పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌లో పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-03-07T05:39:00+05:30 IST

కడప మున్సిపల్‌ కార్పొరేషన పరిధిలో ఇంకా పోటీలో ఉన్న 27 డివిజన్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే ఫెసిలిటేషన సెంటరులో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌లో పకడ్బందీ ఏర్పాట్లు
పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కడప, మార్చి 6 (ఆంధ్రజ్యోతి)/కడప (నాగరాజపేట): కడప మున్సిపల్‌ కార్పొరేషన పరిధిలో ఇంకా పోటీలో ఉన్న 27 డివిజన్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే ఫెసిలిటేషన సెంటరులో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక మద్రాసు రోడ్డులోని మున్సిపల్‌ హైస్కూలు మెయినలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన కేంద్రాన్ని సబ్‌ కలెక్టర్‌ పృథ్వితేజ్‌, మున్సిపల్‌ కమిషనరు లవన్న, తహసీల్దారు శివరామిరెడ్డితో కలిసి కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. కంప్యూటర్‌ సిస్టమ్స్‌, టేబుల్స్‌ ఏర్పాటు, డివిజన వారీగా పోలింగ్‌ కేంద్రం, గెజిటెడ్‌ అధికారి, పోలింగ్‌ ఏజంట్లు కూర్చునే స్థలం, బ్యాలెట్‌ పేపర్లు, ఓటరు జాబితా, పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేసే విధానం తదితరాలను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి డ్యూటీ ఆర్డర్‌ పొందిన ప్రతి ఒక్కరూ కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన ఉపయోగించుకోవాలని కలెక్టరు విజ్ఞప్తి చేశారు.


పోస్టల్‌బ్యాలెట్‌ ఓటుకు నేడే చివరి అవకాశం

పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు 7వ తేది చివరి అవకాశమని, తమ ఓటున్న మున్సిపాలిటీలకు వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్‌ హరికిరణ్‌ ఒకప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 6, 7 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. ఇప్పటికే ఒక రోజు గడిచిపోయినందున 7వతేదీ ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉందని, చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


పోలింగ్‌ నిర్వహణపై సూక్ష్మదృష్టి

జిల్లాలో జరుగనున్న ఎన్నికల పోలింగ్‌ పక్రియపై సూక్ష్మదృష్టిని సారించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్‌ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. కలెక్టరేట్‌లోని సభాభవనంలో జేసీ ధర్మచంద్రారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. కార్పోరేషన, మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతతో పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. సూక్ష్మ పరిశీలకులు జిల్లా పరిశీలకులను అనుసరించి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.


సెల్‌ఫోన్లు అప్పగించండి

వార్డు వలంటీర్లకు కలెక్టర్‌ ఆదేశం

జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వలంటీర్లు తమ అధికారిక సెల్‌ఫోన్లను తక్షణం అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర హైకోర్టు డివిజన బెంచ తీర్పు మేరకు మున్సిపాలిటీ కార్యాలయంలో పరిపాలన అధికారి, సంబంధిత అధికారికి తక్షణం వార్డు వలంటీర్లు సెల్‌ఫోన్లు అప్పగించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన చేయాల్సి వస్తే మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారి సమక్షం నుంచి ఫోన చేయవచ్చని తెలిపారు. వార్డు వలంటీర్లు ఎటువంటి అనధికారిక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందితే వారిపై విచారణ చేసి నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వలంటీర్లపై ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, 08562244437, 08562244070, వాట్సాప్‌ నంబరు 9949830700కు చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన ఆధ్వర్యంలో 24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్‌ నంబరు 08662466877, మెయిల్‌ ఐడీ ఎస్‌ఈసీవై.ఏపీఎస్‌ఈసీ2అట్‌దిరేట్‌ఆఫ్‌జీమెయిల్‌డాట్‌కామ్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Updated Date - 2021-03-07T05:39:00+05:30 IST