Arjun Tendulkar : ముంబై క్రికెట్ అసోసియేషన్‌కి అర్జున్ తెందుల్కర్ గుడ్‌బై.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-08-12T00:09:31+05:30 IST

క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్(Sachin Tendulkar) తనయుడు అర్జున్ తెందుల్కర్ (Arjun Tendulkar) ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహించిన సొంత క్రికెట్ అసోసియేషిన్ ఎంసీఏ(Mumbai Cricket Association)ని వీడేందుకు సిద్ధమయ్యాడు.

Arjun Tendulkar : ముంబై క్రికెట్ అసోసియేషన్‌కి అర్జున్ తెందుల్కర్ గుడ్‌బై.. కారణం ఇదే..

ముంబై : క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్(Sachin Tendulkar) తనయుడు అర్జున్ తెందుల్కర్ (Arjun Tendulkar) ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహించిన సొంత క్రికెట్ అసోసియేషిన్ ఎంసీఏ(Mumbai Cricket Association)ని వీడేందుకు సిద్ధమయ్యాడు. 22 ఏళ్ల ఈ ఎడమ చేతివాటం పేసర్.. పొరుగునే ఉన్న ‘గోవా క్రికెట్ అసోసియేషన్’ (GCA) తరపున దేశవాళీ క్రికెట్ బరిలో దిగాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఎంపీఏ వద్ద ఎన్‌వోసీ(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కనీసం టాలెంట్ నిరూపించుకునేందుకైనా అవకాశాలు ఇవ్వకపోవడంపై నిరాశకు గురైన అర్జున్ తెందుల్కర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఎస్ఆర్‌టీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ(సచిన్ తెందుల్కర్ స్పోర్ట్స్ కంపెనీ) ఒక ప్రకటనలో తెలిపింది. అర్జున్ తెందుల్కర్ తన కెరియర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నాడని, మైదానంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన సమయమిదని ఎస్ఆర్‌టీ స్పోర్ట్స్ పేర్కొంది. గోవా తరపున ఆడితే మెరుగైన అవకాశాలు లభించొచ్చని విశ్లేషించింది. అర్జున్ తెందుల్కర్ తన క్రికెట్ జీవితంలో కొత్త ప్రయత్నాల దిశగా అడుగులు వేస్తున్నాడని ఈ సందర్భంగా పేర్కొంది.


ఈ వార్తలపై గోవా క్రికెట్ అసోసియేషన్(డీసీఏ) సీనియర్ సభ్యుడు ఒకరు స్పందించారు. జూనియర తెందుల్కర్ పేరును గోవా ప్రీ-సీజన్ ప్రొబబుల్స్‌లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎడమ చేతివాటం బౌలర్‌ కోసం తాము ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. నైపుణ్యం కలిగిన కొత్త ఆటగాళ్లను జట్టులో జత చేసుకుంటామన్నారు. 


ఒక్క అవకాశమూ ఇవ్వకపోవడంపై నిరాశ..

ఈ ఏడాది ముగిసిన క్రికెట్ సీజన్‌లో ముంబై జట్టులో ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం అర్జున్ తెందుల్కర్‌ను తీవ్రంగా నిరాశపరిచిందని సమాచారం. అర్జున్ చక్కటి దృక్పథం, సరైన ఆలోచన, నైతికతతో కష్టపడుతున్నాడని అతడి మెరుగుదలను పర్యవేక్షిస్తున్న వ్యక్తి ఒకరు చెప్పారు. తను ఎంతటి సమర్థవంతుడో నిరూపించుకునేందుకైనా అవకాశం ఇవ్వడంలేదని విచారం వ్యక్తం చేశారు.


ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపును ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడు సయ్యదర్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2020-21 ఎడిషన్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. హర్యానా, పుదుచ్చెరిలపై ఈ మ్యాచ్‌లు ఆడాడు. మూడేళ్లక్రితం ఇండియా అండర్-19 తరపున శ్రీలంకపై 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇదే సమయంలో దేశవాళీ పరిమితి ఓవర్ల క్రికెట్లో ముంబై ప్రాబబుల్స్‌లో కూడా అర్జున్ చోటుదక్కించున్న విషయం తెలిసిందే. కాగా ఆటతీరును మెరుగుపరచుకునేందుకు ఇంగ్లండ్‌లో క్లబ్‌ల తరపున టీ20 మ్యాచ్‌లు ఆడించనున్న ‘డెవలప్‌మెంటల్ స్క్వాడ్’లో అర్జున్ తెందుల్కర్ కూడా ఉన్నాడు.

Updated Date - 2022-08-12T00:09:31+05:30 IST