పకడ్బందీగా కంటైన్మెంట్‌ జోన్లు

ABN , First Publish Date - 2021-05-07T05:32:38+05:30 IST

కంటైన్మెంట్‌ జోన్లను పకడ్బందీగా నిర్వహించాలని, వీటి పర్యవేక్షణకు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని మ్యాపింగ్‌ చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు.

పకడ్బందీగా కంటైన్మెంట్‌ జోన్లు
కవిటిలో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షించాలి

ప్రతి పట్టణంలో 250కు తగ్గకుండా కరోనా పరీక్షలు 

కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలి

కలెక్టర్‌ నివాస్‌

కలెక్టరేట్‌, మే 6: కంటైన్మెంట్‌ జోన్లను పకడ్బందీగా నిర్వహించాలని, వీటి పర్యవేక్షణకు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని మ్యాపింగ్‌ చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. గురువారం మండల ప్రత్యేకాధికారులు, వైద్య, మునిసిపల్‌ అధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సచివాలయ ఉద్యోగికి కనీసం ముగ్గురు వలంటీర్లను మ్యాపింగ్‌ చేయాలన్నారు. ప్రతి కంటైన్మెంట్‌ జోన్‌లో ఒక సచివాలయ ఉద్యోగి ఉండాలని స్పష్టం చేశారు.  ప్రతి పట్టణంలో 200 నుంచి 250  తగ్గకుండా కరోనా పరీక్షలు చేయాల న్నారు. హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ  చేయాలన్నారు. వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కె.శ్రీనివాసులు, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనంజయ్‌ గరోడా, ఆర్డీవోలు ఐ.కిశోర్‌, టీవీఎస్‌జీ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  


రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు : ఆర్డీవో

పాలకొండ : కర్ఫ్యూ సమయంలో ఎవరైనా అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్న 12 గంటల తర్వాత డివిజన్‌ కేంద్రమైన పాలకొండలో పలు కూడళ్లలో కర్ఫ్యూ పరిస్థితులు పరిశీలించారు. ఏలాం జంక్షన్‌, వీరఘట్టం జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ తదితర కూడళ్ల రాకపోకలు సాగిస్తున్న వారిని అడ్డుకుని, కరోనా పరిస్థితులపై అవగాహన కల్పించి హెచ్చరించారు. ఆయన వెంట నగర పంచాయతీ కమిషనర్‌ నడిపేన రామారావు, సీఐ శంకరరావు తదితరులు ఉన్నారు.


ఫీవర్‌ సర్వే పక్కాగా నిర్వహించాలి

పలాస: మునిసిపాలిటీ పరిధిలో ఇంటింటా ఫీవర్‌ సర్వేలు పక్కాగా నిర్వహించాలని కమిషనర్‌ డి.రాజగోపాలరావు సూచించారు. గురువారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నోడల్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలో కర్ఫ్యూ పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణకుమార్‌, తహసీల్దార్‌ మధుసూధనరావు, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు పాల్గొన్నారు.  


కొవిడ్‌ నియంత్రణపై దృష్టి సారించండి 

పలాసరూరల్‌ : కొవిడ్‌ రెండో దశ విజృంభిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో నియంత్రణకు ప్రత్యేక దృష్టిసారించాలని ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నా యుడు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులు, పర్యవేక్షణాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వేలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. 45 ఏళ్లు వయసు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.  


నిబంధనలు అతిక్రమిస్తే కేసులు

కవిటి : కరోనా నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ జి.అప్పారావు హెచ్చరించారు. గురువారం కవిటి, జగతి, గొండ్యాలపుట్టుగ, రాజపురం తదితర గ్రామాల్లో పర్యటించి ఆటోపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతున్న నేప థ్యంలో 12 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని, దుకాణాలను మూసివేయాలని సూచించారు. 


డొంకలపర్తలో కరోనా కలకలం

బూర్జ: డొంకలపర్తలో కరోనా కలకలం రేగింది. ఆ గ్రామ సచివాలయంలో ఇద్దరు సిబ్బందికి, అంగన్‌వాడీ ఆయాకు, వలంటీర్‌తోపాటు మరో ముగ్గురుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గ్రామంలో జ్వరాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయించాలని ఎంపీడీవో సురేష్‌ సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో హై ప్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని సెక్రటరీ రామకృష్ణను ఆదేశించారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.


 కొవిడ్‌ ఆసుపత్రిగా వసంతి నర్సింగ్‌ హోం 

ఇచ్ఛాపురం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ పరిధి పకీర్‌పేటలో గల వసంతి నర్సింగ్‌హోంను కొవిడ్‌ ఆసుపత్రిగా కలెక్టర్‌ ఎంపిక చేసినట్టు తహసీల్దార్‌ మురళీమోహనరావు గురువారం తెలిపారు. ఇకపై ఈ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 


డ్రోన్‌ కెమెరాలతో కర్ఫ్యూ పర్యవేక్షణ

 శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : నగరంలో అమలు చేస్తున్న కర్ఫ్యూని గురువారం డ్రోన్‌ కెమెరాలతో ఎస్పీ అమిత్‌బర్దర్‌ పర్యవేక్షించారు. ఏడురోడ్ల జంక్షన్‌, సూర్యమహల్‌ జంక్షన్‌, అరసవల్లి రోడ్డు, తదితర ప్రధాన జంక్షన్లలో మధ్యాహ్నం 12గంటల తరువాత నిబంధనలు ఎలా అమలవుతున్నాయన్నది డ్రోన్‌ కెమెరాలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అత్యవసరమైతేనే బయటకురావాలని, కర్ఫ్యూ వేళ బయటకువచ్చి ఇబ్బందులు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. పోలీసులు కూడా అప్రమ త్తంగా ఉండాలని  ఆదేశించారు. 

 

Updated Date - 2021-05-07T05:32:38+05:30 IST