సేతుపతి పోషించనున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించిన అర్జున్‌దాస్ కూడా ఇపుడు ‘విక్రమ్‌’ చిత్రంలో నటించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల తాజా సమాచారం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.